Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్NATO: డేంజర్‌ జోన్‌లో రష్యా భద్రత

NATO: డేంజర్‌ జోన్‌లో రష్యా భద్రత

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్‌ తాజాగా చేరింది. ఒక వైపు ఏడాదిగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంటే మరో వైపు నాటో కూటమిలోకి ఫిన్లాండ్ చేరడం అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో ఆసక్తి కలిగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్‌ యూనియన్‌తో వింటర్ వార్ పేరుతో ఫిన్లాండ్ యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో ఫిన్లాండ్ ఓటమి పాలైంది.అప్పటి నుంచి ప్రపంచ రాజకీయాల వరకు ఏ సైనిక కూటమిలోనూ ఫిన్లాండ్ చేరలేదు. ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన సమయంలోనూ ఫిన్లాండ్ రాజకీయంగా తటస్థ వైఖరి కొనసాగించింది.రష్యాకు సంబంధించినంతవరకు భద్రతాపరంగా ఫిన్లాండ్ ఓ కీలక దేశం. రష్యాతో ఫిన్లాండ్‌ దేశానికి సుదీర్ఘ సరిహద్దు ఉంది. కొంతకాలంగా నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరుతుందన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. అయితే నాటోకూటమిలో చేరడానికి ఉక్రెయిన్ ఆసక్తి చూపడమే రష్యా సైనిక దాడికి ప్రధాన కారణమన్న సంగతి బహిరంగ రహస్యమే. దీంతో నాటో కూటమిలో చేరే విషయమై ఫిన్లాండ్ చాలా కాలం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎటుపోయి ఎటు వస్తుందోననే భయంతో నాటోకూటమిలో చేరాలన్న నిర్ణయాన్ని ఫిన్లాండ్ మార్చుకుని ఉండొచ్చని రాజకీయ పండితులు పరిస్థితిని విశ్లేషించారు.అయితే కొన్నిరోజులుగా నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరబోతోందన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేశారు. ఒకవైపు ఉక్రెయిన్ పరిస్థితి చూస్తూ ఫిన్లాండ్ దుస్సాహాసానికి పాల్పడుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే ఊహాగానాలు చివరకు నిజమయ్యాయి. కిందటేడాది మే నెలలో సభ్యత్వం కోసం ఫిన్లాండ్ పెట్టుకున్న దరఖాస్తును నాటో సైనిక కూటమి తాజాగా ఆమోదించింది. అంతిమంగా నాటో సైనిక కూటమిలో 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరింది.

- Advertisement -

భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామన్న రష్యా
నాటో కూటమిలో ఫిన్లాండ్ దేశం చేరడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో ఫిన్లాండ్ నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను దీటుగా ఎదుర్కొంటామని రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. నాటో కూటమిలోకి ఫిన్లాండ్ అడుగుపెట్టడంతో ఉత్తర యూరప్‌లో కొన్ని దశాబ్దాలుగా కొనసాగిన సుస్థిరత ప్రమాదంలో పడిందని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. నాటో కూట‌మిలో ఫిన్లాండ్ స‌భ్య దేశంగా చేరడంతో రష్యా భద్రత ప్రమాదంలో పడ్డట్టే. ఎందుకంటే సభ్యదేశం కావ‌డంతో ఫిన్లాండ్ దేశంలో నాటో సైనిక ద‌ళాలు తిష్ట వేయ‌వ‌చ్చు. అంతేకాదు క్షిప‌ణుల‌ను కూడా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. రష్యాలోని ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేసి ఫిన్లాండ్ నుంచి క్షిప‌ణుల‌ను ప్రయోగించవచ్చు. అలా క్షిప‌ణుల‌ను ప్రయోగిస్తే కొన్ని నిమిషాల్లోనే టార్గెట్ చేరుకుంటుంది. అంటే భద్రతాపరంగా ర‌ష్యా డేంజ‌ర్ లో చిక్కుకున్నట్లే. నాటో సైనిక దళాలు ఇంకా క్లారిటీతో చెప్పాలంటే అమెరికా బ‌ల‌గాలు ఎక్కడ దాడి చేస్తాయోన‌ని రష్యా ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూ గ‌డ‌పాల్సి ఉంటుంది. ఇందులో ఎవ‌రికీ రెండో అభిప్రాయం ఉండ‌న‌క్కర్లేదు.

నాటో సైనికకూట‌మి క‌థేమిటి ?
1949లో నాటో కూటమి ఏర్పాటు అయింది. నాటో మౌలికంగా ఒక సైనిక కూట‌మి.రెండో ప్రపంచ యుద్ధం త‌రువాత అమెరికాతో పాటు కొన్ని యూర‌ప్ దేశాలు క‌లిసి నాటో కూట‌మిని ఏర్పాటు చేసుకున్నాయి.అమెరికా,సోవియట్ యూనియన్ మ‌ధ్య ప్రచ్ఛన్న యుద్ధం జ‌రుగుతున్న కాలంలో ఈ కూట‌మి ఏర్పాటైంది. నాటోలో మొదట ప‌న్నెండు సభ్య దేశాలు ఉండేవి. 1997 నుంచి విస్తరణపై నాటో కూట‌మి దృష్టి పెట్టింది. దీంతో నిన్నమొన్నటివరకు నాటో కూట‌మి స‌భ్య దేశాల సంఖ్య 30కి పరిమితమైంది. నాటో సైనిక కూటమిలోని సభ్య దేశాలకు కొన్ని నిబంధనలుంటాయి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు నాటోలోని సభ్యదేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కూట‌మి ఏర్పాటులో ఉన్న మౌలిక సూత్రం ఇదే. అయితే సోవియట్ యూనియన్‌ను విచ్ఛిన్నం చేయడమే నాటో కూటమి ఏర్పాటు వెనుక ఉన్న హిడెన్ అజెండా అని అప్పట్లో అనేక సోష‌లిస్టు దేశాలు ఆరోపించాయి. ఈ ఆరోప‌ణ‌ల సంగ‌తి ఎలాగున్నా ఆ త‌రువాత ప్రపంచవ్యాప్తంగా అనేక పెను మార్పులు సంభ‌వించాయి.సోవియట్ యూనియన్ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింది.ఆ తరువాత ప్రపంచం ఒకే ధృంగా మారిపోయింది. ప్రపంచంలోనే అగ్రరాజ్యం సూపర్ పవర్‌గా ఎదిగింది. అస‌లు సోవియట్ యూనియన్ అనేదే అంత‌రించిన త‌రువాత నాటో కూటమి అవ‌స‌ర‌మే లేదన్నది చాలామంది అంత‌ర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం. అమెరికా ఆధిప‌త్యాన్ని స‌వాలు చేసే దేశ‌మే ప్రపంచపటంపై లేన‌ప్పుడు నాటో కూటమి ఎందుక‌న్న ప్రశ్న కూడా తెర‌పైకి వచ్చింది. అయితే సోషలిస్టు దేశాల నుంచి వచ్చిన అభ్యంతరాలను,మేధావుల అభిప్రాయాల‌ను అమెరికా కొట్టిపారేసింది. నాటో కూట‌మిని కొన‌సాగించింది. కూటమిలోని సభ్యదేశాలు అండగా నిలబడింది. అంతేకాదు నాటో కూటమిని మరింతగా విస్తరించడంపై అగ్రరాజ్యం దృష్టి పెట్టింది.అయితే నాటో కూటమిలోకి ఫిన్లాండ్ చేరడం పరోక్షంగా రష్యాను రెచ్చగొట్టడమేనంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఫిన్లాండ్ చేరిక వెనుక అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి ఉందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది.చివరకు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని ప్రపంచశాంతిని కోరుకునేవారు ఆందోళన పడుతున్నారు.

– ఎస్‌. అబ్దుల్ ఖాలిక్ 63001 74320 సీనియర్ జర్నలిస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News