Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Never ending Nepal crisis: అడకత్తెరలో నేపాల్‌ ప్రభుత్వం

Never ending Nepal crisis: అడకత్తెరలో నేపాల్‌ ప్రభుత్వం

రాజకీయ సుస్థిరతకు నేపాల్‌ క్రమంగా దూరమవుతూ వస్తోంది. అస్థిర సంకీర్ణాలు, బలహీన ప్రభుత్వాలతో నేపాల్‌ చాలా కాలంగా అంటకాగుతోంది. నేపాల్‌ గణతంత్ర రాజ్యంగా మారినప్పటి నుంచి దాని పరిస్థితి అధోగతి పాలవుతూ వస్తోంది. దేశ కొత్త ప్రధానిగా జూలై 12న కె.పి. శర్మ ఓలి పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అక్కడి రాజకీయ విశ్లేషకులు ఆయన ప్రభుత్వానికి రోజులు లెక్కపెట్టుకోవడం ప్రారంభమైంది. ఇది నేపాల్‌ చరిత్రలో అత్యంత బలహీన ప్రభుత్వం కాబోతోందనే భావన ప్రజలకు కూడా ఇప్పటికే కలిగింది. మొత్తం 275 మంది సభ్యుల పార్లమెంటులో ఇదివరకటి ప్రధానమంత్రి పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ మావోయిస్ట్‌ సెంటర్‌ కు 63 స్థానాలు మాత్రమే దక్కడంతో ఆ పార్టీ అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతవరకూ ఆ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న ఓలి నాయకత్వంలోని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌-యూనిఫైడ్ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ ప్రచండకు గుడ్‌బై చెప్పడం జరిగింది. ప్రచండకు తెలియకుండా షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా నాయకత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఓలి చివరి క్షణంలో ప్రచండ కాళ్ల కింద చాపను లాగేయడం జరిగింది.
ఇక 165 మంది సభ్యుల సంతకాలతో దేశాధ్యక్షుడు రామచంద్ర పాడేల్‌ను కలుసుకున్న ఓలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు మాత్రమే అధికారం ఉందని చెప్పి, సంఖ్యాపరంగా దాన్ని నిరూపించుకున్నారు. విచిత్రమేమిటంటే, ఓలీ పార్టీకి నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ కంటే తక్కువ స్థానాలు లభించాయి. ఓలీ పార్టీకి 77 స్థానాలు మాత్రమే దక్కగా, దేవ్‌ బా పార్టీకి 88 స్థానాలు లభించాయి. తక్కువ స్థానాలతో ఆయన పార్టీ అధికారంలోకి రావడం ఒక రికార్డనే విషయం అటుంచి అది ఎంత బలహీన ప్రభుత్వమో కూడా అది చెప్పకనే చెబు తోంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 138 మంది సభ్యుల బలం అవసరం కాగా, ఈ రెండు పార్టీల కూటమికి 165 స్థానాలు లభించడం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమైంది. ఈ సంకీర్ణంలో ఓలీ పార్టీ అత్యంత బలహీనమైన పార్టీ అనడంలో సందేహం లేదు. బలహీనమైన పునాదుల మీద నిలబడిన ఈ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగు తుందన్నది చెప్పలేం. ఇది తప్పకుండా మూణ్ణాళ్ల ముచ్చటేనని ప్రభుత్వ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, 2027లో మళ్లీ ఎన్నికలు జరిగే వరకూ తమ పార్టీలు వంతుల వారీగా ప్రధాని పదవిని పంచుకోవాలని ఈ రెండు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే, రాజకీయాల్లో అటువంటి ఒప్పందాలు నీటి మీద రాతల లాంటివి.
తన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఓలీ తనంటత తానుగా దేవ్‌ బాకు అధికారం అప్పజెబు తారా అన్నది సందేహమే. ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని దేవ్‌ బా కూడా ఎంతగానో తహతహ లాడుతున్నారు. నిజానికి ఈ రెండు పార్టీల మధ్యా సైద్ధాంతికంగా భావ సారూప్యత ఏమీ లేదు. అందువల్ల, ప్రధాని పదవిని పంచుకోవడాన్ని పక్కనపెట్టి ఈ రెండు పార్టీలు ఒక ఒరలో కొనసాగు తాయా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ప్రస్తుతం నాలుగవ పర్యాయం ప్రధాని పదవిని చేపట్టిన ఓలి ఏనాడూ సంకీర్ణ ధర్మాన్ని పాటించిన పాపాన పోలేదు. అంతేకాక, రెండు నెలల్లో ఆయన పార్లమెంటులో తన మెజారిటీని నిరూపించుకో వాల్సి ఉంటుంది. కనీసం ఈ రెండు నెలలయినా ఆయన దేవ్‌ బాకు తగ్గట్టుగా పాలన సాగిస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం. కాగా, ఓలీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వానికి టెన్షన్‌ ప్రారంభమైంది. ఓలీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలియజేసిన మాట వాస్తవమే కానీ, ఓలీ ప్రభుత్వం భారతదేశం కంటే చైనాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తన భారత్‌ వ్యతిరేకతను బాగా చాటుకున్నారు. ఆసియా ఖండంలో భారత్‌ ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం తమకు ఇబ్బందికరంగా తయా రైందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని పదవిలో ఉన్నంత కాలం ఈ రెండు దేశాల మధ్యా చిచ్చుపెట్టడానికే ప్రయత్నాలు చేశారు. భారత్‌ పై ఆధారపడకుండా, ఒక స్వతంత్ర దేశంగా వ్యవ హరించడానికి ఆయన చేయగలిగిందల్లా చేశారు. చివరికి చైనాను ఆశ్రయించి, భారత్‌ను దూరం పెట్టడం కూడా జరిగింది. ఒక ఊరట కలిగించే విషయమే మిటంటే, ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో ఓలీ పార్టీకి తక్కువ స్థానాలు ఉండగా, భారతదేశానికి బాగా అనుకూలమైన దేవ్‌ బా పార్టీకి ఎక్కువ స్థానాలు లభించడం జరిగింది. దేవ్‌ బాకు చెందిన నేపాలీ కాంగ్రెస్‌ పార్టీని నేపాల్‌ రాజు, మరి కొందరు నాయకులు, కోయిరాలా కుటుంబం తీవ్రంగా వేధించినప్పుడు భారతదేశం ఆయనను ఆదుకోవడమే కాకుండా ఆశ్ర యం కూడా ఇచ్చింది. ఆయన భారతదేశంలోనే చాలా కాలం గడిపారు. అందువల్ల భారత్‌, నేపాల్‌ సంబంధాలు ప్రస్తుతానికి సజావుగానే సాగిపోయే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News