అటు సాహిత్యంలోనూ, ఇటు చలనచిత్ర రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చిరస్మరణీయం చేసుకున్న హాస్యరస చక్రవర్తి ముళ్లపూడి వెంకటరమణ అంటే తెలియనివారు తెలుగు రాష్ట్రాలలో ఉండరు. చలన చిత్ర రంగంలో అత్యున్నత, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా అందుకున్న హాస్యరసాన్ని పండించడంలో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఆయన పిల్లల కోసం రాసిన ‘బుడుగు’ కథల్లో బుడుగు అనే అల్లరిపిల్లవాడి పాత్రను సృష్టించడమే కాక, ఎన్నో ప్రసిద్ధమైన రచనలు కూడా చేశారు. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరంలో 1931లో పుట్టిన ముళ్లపూడి, తనతొమ్మిదేళ్ల వయసులో చెన్నైకి తరలి రావడం జరిగింది.చదువుకుంటున్న వయసులోనే ఆయన తెలుగు సాహిత్యంమీద అభిమానాన్ని పెంచుకున్నారు. అడపా దడపా కథలు, వ్యాసాలు రాస్తుండేవారు. ఆయన చెన్నైకి వచ్చిన కొత్తల్లోనే బాపుతో పరిచయం ఏర్పడడం, అది జీవితాంతం కొనసాగి, అపూర్వ స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
సాహిత్యం విషయానికి వస్తే, ఆయన ఎక్కువగా హాస్య రసం ద్వారా సామాజిక సమస్యలను స్పృశించేవారు. ఎనిమిది అధ్యాయాలుగా 40 విశిష్టమైన కథలతో ఆయన రాసిన ‘కథారమణీయం-1’ ఒక అద్భుతమైన సాహితీ ప్రయోగంఅని చెప్పాల్సి ఉంటుంది.ఈ ఎనిమిది అధ్యాయాలలో ఆయన నవరసాలు పండిస్తూ సామాజిక విలువలతో కూడిన, హాస్యరస ప్రధానమైన కథలను రాయడం జరిగింది. ఇందులోని కొన్ని కథలను ఆ తర్వాత ‘సీతా కల్యాణం’, ‘భోగిమంట’, ‘స్వయంవరం’ తదితర చలన చిత్రాలుగా నిర్మించారు.ఆ తర్వాత ఆయన రాసిన ‘కథారమణీయం-2’లో మొత్తం 45 కథలను చేర్చారు. ఇవన్నీ హాస్యాన్ని పండించేవే. మధ్యతరగతి కుటుంబాలలోని అనుభవాలను, సన్నివేశాలను ఆయన హాస్యంగా మలిచారు. సమాజంలోని అట్టడుగు వర్గాల పట్ల వ్యవహరించే తీరు, మధ్యతరగతివారిలో పాదుకుపోయి ఉన్న మూఢనమ్మకాలను ఆయన నిజంగానే రమణీయమైన కథలుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఆయన ‘రుణానందలహరి’ పేరుతో ఒక చక్కని హాస్యప్రధానమైన నవల రాశారు. సగటు భారతీయుల కష్టనష్టాలనన్నిటినీ ఆయన ఇందులో పొందుపరిచారు. ఉద్యోగాలు లేకపోవడం, అప్పులు చేయడం, అవమానాలను ఎదుర్కోవడం వగైరా సమస్యలన్నీ ఇందులో కనిపిస్తాయి. నిజానికి ఆ కష్టనష్టాలన్నీ ఆయన చిన్నతనంలో అనుభవించినవే.
ఇక 1953 ప్రాంతంలో ఆయన ‘ఆంధ్రపత్రిక’ దినపత్రికలో విలేఖరిగా కూడా కొంత కాలం పనిచేశారు.ఆ సమయంలోనే ఆయనకు నండూరి రామ్మోహన్‌రావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం వంటి ప్రసిద్ధ జర్నలిస్టులు, రచయితలతో పరిచయం ఏర్పడి, అది కాలక్రమంలో ప్రగాఢమైంది. మొదట్లో దినపత్రికలో పనిచేసిన ముళ్లపూడి ఆతర్వాత వారపత్రికలోకి మారారు. అక్కడే ‘బుడుగు’ పాత్రతో హాస్య కథలను వండి వార్చడం ప్రారంభించారు. ఈ కథలన్నీ ప్రధానంగా పిల్లల కోసమే రాసినప్పటికీ, వాటిని పెద్దవాళ్లు కూడా చదివి ఆనందించేవారు. ఈ కథలు కడుపుబ్బనవ్వించడమే కాదు, పిల్లలకు విజ్ఞానాన్ని, వివేకాన్ని కూడా పంచేవి. ఆయన ఆంధ్రపత్రిక వారపత్రికలో చిత్ర సమీక్షలు రాసేవారు. ఆ సమీక్షలే ఆయనను సినిమా ప్రపంచానికి దగ్గర చేశాయి. ఆదుర్తి సుబ్బారావు, డూండి వంటి వారు ఆయనలోని ప్రతిభా పాటవాలను గుర్తించి ఆయనకు సినిమా రంగంలో స్థానం కల్పించారు. ‘కోతి కొమ్మచ్చి’, ‘ఇంకోతి కొమ్మచ్చి’, ‘ముక్కోతి కొమ్మచ్చి’ అనే పేర్లతో ఆయన తన ఆత్మకథను మూడు సంపుటాలుగా రాసుకున్నారు. ఒకమర్కటంలాగా తాను వివిధ రంగాలకు మారడం వగైరాలను దృష్టిలో సపెట్టుకుని ఆయన ఈ విధమైన పేర్లతో తన ఆత్మకథను రాయడం జరిగింది. ఈ హాస్యకథా చక్రవర్తి 2011 ఫిబ్రవరిలో కాలంచేశారు. ఆయన రాసిన ప్రతి పుస్తకమూ ప్రజాదరణ పొందింది. -జి. రాజశుక