ఒక పురుషుడు విద్యావంతుడైతే ఉద్యోగమో లేదా వ్యాపారమే చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుని ఇటు పుట్టింటికి, అటు మెట్టినింటికి గౌరవం ఆర్జించి తన కుటుంబానికి తద్వారా జాతి భవిష్య త్తుకు పునాది వేస్తుందని భావించేవారు స్వామి వివేకా నంద. ‘ముదితల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పింప గన్’ అని అలనాటి ప్రఖ్యాత సాహితీవేత్త చిలకమర్తి లక్షీ నరసింహం వారు అన్నట్లు స్త్రీలకు కుటుంబ సభ్యులు సరైన ప్రోత్సాహం అందిస్తే వారు పందిరికి తీగ అల్లుకు పోయినట్లు ఏ రంగంలోనైనా ఇట్టే రాణించగలరని చరిత్ర మనకు చెబుతుంది.
ప్రాచీన కాలం నుండి, భారతదేశం శాస్త్ర సాంకేతిక మరియు గణిత రంగాలలో తన ప్రజ్ఞాపాటవాలతో ఎంతో ఖ్యాతినార్జించింది. ప్రపంచంలోనే మొట్టమొదట ‘జీరో’ లేదా ‘సున్న’ అనే భావన ఒక సంఖ్య మరియు దశాంశ వ్యవస్థగా ఏనాడో మన ప్రాచీన గణిత శాస్త్రజ్ఞులు కని పెట్టారు. మన దేశ చరిత్రకు వన్నె తెచ్చిన అనేక మంది గొప్ప శాస్త్రవేత్తల జాబితాలో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు, శాస్త్ర సాంకేతిక రంగాలలో తమదైన ముద్ర వేయాలని ఆకాంక్షించే యువతులకు వారి జీవి తాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. దేశం గర్విం చదగ్గ గొప్ప భారతీయ మహిళా శాస్త్రవేత్తలలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనందీబాయి గోపాల్ రావు జోషి
ఆనందీబాయి జోషి ప్రప్రథమ భారతీయ మహిళా వైద్యురాలు మరియు యునైటెడ్ స్టేట్స్‌లో పాశ్చ్యాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీని పూర్తి చేసిన మొదటి మహిళ. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో తన కంటే 20 ఏళ్లు పెద్ద వాడైన వితంతువుడితో వివాహం జరిగింది. ఆమె 14 సం వత్సరాల వయస్సులోనే ఒక కుమారుడికి జన్మనివ్వగా తగినంత వైద్య సదుపాయాలు లేకపోవడంతో నవజాత శిశువు వెంటనే మరణించాడు. ఆమె వ్యక్తిగత జీవితంలో సంభవించిన ఈ దుర్ఘటన ఆమెను వైద్య వృత్తిని ఎంచుకు నేందుకు ప్రేరేపించింది. విదేశాల్లో వైద్యవృత్తిని అభ్యసించ డానికి ఆమె భర్త అందించిన తోడ్పాటు ఆమె 1886లో ఉమెన్స్ మెడికల్ కాలేజీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి వైద్యు రాలిగా పట్టా అందుకోవడానికి దోహదపడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొదటి మహిళా వైద్య కార్యక్రమం కావడం విశేషం. 31 మార్చ్ 1865 న బ్రిటిష్ ఇండియా లోని బొంబాయి ప్రెసిడెన్కీ లో జన్మించిన ఆనందీ బాయి జోషి, 26 ఫిబ్రవరి 1887 న పూనా లో మరణించారు.
జానకీ అమ్మాళ్
1977లో భారత నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ శాస్త్ర వేత్త జానకీ అమ్మాళ్. ఆమె బొటానికల్ సర్వే ఆఫ్ ఇండి యాలో అత్యున్నత పదవి అయిన డైరెక్టర్ జనరల్ హోదాలో సేవలందించారు. ప్రకృతిపై ఎంతో మక్కువ గల జానకీ అమ్మాళ్ వృక్షశాస్త్రాన్ని ఎంచుకున్నారు. ఆ సమ యంలో మహిళలకు ఇది అసాధారణమైన ఎంపిక. ఆమె 1921లో ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసారు. వృక్ష జాతుల భౌగోళిక స్వరూపం, క్రోమోజోమ్‌లపై కణ ప్రభావం మరియు ఫైటోజియో గ్రఫీతో అవి ఎలాంటి సంబంధం కలిగి ఉంటాయి అనే అంశంపై జన్యుశాస్త్ర విభాగమైన సైటోజెనెటిక్స్‌లో ఆమె శాస్త్రీయ పరిశోధనను కొనసాగించారు. ఆమె చెరుకు మరియు వంగ వంగడాలపై విస్తృత పరిశోధనలు జరి పారు. బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్కీలోని థలస్సేరి లో 4 నవంబర్ 1897 న జన్మించిన జానకీ అమ్మాళ్ 7 ఫిబ్రవరి 1984 న మరణించారు.
కమలా సోహోనీ:
సైంటిఫిక్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందిన తొలి భారతీయ మహిళ కమలా సోహోనీ. కేవలం మహిళా పరిశోధకురాలు అనే కారణంగా తొలుత ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరించబడింది. అయితే ఆ సంస్థకు అప్పటి డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సివి రామన్‌కి ఆమె మొట్ట మొదటి మహిళా విద్యార్థిని కావడంతో పాటు ఆమె అద్భు తమైన ప్రతిభను గుర్తించిన ఆయన ఆమెకు తదుపరి పరి శోధనను కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు. మొక్కల కణజాలంలోని ప్రతి కణం అన్ని మొక్కల కణాల ఆక్సీ కరణలో పాల్గొనే ‘సైటోక్రోమ్ సి’ అనే ఎంజైమ్‌ని కలిగి ఉంటుందనే విషయాన్ని ఆమె తన పరిశోధనల ద్వారా కనుగొన్నారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో 8 జూన్ 1912 న జన్మించిన కమలా సోహానీ 28 జూన్ 1997న మరణించారు.
అసీమా ఛటర్జీ:
ఈమె ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోకెమిస్ట్రీ (మొక్కల నుండి సంగ్రహిం పబడిన రసాయనాలు) రంగాలలో ఆమె చేసిన కృషికి ఎంతో గుర్తింపు పొందింది. 1936లో కలకత్తా విశ్వవిద్యా లయంలోని స్కాటిష్ చర్చి కళాశాల నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రురాలైన అనంతరం ఆమె తన పరిశోధన లను కొనసాగించారు. వింకా ఆల్కలాయిడ్స్ (యాంటీ-క్యాన్సర్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పెరివింకిల్ నుండి ఉద్భవించింది) మరియు యాంటీ-ఎపిలెప్టిక్ మరియు యాంటీ మలేరియా ఔషధాల అభివృద్ధిపై ఆమె జరిపిన విస్తృత పరిశోధనలతో ఆమె బహుళ ప్రాచుర్యం పొం దారు. నాటి బ్రిటిష్ ఇండియా బెంగాల్ ప్రెసిడెన్సీ లోని కలకత్తాలో 23 సెప్టెంబర్ 1917 న జన్మించిన అసీమా ఛటర్జీ 22 నవంబర్ 2006 న మరణించారు.
రాజేశ్వరీ ఛటర్జీ:
స్వాతంత్రానికి పూర్వం 1946లో విదేశాల్లో విద్య నభ్యసించడానికి కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్ పొందిన మొదటి మహిళా ఇంజనీర్ రాజేశ్వరి ఛటర్జీ. ఆమె అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాల యం లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు. డాక్టరేట్ పట్టా పొందిన తర్వాత, ఆమె భారత దేశానికి తిరిగి వచ్చి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ లోని ఎలక్ట్రి కల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఫ్యాకల్టీ మెంబర్‌గా చేరారు. తన భర్తతో కలిసి మైక్రోవేవ్ పరిశో ధనా ప్రయోగశాలను ఏర్పాటు చేసిన ఆమె ఆ రంగంలో అద్వితీయమైన కృషి చేసి మైక్రోవేవ్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా నిలిచారు. నాటి బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీలోని కర్ణాటక లో 22 జనవరి 1922 న జన్మిం చిన రాజేశ్వరీ ఛటర్జీ 3 సెప్టెంబర్ 2010 న మర ణించారు.
కల్పనా చావ్లా
అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా. ఆమె మొదటి సారిగా 1997లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) స్పేస్ షటిల్ కొలంబియా ద్వారా అంతరి క్షంలోకి పంపిన బృందంలో మిషన్ స్పెషలిస్ట్ మరియు ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్‌గా ప్రయాణించింది. 1982లో అమెరికా వెళ్లిన ఆమె, 1984లో ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఆ తరువాత 1986లో రెం డవ మాస్టర్స్ డిగ్రీని కొలరాడోలోని బౌల్డర్ విశ్వవిద్యా లయం నుండి మరియు 1988లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీ హెచ్ డి పూర్తి చేసింది. ఫిబ్రవరి 1, 2003న స్పేస్ షటిల్ కొలంబియా తన తిరుగు ప్రయాణంలో భూకక్ష్య లోకి చేరుకుంటున్న సమయంలో దురదృష్టవశాత్తు తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఒక్క సారిగా పేలిపోవడంతో కల్పనా చావ్లా తో సహా అందులోని బృందం లోని సభ్యులు అందరూ మృతి చెందారు. కర్నాల్, హర్యానా (నాటి తూర్పు పంజాబ్) లో 17 మార్చ్ 1962 న జన్మించిన కల్పనా చావ్లా 1 ఫిబ్రవరి 2003 న స్పేస్ షటిల్ కొలం బియా పేలుడు దుర్ఘటనలో మరణించారు.
డా ఇందిరా హిందూజా
బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ‘హ్యూమన్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ అనే విషయం పై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్. ఇందిరా హిందూజా ఒక భారతీయ స్త్రీ జననేం ద్రియ నిపుణురాలు, ప్రసూతి మరియు వంధ్యత్వ నిపుణు రాలు. ఆమె భారత దేశంలో మొట్ట మొదటి గేమేట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ద్వారా జనవరి 4, 1988న జన్మించిన శిశు ప్రసవానికి మార్గదర్శకత్వం వహించింది. దీనికి ముందు ఆమె ఆగస్టు 6, 1986న కిమ్ హాస్పిటల్‌లో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్-ట్యూబ్ బేబీ ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించింది. రుతుక్రమం ఆగిన మరియు అకాల అండాశయ వైఫల్యం ఉన్న రోగుల కోసం ఓసైట్ డొనేషన్ ప్రక్రియ ను అభివృద్ధి చేసిన ఆమె మాతృత్వం కోసం పరితపించే ఎందరో మహిళలకు ఆశా కిరణం లా నిలిచింది. ఈ ప్రక్రియ జనవరి 24, 1991న తొలి శిశువు జన్మించడం వైద్య చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. నాటి బ్రిటిష్ ఇండియా, సింద్ లోని షికార్ పూర్ లో 21 ఆగష్టు 1946 న జన్మించారు.
డా ఆదితి పంత్
భారత్‌లోని ప్రఖ్యాత ఓషనోగ్రఫీ (సముద్ర) శాస్త్రవేత్త లలో ఒకరైన డా ఆదితి పంత్ భూగర్భ మరియు సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి 1983లో అంటార్కిటి కాను సందర్శించిన భారతీయ శాస్త్రవేత్తల బృందంలో మొదటి మహిళ. పూణే విశ్వవిద్యాలయంలో బి ఎస్ సి చదువుతున్న రోజులలో ఆమె అలిస్టర్ హార్డీ రచించిన ది ఓపెన్ సీ అనే పుస్తకాన్ని చదివడంతో ఓషనోగ్రఫీ పై ప్రేరణ పొందింది. యూనివర్శిటీ ఆఫ్ హవాయిలో మెరైన్ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆమెకు అమెరికా ప్రభుత్వ స్కాలర్‌షిప్ లభించింది. ఆమె లండన్ యూనివర్సిటీలోని వెస్ట్‌ఫీల్డ్ కాలేజీలో పీహెచ్‌డీ చేసింది. పీహెచ్‌డీ కోసం ఆమె సముద్రపు ఆల్గే యొక్క శరీరధర్మ శాస్త్రంపై పరిశోధన చేసారు. ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మరియు నేషనల్ కెమికల్ లాబొరేటరీలో పనిచేశారు. డా ఆదితి పంత్ నాటి బ్రిటిష్ ఇండియా, బొంబాయి ప్రెసిడెన్సీ లోని నాగపూర్ లో 5 జూలై 1943 న జన్మించారు.
ఊయలని ఊపే చేయి అవసరమైతే ప్రపంచాన్ని సైతం శాసిస్తుందని నిరూపించిన అలనాటి రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయి, రజియా సుల్తానా తో పాటు స్వాతంత్రోద్యమంలో తమదైన శైలిలో ఉద్యమించిన వీర వనితలు ప్రీతిలత వాడ్దేదర్, బసంతి దేవి, అరుణా ఆసఫ్ అలీ, కమలా దేవి ఛటోపాధ్యాయ, మాతంగిని హాజ్రా, బీనా దాస్, సునీతి చౌధరి, ఝాల్కారి బాయి, సావిత్రి బాయి ఫూలే, బేగం హజ్రత్ మహల్, రాణి గైడిన్ల్యూ, దుర్గా భాభీ, కిట్టూర్ చెన్నమ్మ, సరళా దేవి చౌధురాణి, మీరాబెన్ పటేల్ ల గురించి కూడా మనకు తెలుసు. చరిత్ర పుటలలో తమ కంటూ ఒక పేజీని సృష్టించుకున్న స్త్రీమూర్తులను ఆదర్శంగా తీసుకుని నేటి యువతులు కూడా అంతర్జా తీయ మహిళా దినోత్సవం 2023 స్ఫూర్తితో తామెంచు కున్న రంగాలలో దూసుకుపోతూ దేశాభివృద్ధికి పాటుపడా లని కోరుకుందాం.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్, గైడ్స్, తెలంగాణ
8885050822