పద్ధెనిమిది రోజుల పాటు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 21న వాయిదా పడ్డాయి. అయితే, పాలక, ప్రతిపక్షాల మధ్య ఎప్పటి మాదిరిగానే ఏమాత్రం పొసగకపోవడంతో ఈ సమావేశాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కనీ వినీ ఎరుగని విధంగా అతి పేలవంగా, అధ్వానంగా ముగిసిపోయాయి. పాలక పక్షం ఒకపక్క, ప్రతి పక్షాలు మరో పక్క మంకు పట్టుపట్టడంతో అనేక బిల్లులు చర్చ లేకుండానే, ఓటింగ్ జరగకుండానే ఆమోదం పొందడం కూడా జరిగింది. బిల్లులను ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఆమోదం పొందే వరకూ ఒకరి మాట మరొకరు సాగనివ్వకపోవడం అన్నది యథావిధిగా సాగిపోయింది. జవాబుదారీతనమనేది ఈ రెండు పక్షాల్లోనూ ఎక్కడా, ఏ సందర్భంలోనూ కనిపించలేదు. దేశానికి అత్యంత అవసరమైన బిల్లులు సైతం ఆరోగ్యకరమైన చర్చ లేకుండా ప్రతిపక్షాలతో ప్రమేయం లేకుండా ఆమోదం పొందడం నిజంగా ఆందోళనకర విషయం. ముఖ్యంగా పార్లమెంటులో అత్యధిక సంఖ్యాక ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ కావడం వల్ల చర్చకు అవకాశం లేకుండా పోయింది. గత 13వ తేదీన లోక్ సభలోకి నలుగురు దుండగులు ప్రవేశించడంపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడం, తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో లోక్ సభలో 100 మంది ప్రతిపక్ష సభ్యులను, రాజ్యసభలో 46 మంది సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది.
ఈ సస్పెన్షన్లపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్కర్‌కు ఒక లేఖ రాస్తూ, ‘ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే’ సభ్యులను సస్పెండ్ చేసినట్టు ఆరోపించారు. వెనుకా ముందూ ఆలోచించకుండా సస్పెన్షకు పాల్పడ్డారని, ఆ సమయంలో సభలో లేని సభ్యుడిని కూడా సస్పెండ్ చేయడాన్ని బట్టి ప్రభుత్వం ఎంత దురుద్దేశంతో వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. లోక్ సభ స్పీకర్ గానీ, రాజ్యసభ చైర్మన్ గానీ సభలను నిర్వహించడంలో దారుణంగా వైఫల్యం చెందినట్టు కూడా ఆయన ఆరోపించారు. వారు పక్షపాతంతో వ్యవహరించడం జరిగిందని కూడా ఆయన విమర్శించారు.
ప్రతిపక్ష సభ్యులు సభలో లేని సమయంలో ప్రభుత్వం కొత్త క్రిమినల్ చట్టాన్ని, టెలి కమ్యూనికేషన్ చట్టాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామకాన్ని ఆమోదించడం జరిగింది. ఈ మూడు చట్టాల్లోనూ ప్రభుత్వానికి అపరిమిత అధికారాలను అప్పగించడం జరిగింది. వీటిల్లోని కొన్ని వివాదాస్పద అంశాలపై ప్రతిపక్షాలు చర్చించే అవకాశం ఇవ్వ కుండా వీటిని ఆమోదించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు సంధిస్తున్నాయి. లోక్ సభలో భద్రతారాహిత్యంపై ఒక ప్రకటన జారీ చేయడానికి ప్రభుత్వం గట్టిగా తిరస్కరించింది. దీని మీద మొదట ఒక పార్లమెంట్ సభ్యుల కమిటీతో దర్యాప్తు చేయించిన తర్వాత దీనిపై పార్లమెంటులో చర్చించడం జరుగుతుందని ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రతిపక్షాలు తిరస్కరించడం జరిగింది. ప్రభుత్వం తన సంఖ్యా బలాన్ని అడ్డం పెట్టుకుని, తన నైతిక, న్యాయబద్ధమైన బాధ్యతను విస్మరిస్తోందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి. అయితే, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే తమను స్పీకర్, చైర్మన్ సస్పెండ్ చేసేలా వ్యవహరించాయని ప్రభుత్వం ఆరోపించింది.
పార్లమెంట్ లోపలే కాకుండా, ఆవరణలో కూడా ప్రతిపక్షాలు సభా మర్యాదలకు భంగకరంగా వ్యవహరించాయని, రాజ్యసభ చైర్మన్ ధన్కర్‌ను అనుకరిస్తూ ఎద్దేవా చేశాయని పాలక పక్షం పేర్కొంది. ప్రతిపక్షాలు తనను అనుకరిస్తూ వ్యాఖ్యలు చేయడం చైర్మన్ పదవికే కాకుండా, చైర్మన్ కు చెందిన కులానికి కూడా అవమానకరమని ధన్కర్ వ్యాఖ్యానించారు. తాను యరాజ్యాంగ నిపుణుడు, న్యాయ శాస్త్ర కోవిదుడు అయినందువల్ల పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో, ఎప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలో తనకు క్షుణ్ణంగా తెలుసని కూడా ఆయన అన్నారు. తప్పుదోవ పట్టిన కొందరు యువకులు చేసిన పనికి ప్రతిపక్షాలు భద్రతా రాహిత్యం పేరుతో గందరగోళం సృష్టించడం, ఉభయ సభల కార్యక్రమాలను కొనసాగనివ్వకపోవడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. ఇంత చిన్న కారణానికి పార్లమెంట్ సమావేశాలను సమర్థించడమే కాకుండా, పాలక పక్షం మీద నిందలు వేయడం, దీన్ని రాజకీయాలకు వినియోగించుకోవడం ఏమాత్రం సమంజసంగా కనిపించడం లేదు. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడం, బిల్లులు ఆమోదం పొందకుండా చూడడం ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది.
No discussions in Parliament: బలహీనపడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ
బాధ్యతా రాహితమైన అధికార విపక్షాలు