హాస్య రచనలంటే మొదటగా గుర్తుకు వచ్చేది మునిమాణిక్యం నరసింహారావు. హాస్య రచనలు చేయడమంటే మాటలు కాదు. ఆషామాషీ వ్యవహారం కాదు. ‘బారిస్టర్ పార్వతీశం’ అనే సరికి మొక్కపాటి నరసింహ శాస్త్రి ఎలా గుర్తుకు వస్తారో, ‘కాంతాయమ్మ కైఫీయత్’ అనేసరికి మునిమాణిక్యం అలా గు ర్తుకు వస్తారు. ఓ గయ్యాళి మహిళ గురించి ఆయన రాసిన కాంతాయమ్మ కైఫీయత్ కథలు ఎవరినైనా కడుపుబ్బ నవ్విస్తాయి. ఒకసారి చదివితే జీవితాంతం మరచిపోని రచనలు అనేకం ఆయన కలం నుంచి పండాయి. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో 1898 మార్చి 15న వెంకాయమ్మ, సూర్య నారాయణ దంపతులకు పుట్టిన నరసింహా రావు రచనల్లో దాంపత్య జీవితంలోని సౌందర్యం హాస్యరస భరితంగా కథల రూపం దిద్దుకుంటుంది. ఆయన ఇరవయ్యో శతాబ్దం మొదటి పాదంలోనే కథకుడిగా రూపు దిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని మాధుర్యం ఆయన కథల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయన సృష్టించిన కాంతం అనే పాత్ర తెలుగు హిత్యంలోనే పెద్ద పీట వేసుకుందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు.
ఆయన రాసిన మొట్టమొదటి నవల ‘టీ కప్పులో తుఫాను’ ఆ రోజుల్లో తెలుగు నాట పెద్ద సంచలనమే సృష్టించింది. ఆయన రాసిన దాంపత్యోపనిషత్తు, గృహ ప్రవేశం, హాస్య కుసుమావళి, ఇల్లు ఇల్లా లు, మాణిక్యం వచనావళి, మంచివాళ్ల మాట తీరు వంటి పుస్తకాలు అప్పట్లో రికార్డులు సృష్టించాయి. తెలుగు సాహిత్యం ఒక ఒరవడి సృష్టించడానికి ఇవే చాలావరకు కారణమయ్యాయి. ఆయన హాస్య రచయితగా స్థిరపడినప్పటికీ, జీవిత ప్రారంభంలోనే కాక, ఆ తర్వాత కొన్నేళ్లపాటు నిజ జీవితంలో ఆయన పడ్డ కష్టాలు ‘పగవాడికి కూడా వద్దు’ అనిపిస్తాయి. అయితే, ఆయన ఏనాడూ వీటి గురించి బయటికి చెప్పుకోలేదు. ఎవరి సానుభూతి కోసమూ ప్రయత్నించలేదు. చివరి వరకూ ముసి ముసి నవ్వులు పండిస్తూనే జీవించారు. ఆయన చిరునవ్వు ఆయనలోని పాటిటివ్ దృక్పథానికి అద్దం పట్టేది.
దుర్భర పేదరిక జీవితాన్ని అనుభవిస్తూనే ఆయన తెనాలిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కానీ, డిగ్రీ చదవడానికి ఇక వీలు కాలేదు. అయితే, కొండా వెంకటప్పయ్యకు ఆయన కుటుంబంతో కొద్దిగా పరిచయం ఉంది. ఆయన రంగంలోకి దిగి, మునిమాణిక్యంలోని ప్రతిభను గుర్తించి, డిగ్రీలో చేర్పించి, చదువు చెప్పించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయనకు బందరు హిందూ హైస్కూలులో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న కాలంలోనే ఆయన కాంతం అనే మహిళను వివాహం చేసు కున్నారు. ఆయనకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చే సరికి హిందూ హైస్కూలులో ఉద్యోగాన్ని వదిలిపెట్టి పరిషత్తులో చేరారు. ఆ తర్వాత ఆయనకు ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చింది. చివరి వరకూ ఆయన అక్కడే ఉద్యోగం చేశారు.
హాస్యరస ఉపాసకుడు
ఆయన రాసిన మొదటి నవలలోనే ‘కాంతం’ పాత్రను పరిచయడం జరిగింది. కాంతం కుటుంబం కూడా ఓ నిరుపేద కుటుంబం. కాంతం కథలలో ఒక కథను ఆయన ఆకాశవాణిలో నాటకంగా వేశారు. అందులో ఆయన కుమార్తె కాంతంగా నటించి అందరినీ మెప్పించడం విశేషం. ఆయన కాంతం కథలకు ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. ఆయన నిజ జీవితంలోని దాంపత్య సన్నివేశాలను, కొన్ని చిన్న చిన్న సంఘటనలను ఆధారం చేసుకునే తన రచనలన్నిటినీ చేశారు. అందువల్లే అవి ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చిన అనేక హాస్య గ్రంథాలకు ప్రేరణ కూడా అయ్యాయి. దురదృష్టం ఏమిటంటే, ఆయన కాంతం కథలకు ప్రేరణ నిచ్చిన ఆయన భార్య కాంతం అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఆయన ఎంతో దిగులు పడ్డారు. కొద్ది కాలానికే ఆయన ఎంతగానో ప్రేమగా చూసుకున్న పెద్ద కుమార్తె రుక్కు తల్లి కూడా మరణించింది. ఆయన మానసికంగా కుప్పకూలి పోయారు.
కొద్ది కాలానికే ఈ విషాదం నుంచి తేరుకుని, వాళ్లను మరచిపోవడానికని మళ్లీ రచనలు ప్రారంభించారు. కొంత కాలానికి, బంధుమిత్రుల బలవంతం మీద రాజ్యలక్ష్మి అని మరో ఆమెను వివాహం చేసుకున్నారు. మునిమాణిక్యం నరసింహారావు తన రచనల ద్వారా మధ్య తరగతి కుటుంబంలోని సరిగమలనెన్నిటినీ కళ్లకు కట్టించారు. తెలుగు హాస్య రచయితల్లో మునిమాణిక్యానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన హాస్య రచయితగానే కాక, హాస్య ఉపాసకులుగా కూడా మంచి గుర్తింపు పొందారు. హాస్యం అనేది ఎక్కడ ఏ రూపంలో కనిపించినా వెంటనే రికార్డు చేసేవారు. రాసుకోవడమో, తన రచనల్లో కలిపి కొత్త ధోరణిలో పండించడమో జరిగింది. ఇంగ్లీషు హాస్య రచనలను కూడా ఆయన వదిలి పెట్టేవారు కాదు. విభిన్న మనసులను, మనుషులను అలరించే హాస్యోక్తులను, హాస్య సన్నివేశాలను ఎక్కడ ఏవిధంగా ఆయన దృష్టికి వచ్చినా, ఆయన వాటిని అనువదించడం కానీ, అనుసరించడం కానీ, భాషను కొద్దిగా మార్చి, స్థానికీకరణ చేసి, తెలుగు పాఠకులకు అందించేవారు. ఇక ఆయన కుమారుడు మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య కూడా మంచి రచయితగా రాణించారు.
– జి. రాజశుక