ప్రపంచ దేశాలు 21వ శతాబ్ద సరికొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. నిరుద్యోగమే ప్రధాన సమస్యగా నిలుస్తున్నది. యువభారతాన్ని ఉత్తేజితం చేయడానికి మన యువతను నైపుణ్య వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. యువతీ యువకుల్లో ఆకర్షణీయ వ్యక్తిత్వం, దేహదారుడ్యం, నైపుణ్యతలను నేటి ఆధునిక యువతలో నిర్మించాలనే సదుద్దేశ్యంతో స్వతంత్ర భారత్ తొలి గడియల్లో 1948లో జాతీయ యువ సైనిక దళాన్ని (నేషనల్ కెడెట్ కోర్, యన్‌సిసి) దేశవ్యాప్తంగా పాఠశాల, యూనివర్సిటీ విద్యాలయాల్లో నెలకొల్పడం జరిగింది. త్రివిధ దళాలకు చెందిన సైనిక బలగాలు, ఇతర భద్రతా దళాలు, పారామిలిటరీ, పోలీస్ శాఖల్లో ఉన్న కొరతను తీర్చాలని, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని, దేశభక్తి / క్రమశిక్షణలను అలవర్చాలని, యువశక్తిని దేశాభివృద్ధికి వినియోగించాలనే పలు లక్ష్యంతో పాటు దేశం ఎదుర్కొంటున్న అత్యవసర సంక్షోభ సమయాల్లో యువతను భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో యన్‌సిసి లేదా యువ సైనిక దళం ఏర్పాటు చేయబడింది. దేశ రక్షణ రంగాల్లో యువత చేరి దేశసేవ చేసే అవకాశాలను పొందాలనే ప్రేరణను కలిగించడం, జాతీయతాభావాన్ని పోషించడం, క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా పండిట్ కుంజ్రూ కమిటీ సిఫార్సులతో 15 జూలై 1948న పార్లమెంట్ 31వ యన్‌సిసి చట్టం ద్వారా “జాతీయ యువ సైనిక దళం (నేషనల్ కెడెట్ కోర్, యన్‌సిసి)” ఏర్పాటు చేయబడింది. తొలుత 38,500 కెడెట్ బాలుర దళం ప్రారంభించబడిన యన్‌సిసి దళంలో నేడు దేశవ్యాప్త పాఠశాలలు/కళాశాలల్లో 14 లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులకు (కెడెట్లకు) ప్రతి ఏట మిలటరీ సిబ్బంది చేత యన్‌సిసి శిక్షణ ఇవ్వబడుతున్నది. పటిష్ట మిలటరీ శిక్షణలో భాగంగా శారీరక దేహదారుడ్యం, మానసిక పరిపక్వత ఫలించేలా యన్‌సిసి శిక్షణాంశాలను రూపొందించారు.
యన్‌సిసి దినోత్సవం:
ప్రతియేటా నవంబర్ 4వ ఆదివారం రోజున, అనగా 26 నవంబర్ 2023న 75వ యన్‌సిసి వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల ప్రకారం మరో లక్ష మంది విద్యార్థినీవిద్యార్థులకు అదనంగా యన్‌సిసి శిక్షణ అవకాశాలు అందిస్తున్న వేళ, యన్‌సిసిలో తీసుకురావలసిన మార్పులు ప్రతిపాదించడానికి, ఎక్కువ మంది యువతను చేర్చుకోవడానికి, శిక్షణలో మార్పులు సూచించడానికి మహేంద్ర సింగ్ ధోనీ, ఆనంద్ మహేంద్ర, రాజవర్థన్ రాథోడ్ లాంటి 15 మంది ప్రముఖులతో కూడిన ప్రత్యేక హైలెవల్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ, సముద్రతీర ప్రాంతాల్లో నేవీ, ఏయిర్ బేస్ ప్రాంతాల్లో ఏయిర్ ఫోర్స్ కెడెట్లకు శిక్షణలు ఇచ్చేందుకు లక్ష యన్‌సిసి సీట్లు ఇటీవల పెంచడం హర్షదాయకం. ఇలాంటి సుశిక్షితులైన కెడెట్ల సేవలను ఆపద/విపత్తు సమయాల్లో వినియోగించుకోనున్నారు.
యన్‌సిసి శిక్షణాంశాలు:
యన్‌సిసిలో ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్స్ విభాగాల్లో విద్యార్థులకు సైనిక ఆయుధాల వివరణలు, ఆయుధాల వినియోగ కళ, దేశ మిలటరీ చరిత్ర, యుద్ధనీతి, దేశ సమగ్రత, క్రీడాస్పూర్తి, సేవానిరతి, జాతీయ సమైక్యత, నాయకత్వ లక్షణాలు, సాయుధ కవాతులు, మత సామరస్యం, లౌకిక వాదం, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాల్లో మిలటరీ సిబ్బంది చేత ఆర్మీ, నావీ, ఏయిర్‌ఫోర్స్ కెడెట్లకు శిక్షణ ఇవ్వబడుతున్నది. అత్యంత పటిష్టమైన వ్యవస్థ కలిగిన యన్‌సిసి ‘ఐక్యత మరియు క్రమశిక్షణ (యునిటీ అండ్ డిసిప్లైన్)’ అనబడే నినాదంతో పని చేస్తున్న యన్‌సిసి ద్వారా యువతను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి జరుగుతున్నది. యన్‌సిసి అధ్యాపక అధికారులు, త్రివిధ దళాల శిక్షణ సిబ్బంది, రక్షక బలగాల అధికారులు, విద్యార్థి కెడెట్లు, పౌర సిబ్బంది సమన్వయంతో యన్‌సిసి శిక్షణ పటిష్టంగా జరుగుతుంది.
యన్‌సిసి విస్తరణ:
ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యన్‌సిసిలో దేశవ్యాప్తంగా 17 డైరెక్టరేట్లు, 96 గ్రూపులు, 684 ఆర్మీ యూనిట్లు, 69 నావల్ యూనిట్లు మరియు 61 ఏయిర్ స్క్వాడ్రన్లుగా విస్తరించి ఉన్నాయి. పాఠశాలల్లో 8-10 తరగతి బాల బాలికలకు జూనియర్ డివిజన్/వింగ్, కళాశాల విద్యార్థినీవిద్యార్థులకు సీనియర్ డివిజన్/వింగ్ విభాగాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి యన్‌సిసి విభాగంగా విద్యాలయం నుంచి అధ్యాపకులు లేదా ఉపాద్యాయులు అసోసియేట్ యన్‌సిసి అధికారులుగా శిక్షణలను సమన్వయ పరుస్తారు. ఆర్మీ కెడెట్లకు ఖాకీ, నావల్ కెడెట్లకు తెలుపు, ఏయిర్ ఫోర్స్ కెడెట్లకు నావీ బ్లూ యూనిఫామ్‌లు ఉంటాయి. శిక్షణలో ప్రతియేటా నియమిత పరెడ్లను విద్యాలయ ప్రాంగణాల్లో నిర్వహిస్తూ, ఏడాదికి ఒక యన్‌సిసి (7-రోజుల) శిబిరంలో పాల్గొనేలా విస్తృత ఏర్పాటు చేస్తారు.
యన్‌సిసి ప్రయోజనాలు:
యన్‌సిసి నిర్వహించే ముఖ్యశిబిరాల్లో రిపబ్లిక్ డే, లీడర్‌షిప్, నేషనల్ ఇంటిగ్రేషన్, ట్రెక్కింగ్, తలసేన, వాయుసేన, నావ్‌సేన, సంయుక్త వార్షిక శిక్షణ, ఆర్మీ అటాచ్‌మెంట్, శిలారోహణ, వార్షిక శిక్షణ లాంటి శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. యన్‌సిసి శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఏ, బి మరియు సి సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. పాఠశాలలకు చెందిన జూనియర్ డివిజన్/వింగ్ కెడెట్లకు రెండు సంవత్సరాల శిక్షణ తరువాత ‘ఏ’ సర్టిఫికెట్లు, రెండు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసుకున్న కళాశాల సీనియర్ డివిజన్/వింగ్ కెడెట్లకు ‘బి’ సర్టిఫికెట్లు, ‘బి’ పూర్తి చేసిన కెడెట్లకు మూడవ సంవత్సరం శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ‘సి’ సర్టిఫికెట్లు అందిస్తారు. యన్‌సిసి శిక్షణ పూర్తి చేసిన కెడెట్లలో అలవడిన వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి, శారీరకమానసిక పరిపక్వత, నాయకత్వలక్షణాలు లాంటి సుగుణాలు జీవితాంతం ఉపయోగపడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యన్‌సిసి ‘సి’ సర్టిఫికెట్‌లో బి/ఏ గ్రేడ్ పొందిన కెడెట్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగ నియామక ప్రక్రియలో వ్రాతపరీక్ష మినహయింపు ఉంటుంది. యన్‌సిసి బి/సి సర్టిఫికెట్లు కలిగిన యువతకు ఆర్మీ/నావీ/ఏయిర్ ఫోర్స్ దళాల్లో రిక్రూట్‌మెంట్ ద్వారా సైనికుల ఎంపికలో రిజర్వేషన్ ఉంటుంది. అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగాల్లో యన్‌సిసి కెడెట్లకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా కల్పించబడింది. హెచ్‌ఏయల్, బిహెచ్‌ఈయన్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు యన్‌సిసికి ప్రాధాన్యతను ఇస్తాయి. ఎమ్‌సెట్, నీట్, విశ్వవిద్యాలయ కోర్సుల్లో యన్‌సిసి సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ కల్పిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో యన్‌సిసి:
తెలంగాణ/ఆంధ్రప్రదేశ్లకు చెందిన యన్‌సిసి డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‍లో ఉన్నది. మన తెలుగు రాష్ట్రాలలో యన్‌సిసి కెడెట్ల సంఖ్య దాదాపు 1.3 లక్షలకు పైగా ఉన్నారు. తెలంగాణలో 4 ప్రాంతీయ కేంద్రాలు లేదా గ్రూపు హెడ్‌క్వార్టర్లు ( హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్), ఆంధ్రప్రదేశ్‌లో 5 గ్రూపు ప్రాంతీయ కేంద్రాలు (విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, గుంటూర్, రాజమండ్రి) యన్‌సిసి శిక్షణను పర్యవేక్షిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో 67 యన్‌సిసి బెటాలియన్లు శిక్షణలో నిమగ్నం అవుతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ మరియు రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రిత్వశాఖలు నిధులను సమకూర్చి శిక్షణను అంతిస్తున్నారు.
అందరికీ యన్‌సిసి శిక్షణ ఇవ్వలేమా..? దేశవ్యాప్తంగా యన్‌సిసి శిక్షణ కొద్ది విద్యాసంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. యన్‌సిసి శిక్షణకు యువతలో ఆసక్తి అధికంగా ఉంది. యన్‌సిసిని పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థి దశలో యన్‌సిసి శిక్షణ ఇప్పటి వరకు విద్యార్థులకు స్వచ్ఛంధ పద్దతిలోనే నడుస్తున్నది. భవిష్యత్తులో యన్‌సిసి శిక్షణ అందరికీ తప్పనిసరి చేయాలనే అభిప్రాయం కూడా మెజారిటీ తల్లితండ్రుల్లో ఉంది. కొన్ని దేశాల్లో యువత విద్యాభ్యాస అనంతరం విధిగా కొన్ని మాసాలు/ఏండ్లు రక్షణ శాఖలో సైనికుడిగా పని చేయాలనే నియమం కూడా అమలు అవుతున్నది. ప్రతి విద్యార్థి యన్‌సిసి శిక్షణ పొంది, పరిపూర్ణ వ్యక్తిత్వంగల బాధ్యతాయుత యువతగా ఎదిగి, సివిల్ డ్రస్‌లో సైనికుడి వలె సన్మార్గంలో నడవాలని, సివిల్ పోలీస్ వలె అవినీతి/అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు దేశ సేవ చేస్తూ నవ సమాజ సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ఆశిద్దాం.
కెప్టెన్: డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
విశ్రాంత అసోసియేట్ యన్‌సిసి అధికారి
9949700037