నీట్ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస వైఫల్యాలు, పేపర్ లీక్ వ్యవహారాలు దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతు న్నాయి. దీనికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుస రిస్తున్న విద్యా కేంద్రీకరణ, కార్పొరేటీకరణ విధానాలే కారణం. ‘ఒకే దేశం – ఒకే పరీక్ష’ అనే నినాదంతో కేంద్రం తీసుకువచ్చిన ఈ విధానం రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం అయిన ప్పటికీ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించడం వల్ల ప్రాంతీయ వైవిధ్యం, స్థానిక భాషలు, రాష్ట్ర బోర్డుల సిలబస్లకు విలువ లేకుండా పోయింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, పేద కుటుంబాల పిల్లలు వైద్య విద్యకు దూరమవుతున్నారు.
ఒకప్పుడు వైద్య విద్య అంటే ప్రతిభ, కృషి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థుల కలగా ఉండేది. కానీ నేడు అది కోచింగ్ మాఫియా, కార్పొ రేట్ విద్యా వ్యాపారం, కేంద్రీకృత పరీక్షల ఒత్తిడి, కోట్ల రూపాయల మార్కెట్‌గా మారిపోయింది. నీట్ పరీక్షల నిర్వహణలో వరుసగా బయటపడుతున్న పేపర్ లీకులు, అవకతవకలు, ఎన్‌టిఏ వైఫల్యాలు ఇవన్నీ యాదృచ్ఛిక ఘటనలు కావు. ఇవి దేశంలో అమలవుతున్న నూతన విద్యా విధానాల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయి.
“ఒకే దేశం – ఒకే పరీక్ష” అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్ప సంస్కరణగా ప్రచారం చేసింది. కానీ వాస్తవానికి అది భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా మారింది. భారతదేశం భిన్న భాషలు, భిన్న విద్యా విధానాలు, ప్రాంతీయ సామాజిక పరిస్థితులతో కూడిన దేశం. అలాంటి దేశంలో ఒకే విధమైన పరీక్షను రుద్దడం అంటే విద్యలో సమానత్వాన్ని కాదు, అసమానతలను మరింత పెంచడమే. సీబీఎస్ ఈ సిలబస్ ఆధారంగా రూపొందే నీట్ పరీక్షలు రాష్ట్ర బోర్డుల విద్యార్థులను తీవ్రంగా నష్టపరుస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇది మరింత అన్యాయంగా మారింది. ఎందుకంటే వారికి అవసరమైన కోచింగ్, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, డిజిటల్ వనరులు అందు బాటులో ఉండవు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఆధారిత వైద్య ప్రవేశ విధానాలు ఎన్నో సంవత్సరాలు విజయవం తంగా కొనసాగాయి. స్థానిక విద్యార్థులకు అవకా శాలు లభించేవి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా వైద్య విద్యలోకి వచ్చేవారు. కానీ నీట్ అమ లుతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు విద్యార్థి రెండు సంవత్సరాలు ఇంటర్ చదవడం కాదు, అసలు జీవితం మొత్తం కోచింగ్ సెంటర్ చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఉదయం స్కూల్, రాత్రి కోచింగ్ కాదు, ఇప్పుడు నేరుగా స్కూల్ వ్యవ స్థనే నిర్వీర్యం చేసి “ఇంటిగ్రేటెడ్ కోచింగ్” పేరిట విద్యను వ్యాపారంగా మార్చేశారు.
కోటా, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ వంటి నగరాలు కోచింగ్ పరిశ్రమల కేంద్రాలుగా మారా యి. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మార్కుల యంత్రాలుగా తయారు చేస్తున్నారు. ఒక కుటుంబం తమ పిల్లవాడిని డాక్టర్ చేయాలంటే ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లో కూరు కుపోతున్నాయి. పేద విద్యార్థులు మొదటి నుంచే పోటీ నుంచి విరమించుకుంటున్నారు. ఇదే విద్యలో కార్పొరేటీకరణ అసలు రూపం. ప్రభుత్వ విద్యను బలహీనపరచి, ప్రైవేట్ కోచింగ్ సంస్థలు, కార్పొరేట్ కాలేజీలకు లాభాలు చేకూర్చే విధంగా మొత్తం వ్యవస్థ పనిచేస్తోంది.
నీట్ వ్యవస్థ వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ప్రతి సంవత్సరం కోచింగ్ ఒత్తిడి, పరీక్ష భయం, కుటుంబాల అంచనాలు తట్టు కోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోటా వంటి నగరాల్లో వరుస ఆత్మహత్యలు దేశాన్ని కుదిపేశాయి. అయినా ప్రభుత్వం సమస్య మూలా లను అర్థం చేసుకోవడం లేదు. విద్యార్థులపై మరింత పోటీ, మరింత ఒత్తిడి మోపుతోంది. వైద్య విద్యను సేవగా కాకుండా కేవలం మార్కెట్ పోటీగా మార్చిం ది. ఇది మానవీయత కోల్పోయిన విద్యా విధానం.
2018లో స్వతంత్ర వ్యవస్థగా ఎన్టీఎ ను ఏర్పాటు చేసి, విద్యను కేంద్రీకరించే విధానాలను పునాదులుగా చేసుకున్న బిజెపి, ఎన్టీఎ ద్వారా దేశ వ్యాప్తంగా విద్య వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని మాత్రం నిరోధించడం లేదు. కె.రాధకృష్ణన్ కమిటీ ఎన్టీఎలో మార్పులు తేవాలని సూచించినా వాటిని బిజెపి పట్టించుకోలేదు. అందుకే ఇంత నష్టం జరుగు తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు కూడా పూర్తిగా ప్రశ్నార్థకమైంది. వరుసగా పేపర్ లీకులు, ఫలితాల్లో అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదాలు, సాంకేతిక తప్పిదాలు – ఇవన్నీ సంస్థ సామర్థ్యంపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడే పరీక్షను నిర్వహించే సంస్థ కనీస పారదర్శకతను కూడా పాటించలేకపోతోంది. పేపర్ లీక్‌ల వెనుక పెద్ద మాఫి యాలు, రాజకీయ -కార్పొరేట్ సంబంధాలు ఉన్నాయ నే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షా కేంద్రాల నుంచి కోచింగ్ సంస్థల వరకు విస్తరించిన అవినీతి గొలుసు విద్యా వ్యవస్థను పూర్తిగా కలుషితం చేస్తోంది.
ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విద్యా విధానాల సహజ ఫలితం. జాతీయ విద్యా విధానం-2020 కూడా విద్యలో కేంద్రీకరణను, ప్రైవేటీకర ణను మరింత వేగవంతం చేస్తోంది. రాష్ట్రాల హక్కు లను క్రమంగా హరించి, మొత్తం విద్యా వ్యవస్థను కేంద్ర నియంత్రణలోకి తీసుకురావాలని ప్రయత్ని స్తోంది. “జాతీయ ప్రమాణాలు” అనే పేరుతో స్థానిక అవసరాలు, భాషలు, సామాజిక న్యాయం అన్నీ పక్క నపడుతున్నాయి. విద్యను ప్రజల హక్కుగా కాకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
వైద్య విద్యలో సామాజిక న్యాయం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యా మ్నాయ విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. కోచింగ్ ఆధారిత వ్యవస్థను తగ్గించేలా పాఠశాల విద్యనే బలంగా మార్చాలి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నీట్‌ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలె. ప్రజాస్వామ్య, సమానత్వ, శాస్త్రీయ విద్యా వ్యవస్థ కోసం విద్యార్థులు, ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కలసి పోరాడాల్సిన అవసరం అత్యవసరంగా మారింది.
–
టి.నాగరాజు
ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి

