Friday, June 28, 2024
Homeఓపన్ పేజ్NCERT syllabus point of controversy always: పాఠ్యాంశాలను వక్రీకరిస్తున్నారా?

NCERT syllabus point of controversy always: పాఠ్యాంశాలను వక్రీకరిస్తున్నారా?

జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణ మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి) విద్యార్థుల పాఠ్య పుస్తకాలకు సంబంధించి తలపెట్టిన మార్పులు, చేర్పులు నిర్విరామంగా, నిర్నిబద్ధంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చరిత్ర, రాజనీయ శాస్త్రం వంటి సబ్జెక్టులలో అనేక మార్పులు చేపట్టడం జరుగుతోంది. ఈ సంస్థ అసలైన చరిత్ర పేరుతో అనేక అసత్యాలను, అభూత కల్పనలను పాఠ్యాంశాల్లో జొప్పించే ప్రయత్నం చేస్తోందంటూ కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని వర్గాలు, కొందరు మేధావులు, చరిత్ర పరిశోధకులు గగ్గోలు పెడుతున్నా ఈ బృహత్తర కార్యక్రమం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చరిత్రకు వక్రభాష్యం చెప్పడం ప్రారంభమైందని, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో సహా కొందరు మేధావులు విమర్శించడం జరుగుతోంది. అయితే, మొఘల్‌ రాజులకు సంబంధించి కాంగ్రెస్‌, వామపక్ష సంబంధిత పరిశోధకులు, చరిత్రకారులు జొప్పించిన అంశాలను మాత్రమే తొలగించడం జరుగుతోందని, వాస్తవ చరిత్రను విద్యార్థులకు తెలియ జేయడం మాత్రమే తమ ఉద్దేశమని ఈ పరిశోధన మండలి స్పష్టం చేసింది.
వేలాది దేవాలయాలను ధ్వంసం చేసి, ప్రజల ఆస్తులను కొల్లగొట్టి, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ఛిన్నాభిన్నం చేసి స్వదేశాలకు వెళ్లిపోయిన మొఘల్‌ రాజుల గురించి చరిత్రకారులు, పరిశోధకులు గొప్పగా చెప్పడం, అవాస్తవాలను అందించడం జరిగిందని, అశోకుడు, చంద్రగుప్తుడు, శాతవాహనులు వంటి రాజులు దేశానికి చేసిన సేవలను పూర్తిగా విస్మరించడమో, తక్కువ చేసి చెప్పడమో జరిగిందని ఈ మండలితో పాటు బీజేపీ ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వడం జరిగింది. చరిత్రను వక్రీకరించింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, వామపక్ష మేధావులే తప్ప ఈ పరిశోధక మండలి కాదని కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ స్పష్టం చేసింది. భారత దేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రను కూడా పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీకే అంకితం చేయడంతో పాటు, నెహ్రూ తదితర కాంగ్రెస్‌ నాయకులనే యోధులుగా చిత్రీకరించి, సుభాస్‌ చంద్రబోస్‌, వీర్‌ సావర్కర్‌, భగత్‌ సింగ్‌ వంటి నాయకుల త్యాగాల గురించి ప్రస్తావించలేదని కూడా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి అభూత కల్పనలను, అవాస్తవాలను సరిదిద్దడం జరుగుతోందే తప్ప చరిత్రను వక్రీకరించడం జరగడం లేదని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు.
బాబ్రీ మసీదు విధ్వంసం గురించిన వాస్తవాలను ప్రచురించడం లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా కొందరు విద్యావేత్తలు స్పందించారు. ఇందులో బాబ్రీ మసీదు గురించి స్పందించడం జరిగిందని, బీజేపీ నాయకులు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగిందని వారు చెప్పారు. గోధ్రా అల్లర్ల విషయంపై కొన్ని వర్గాలు చేసిన విమర్శలకు స్పందిస్తూ, గోద్రా అల్లర్ల గురించి స్పందించాల్సిన పక్షంలో అంతకు ముందు జరిగిన అల్లర్ల గురించి కూడా వివరించాల్సి ఉంటుందని మండలి ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వీటన్ని గురించి పాఠ్య పుస్తకాల్లో వివరంగా రాయాల్సిన అవసరం లేదని, “మేం సానుకూల దృక్పథం కలిగిన విద్యార్థులను తయారు చేయారు చేయాలే తప్ప హింసాత్మక విద్యార్థులను తయారు చేయలేం” అని మండలి చైర్మన్‌ దినేశ్‌ సక్లానీ వివరించారు. ఈ పాఠ్యాంశాల్లో భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజేసే అంశాలకు, వాస్తవ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని కూడా ఆయన వివరించారు.
“భారతదేశ చరిత్రను దృష్టిలో పెట్టుకుని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రత్యేక కమిటీలు, కమిషన్ల ద్వారా అనేక పర్యాయాలు పాఠ్యాంశాలను మార్చడంజరిగింది. అయితే, ఆ మార్పులు, చేర్పు లన్నీ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్‌ పార్టీ దృక్పథానికి అనుగుణంగా మాత్రమే జరిగాయి. అటువంటి మార్పులు జరిగినప్పుడు వామపక్ష మేధావులు, వామపక్ష చరిత్రకారులు ఇప్పటి మాదిరిగా అభ్యంతరపెట్టే ప్రయత్నమేమీ చేయలేదు. ఇటీవల చోటు చేసుకున్న దేశ స్వాతంత్య్ర చరిత్రనే తారుమారు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది” అని బీజేపీ ప్రభుత్వంలోని విద్యా శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. దేశ చరిత్ర అతి దారుణంగా వక్రీకరణకు గురవుతున్న ప్పటికీ జవహర్‌ లాల్‌ నెహ్రూ నుంచి రాజీవ్‌ గాంధీ వరకు ఎవరూ అభ్యంతరం తెలియజేసిన పాపాన పోలేదు. పాఠ్యాంశాలను సైతం ఓటు బ్యాంకు రాజకీయాలకు, బుజ్జగింపు ధోరణులకు వాడుకోవడం జరిగిందని కూడా వారు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
దేశ చరిత్ర మీదే దేశ భూత భవిష్యత్‌ వర్తమాన కాలాలు ఆధారపడి ఉంటాయి. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే వాస్తవ చరిత్ర ద్వారానే విద్యార్థుల్లో విలువలు, ప్రమాణాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రగతి పట్టించడం వల్ల దేశానికి దీర్ఘకాలంలో నష్టమే జరుగుతుంది తప్ప దేశాభ్యున్నతికి ఏమాత్రం దోహదం చేయదు. విద్యార్థులకు స్వదేశం గురించి తప్పుడు కథనాలను అందివ్వడం ఏ విధంగానూ భావ్యం కాదు. చదువులు, పాఠ్యాంశాలు వారిలో దేశం పట్ల భక్తిని, విధేయతను రగల్చాలి. విద్యార్థుల నుంచి చరిత్రను దాచడం, అసత్యాలు చెప్పడం, వక్రీకరించడం వల్ల ఏమాత్రం భావ్యం కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News