Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్New alliance new strategies: కొత్త పొత్తులు, కొత్త వ్యూహాలు

New alliance new strategies: కొత్త పొత్తులు, కొత్త వ్యూహాలు

కొత్త కూటమి 'ఇండియా'కు ఝలక్ ఇచ్చిన నవీన్ పట్నాయక్

ఒడిశాలోని బిజూ జనతాదళ్‌ (బి.జె.డి) కు, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బి.జె.పి)కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, గత 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భువనేశ్వర్‌ వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ను కలుసుకున్న తర్వాత ఒక్క రోజులో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమిత్‌ షా, నవీన్‌ పట్నాయక్‌ లు ఒకే వేదిక పంచుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్యా స్నేహ సంబంధాలు ముదిరిపోయాయి. ఒడిశా ముఖ్యమంత్రిని అమిత్‌ షా ప్రశంసలతో ముంచెత్తారు. నవీన్‌ పట్నాయక్‌ కూడా అందుకు తగ్గట్టుగా స్పందించారు. తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలను ఆయన పదే పదే ప్రస్తావించారు. ఈ కొత్త సయోధ్యను చూసి ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయి ఉంటే ఉండవచ్చు. అయితే, ఈ సంబంధాలు దేశంలో ప్రతిపక్ష వ్యూహాలలో సమూలమైన మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర శాసనసభలో అత్యధిక సంఖ్యా బలం ఉన్న బి.జె.డికి ఇది ఒక విధంగా సువర్ణావకాశం. ఈ కొత్త బంధంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ పార్టీకి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. అయితే, రాష్ట్ర బీజేపీకి మాత్రం కష్టకాలం దాపురించినట్టయింది. ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న ఈ పార్టీ ఈ కొత్త బంధం గురించి పార్టీ శ్రేణులకు, ఓటర్లకు ఏం చెప్పాలో, ఏవిధంగా నచ్చజెప్పాలో అర్థం కాకుండా ఉంది. తాను నవీన్‌ పట్నాయక్‌ తో జరిపిన సమావేశాన్ని, ఆయన మీద కురిపించిన ప్రశంసల వర్షాన్ని సీరియస్‌ గా తీసుకోవద్దని అమిత్‌ షా ఆ తర్వాత పార్టీ సమావేశంలో చెప్పారు కానీ, పార్టీ నాయకులు మాత్రం కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ సానుకూల మార్పు పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు.
విచిత్రమేమిటంటే, 2019 ఎన్నికలకు ముందు అమిత్‌ షా భువనేశ్వర్‌ వచ్చి, ఇదే విధంగా పార్టీ సమావేశం ఏర్పాటు చేసి, బి.జె.డిని బంగాళాఖాతంలో పడేయాలని, శాసనసభలో 120 స్థానాలు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేయాలని పార్టీ శ్రేణులను ఉత్తేజితుల్ని చేయడం జరిగింది. దేశంలో రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయన్నది నిజం. ఇందులో సందేహమేమీ లేదు. కీలక సమస్యల మీద బీజేపీకి ఎప్పుడు అవసరమైనా పార్లమెంట్‌ లో బి.జె.డి సహాయ హస్తం అందిస్తూనే ఉంది. ఈసారి ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా బి.జె.డి మాత్రం పాలక పక్షం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. రాజ్యసభలో పాలక పక్షానికి బలం లేని పరిస్థితిలో బి.జె.పి శాయశక్తులా పాలక పక్షం వైపే ఉండడానికే ప్రయత్నిస్తోంది.
పార్లమెంటులో ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుకు బి.జె.పి మద్దతునివ్వగానే అమిత్‌ షా భువనేశ్వర్‌ కు బయలుదేరడాన్ని బట్టి, ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో తమకు మద్దతునిస్తే, తాము ఈ పార్టీలకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చినట్టు అర్థం అవుతోంది. అంటే, ఈ కొత్త బంధం ఫలితంగా ప్రతిపక్ష కూటమి ఐ.ఎన్‌.డి.ఐ.ఎలో కొత్తగా ప్రాంతీయ పార్టీలు చేరే అవకాశాలకు గండిపడినట్టయింది. అయితే, దీనివల్ల ఒక సమస్య కూడా ఉంది. ఒడిశా వంటి రాష్ట్రాలలో బీజేపీ వ్యాప్తి చెందే అవకాశాలను కూడా ఇది దెబ్బతీస్తోంది. కొన్ని రాష్ట్రాలలో మరిన్ని స్థానాలను సొంతం చేసుకోవడం ఈ పార్టీకి కష్టమవుతుంది. పార్లమెంటులో బలానికి ఎక్కువగా ప్రాంతీయ పార్టీల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బి.జె.డితోనో, వై.ఎస్‌.ఆర్‌.సి.పితోనో చేతులు కలపడం వల్ల సీట్ల పరంగా బీజేపీ కాస్తో కూస్తో నష్టపోయే అవకాశమే ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News