Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్New education policy: నూతన విద్యా విధానం ముందున్న సవాళ్ళు ..?

New education policy: నూతన విద్యా విధానం ముందున్న సవాళ్ళు ..?

మన విద్యావిధానం ఎంతో ప్రాచీనమైనది క్రీస్తు పూర్వమే నలంద, తక్షశిల, విక్రమశీల విశ్వ విద్యాలయాలు ప్రపంచ స్థాయి విద్యా కేంద్రాలుగా విలసి ల్లాయి. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో అనేక ఆటుపోట్లకు గురై ఎన్నో ఒడిదొడుకులను ఎదు ర్కొంది. దేశాన్ని, సంస్థానాలను పాలించిన రాజులు వారి మాతృభాషలోనే చదవాలని శాశనాలు చేశారంటే ఆనాటి విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. (అందుకు ఉదాహరణ దక్కన్‌ ప్రాంతాన్ని పాలించిన నిజాం నవాబు పాఠశాలలో నిర్బంధంగా ఉర్దూ బోధించాలని హుకుం జారిచేయటం వంటివి దేశవ్యాప్తంగా జరిగినవి అనేకం) తర్వాత దేశాన్ని బ్రిటిష్‌ వారు హస్తగతం చేసుకోవటం వారి మాతృభాషకు మన ప్రాంతీయ భాషలకు మధ్య సమన్వయం లోపించటం మూలంగా క్రమంగా ఇక్కడ ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టాలని తీర్మానించటం 1834 లో ‘లార్డు మెకాలే’ మన దేశంలో పర్యటించి ఇక్కడ అమలు జరుగుతున్న విద్యా విధానాన్ని పరిశీలించి ‘1835 ఫిబ్రవరి రెండో తారీఖున’ ‘మెకాలే మినిట్స్‌’ అనే ప్రతిపాదన పత్రాన్ని సమర్పించాడు. తద్వారా దేశంలో ‘ఆంగ్ల విద్యా విధానం’ ప్రవేశపెట్టబడింది. అలానే ‘ఉడ్స్‌ నివేదిక’ (1854) ప్రకారం ‘మద్రాసు కలకత్తా, బొంబాయి’ వంటి నగరాలలో (1857లో) తొలిసారిగా విశ్వవిద్యాలయాలు నెలకొల్పబడినవి. పాశ్చ్యత్య విద్యా విధానాన్ని చదువుతూనే పరాయి పాలనకు వ్యతిరేకంగా మనదేశపు మేధావి వర్గం సమాంతరంగా ఉద్యమం నడిపిన విషయం మనందరికి తెలిపిన విషయమే. జాతీయోద్యమం చురుకుగా సాగుతున్న రోజుల్లోనే మహాత్మ గాంధీ 1937లో ‘వార్ధ విద్యా ప్రణాళిక’ పేరుతో ఒక నివేదిక రూపొందించి ‘బేసిక్‌ విద్యా విధానాన్ని’ భారతీయులకు అందివ్వాలని సూచించటం గమనార్హం. అనంతరం దేశానికి స్వాతంత్య్రం రావటం ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రు నాయకత్వంలో మొదటి విద్యా శాఖమంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ మార్గదర్శకత్వంలో యుజీసీ స్థాపన, ఏఐసీటీఈ, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ మొదలైన సంస్థలకు అప్పుడే అంకురార్పణ జరిగింది.
ఇక దేశానికి స్వాతంత్య్ర సిద్దించి ఏడు దశాబ్దాలు దాటినయ్‌. ఈ కాలంలో పిల్లల భవిష్యత్తుకు అలాగే దేశానికి ఉపయోగపడే విధంగా డజనుకు పైగా విద్యా కమిటీలు, కమీషన్లు ఏర్పాటు చేసుకొని వాటి సిపార్సులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నాం. చివరిగా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధి హయాంలో ఏర్పాటు చేయబడిన ‘జాతీయ విద్యా విధానం’ (ఎన్‌ఈపీ1986) ఫలితంగా కొత్త విద్యా విధానం రూపుదిద్దుకోబడింది, దీని ద్వారా దేశంలో చాలా వరకు ‘విద్యా విప్లవం వచ్చిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు, (ఓబీబీ) కార్యక్రమాలు, రాత్రి పాఠశాలలు జాతీయ సాక్షరతా కార్యక్రమాలు గ్రామ గ్రామాన పెద్దఎత్తున జరిగినవి, ప్రజల నుండి కూడా చక్కని స్పందన వచ్చింది.
దీనికన్న ముందుగా ఏర్పాటు చేయబడిన ‘కొఠారి కమీషన్‌’ (1964-66) ‘ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను (Common School Society) అలానే ‘త్రిభాషా సూత్రం’ మరియు 10+2+3 విధానాన్ని అమలు చేయమని సూచి స్తూనే, ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది’ అని ప్రస్తావించింది. దీనిని బట్టి ‘తరగతి గది’ యొక్క విలువ ఏమిటో ఇక్కడ గమనించవచ్చు తిరిగి ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత డాక్టర్‌ కృష్ణస్వామి కస్తూరి రంగన్‌ సిఫార్సుల మేరకు (ఎన్‌పీఈ 2020) నూతన జాతీయ విద్యా విధానంలోకి (5+3+3+4) అడుగులు వేయబోతున్నాం. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత ‘అంబేద్కర్‌” గారు చెప్పిన వాక్యాలు ప్రస్తావనార్హం. ‘జీవితంలో విలువలను నేర్పించేదే నిజమైన విద్య‘ అని మరి ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ఎటువంటి విలువలతో కూడిన విద్యను మనం అభ్యసించామనేది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. స్వాతంత్య్ర సిద్దించిన నాటి నుండి నేటి వరకు స్వయంసంమృద్ధిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా వరకు అందిపుచ్చుకున్నాం అనేది ఎవరు కాదనలేని వాస్తవం. బ్లూమ్‌ బర్గ్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఐదవ ఆర్ధిక వ్యవస్థగా ఈ మధ్యనే అవతరించాం. కాని సాంకేతికత పెరిగిన కొద్దీ ‘సంకుచితపు భావజాలాన్ని’ మనుషుల మెదళ్ళ నుండి మారుతున్న ‘విద్యా దృక్పధాలు‘ ఎందుకు మార్చలేకపోతున్నాయ్‌ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మన దేశాపు విద్యా విలువలు సనాతనమైనవి. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే గొడుగు కింద వసుదైక కుటుంబంవలే ‘లౌకికమైన వ్యవస్థను’ బలమైన ప్రజాస్వామిక సూత్రాలను ఏర్పాటు చేసుకొని మనుగడ కొనసాగిస్తున్నాం. కాని అక్షరాస్యతా శాతం పెరిగిన కొద్దీ కులం/మతం, లేదా హింస, అవినీతి, వ్యక్తిగత స్వార్థం, సామాజిక అసమానతలు, స్త్రీ/పురుష వివక్ష ఇంకా కొనసాగటం పాలకుల వైఫల్యమా? విద్యా విధానాల వైపల్యమా? ఒక్కసారి పునరాలోచించుకోవాలి, ప్రపంచం వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న తరుణంలో మనుషులలో మాత్రం విభజన రేఖలు తొలగిపోవటం లేదు. ఇది దేని వైఫల్యమో పునః సమీక్షించుకోవాలి, ప్రాచీన గ్రీకు తత్వవేత్త ‘సోక్ర టీస్‌’ ‘సుగుణమే జ్ఞానం’ అంటాడు జ్ఞానం అనేది ఆత్మకు కల సహజసిద్ద గుణమని ఆయన అభిప్రాయం.
మరి ప్రపంచంలో వున్న మనషులందరూ సుగుణాలను కల్గివుంటే నేటి సంఘర్షణాత్మక సమాజం మన కళ్ళముందు ఎందుకు ఆవిష్కృతమవుతుంది? ఎందుకు అందరూ మంచి జ్ఞానవంతులు కాలేకపోతున్నారనేది కూడా ఆలోచించాల్సిన విషయం? వ్యక్తి ప్రవర్తనలో ఎంతో కొంత స్థిరమైన మార్పును కలుగజేయని ‘అభ్యసనం’ అసలు ‘విద్య’ అనవచ్చునా అనేది కూడా ఇక్కడ ఆలో చించాల్సిన విషయం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన అక్షరాస్యత శాతం 74.04 ప్రస్తుత గణాంకాల ప్రకారం సుమారు 85% పైన ఉండవచ్చనేది పరిశోధకుల అభిప్రాయం. అవినీతి నిరోధక సూచిలో 2022 ప్రకారం మనదేశపు ర్యాంక్‌ 86, ఈ మధ్యే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించాం. అక్షరాస్యత శాతం పెరుగుతున్న కొద్దీ అవినీతి తగ్గాలి మరియు నేరాల సంఖ్య కూడా తగ్గాలి కానీ దేశంలో దీనికి విరుద్ధంగా రోజురోజుకు ఈ అంకెలు పెరగటం ఆందోళన కల్గించే అంశం. లోపం ఎక్కడ ఉందనేది మనకు మనం తర్కించుకోవాలి, పాఠ్య పుస్తకాలను సవరించాలా, ప్రజలను చైతన్యం చేయాలా లేదా చట్టాలను కఠినం చేయాలా అనేది ఆలోచించాలి.
వ్యవస్థలు మారినా, వ్యక్తులు మారినా, పాలకులు మారినా ‘విద్య‘ ద్వారా మనిషి విశాలమైన విశ్వజనీనమైన ఆలోచనా దృక్పధం అలవాటు చేసుకోలేనప్పుడు ఎన్ని ‘నూతన విద్య విధానాలు’ వచ్చినా అవి నీటి మూటలుగానే మిగిలిపోతాయ్‌, దేశ రక్షణకు లక్ష కోట్ల బడ్జెట్‌ కేటాయించి విద్యకు మాత్రం పది శాతం లోపు కేటాయించటం బాధ కల్గించే విషయం. తరగతి గదిలో ‘నిర్మాణాత్మకంగా’ మరియు ‘సృజనాత్మకంగా’ చదువుకున్న విద్యార్దే దేశ రక్షణకు కావలసిన ఆధునిక యంత్ర పరికరాలను తయారు చేయగలడన్న సత్యాన్ని పాలకులు గమనించాలి. అందుకే విద్యకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ‘పరిశోధన మరియు సృజనాత్మక ఆలోచనలు’ పెంపొందించే ప్రయత్నం చేయాలి. అలానే పాఠశాల మొదలుకొని విశ్వవిద్యా లయాల స్థాయి వరకు సుశిక్షితులైన అధ్యాపకులను నియమించాలి. అదేవిధంగా మౌళిక సదుపాయాలు, మానవ వనరుల పర్యవేక్షణ నిరంతరం జరగాలి. ‘విద్యా హక్కు చట్టం’ (2009) ఎందుకు బాలకార్మికులను తరగతి గది వైపు మళ్ళించలేకపోయిందన్నది కూడా సమీక్ష చేయాలి. చట్టం అమలులో వైఫల్యమా? విధాన లోపమా? సమీక్ష చేసుకోవాలి. విద్య కార్పోరేట్‌ పరిధిలోకి వెళ్ళిన తర్వాత విలువలు దిగజారాయనేది జగమెరిగిన సత్యం.
అభ్యసనం అంటే పిల్లవాడిని రంగురంగుల అద్దాల భవంతుల్లోనో, ఇరుకైన గదులలోనో బందించి బోధించటం కాదు, విశాలమైన సహజ సిద్ధమైన వాతావరణంలో విద్యార్ధి కేంద్రీకృతంగా మరియు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా బోధన కొనసాగినప్పుడే విద్యార్ధి మనసులో శాంతి సామరస్యాలు పరిడవిల్లుతాయి అందుకే ప్రఖ్యాత ఫ్రెంచితత్వవేత్త ‘రూసో’ ప్రకృతిలోకి వెళ్ళండి (‘Go back to nature‘) అంటాడు ప్రకృతి సిద్ధమైన పాఠాలు కూడా విద్యార్థికి అవసరమే, పిల్లల్ని యంత్రాలు, యంత్ర పరికరాల మాదిరిగా భావించకుండా భవిష్యత్‌ తరాలకు అతనిని ఓ ప్రతినిధిగా తీర్చిదిద్దే విద్య నేడు అవసరం. అందుకే ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలి. మారిన విద్యా విధానాలు సమాజంలో ఎంత మేరకు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నది కూడా ‘మూల్యాం కనం’ చేసుకోవాలి.
జాతిపిత ‘మహాత్మా గాంధీ’ గారు విద్య గూర్చి ‘వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య‘ అంటారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన విద్య విధానం ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఎంతమేరకు మార్పు చేసుకోవాలన్నది అసలైన ప్రశ్న? అలాంటి విధానాలు ప్రజల ఆశయాలకు తగినట్లుగా ఉన్నప్పుడే అది అసలైన విద్యా విధానం అవుతుంది. భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుంది కూడా అదేవిధంగా ప్రపంచీకరణ ఫలితాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న తరుణంలో మన విద్యా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. దానితో పాటుగా వ్యక్తులుగా మనం కూడా సంకుచితపు భావజాలం మధ్య కొట్టుమిట్టాడకుండా విశాలమైన దృక్పధంతో మానవతా విలువల్ని, సార్వజనీనమైన సూత్రాలను పాటించాలి. అప్పుడే మన విద్యా విధానం ప్రపంచ దేశాలకు మార్గదర్శకం కాగలదు. నేటికి కూడా ఆహారధాన్యాలు, ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర
దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ విషయంలో స్వయం సమృద్ధిని సాధించడానికి తరగతి గదితో సంబంధం ఉన్న అంశాలపట్ల పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలి. ఇజ్రాయిల్‌, కొరియా, జపాన్‌ లాంటి చిన్న దేశాలు సాధించిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మరియు సాధించిన అభివృద్ధిని అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాలి. తరగతి గదిని అశ్రద్ధ చేసి ఇతర దేశాలపై ఆధారపడటం మంచిది కాదనేది నా అభిప్రాయం. విద్యా వ్యవస్థను కాగితాల మీద కాకుండా ఆచరణాత్మకంగా మరియు నిర్మాణాత్మకంగా అమలు జరిగేలా చూడాలి. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి, ప్రైవేటు విద్యను నియంత్రించాలి. లేనిపక్షంలో విద్యా విలువలు మరింత దిగజారి సమాజంలో సంఘర్షణ, సంక్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదు. పెరుగుతున్న జనాభా దానికి సమాంతరంగా పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి అవకాశాల కల్పన, నానాటికి మనుషుల మధ్య పెరుగుతున్న కుల, మత అంతరాలు ఇవన్ని నూతన విద్యా విధానం ముందున్న సవాళ్ళు వీటిని ఎలా అధిగమించవచ్చునో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
డా॥మహ్మద్‌ హసన్‌

– 9908059234.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News