Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్New government new challenges: కొత్త ప్రభుత్వానికి సరికొత్త సవాళ్లు

New government new challenges: కొత్త ప్రభుత్వానికి సరికొత్త సవాళ్లు

దేశంలో శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం అన్నది అరుదైన పరిణామమేమీ కాదు. ఓటర్ల మనోభావాలు, ఇష్టానిష్టాలు మారిపోవడం వల్ల భారీ మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు సైతం కుప్పకూలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీ (టి.డి.పి), జనసేన, బీజేపీ కూటమి చేతిలో వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. అయితే, 175 స్థానాల శాసనసభలో 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఈసారి ఎకాయెకిన 140 స్థానాలు కోల్పోయి 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఓట్ల వాటాలో కూడా అది పది శాతం కోల్పోయింది. 39.37 శాతం ఓట్లను మాత్రమే చేజిక్కించుకోగలిగింది. టీడీపీ కూటమి 55.3 శాతం ఓట్ల వాటా సంపాదించుకుని అనూహ్యమైన మెజారిటీతో అధికారానికి వచ్చింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి 9.75 శాతం మాత్రమే ఓట్లు ఎక్కువగా పడినప్పటికీ అది 164 స్థానాలను చేజిక్కించుకోగలిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలవడం వల్ల ఈ రెండు పార్టీలూ బలపడడానికి అవకాశం కలిగింది.
ముఖ్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలపడం వల్ల రాష్ట్రంలోని కమ్మ, కాపు కులస్థుల ఓట్లు చెక్కు చెదరకుండా ఈ రెండు పార్టీలకే పడడం జరిగింది. ఫలితంగా వై.ఎస్‌.ఆర్‌.సి.పికి రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ ఆశించిన స్థాయిలో ఓట్లు లభించలేదు. ఈ మూడు పార్టీల కూటమి వల్ల రాష్ట్రంలో ద్విముఖ పోటీలకు అవకాశం కలిగింది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎన్నికలతో నామరూపాలు లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ పార్టీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కోలుకుని, చివరికి అధికారంలోకి కూడా రాగలిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం మరింత బలహీనపడడమే కాకుండా సరైన నాయకత్వం కూడా లేని పరిస్థితికి దిగజారింది.
ఇక ఎన్నికల వ్యవస్థ కారణంగానో, కూటమి కారణంగానో వై.ఎస్‌.ఆర్‌.సి.పి పరాజయం పాలయిం దనుకుంటే పొరపాటే. రాష్ట్ర ఖజానా మీద రుణ భారం పెరిగిపోతున్నప్పటికీ, ఆర్థిక ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నప్పటికీ వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల మీదా, సబ్సిడీలు, ఉచితాల మీదా నిధులు కుమ్మరిస్తూ పోయింది. వృద్ధిలో, అభివృద్ధిలో రాష్ట్ర రికార్డు నానాటికీ తీసికట్టుగా తయారైంది. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం విషయంలో మొదటి స్థానానికి ఎదుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ పదవ స్థానానికి దిగజారింది. 2023 చివరి త్రైపాక్షికం నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఇక రుణాలు కూడా చేయలేని పరిస్థితికి చేరుకుంది. చివరి క్షణం వరకూ రాష్ట్ర రాజధాని వివాదం తేలకపోవడాన్ని రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యాక ఓటర్లు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించారు. సంక్షేమ కార్యక్రమాల మీద చేస్తున్నంత ఖర్చు ఉద్యోగాల కల్పన మీదా, సంపద సృష్టి మీదా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేయకపోవడం కూడా ప్రజల్లో నిరాశా నిస్పృహలు కలిగించాయి. అభివృద్ధికి, సంపద సృష్టికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రజలు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పోల్చి చూడడం ప్రారంభించినప్పటి నుంచి వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది.
చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ప్రతీకగా, జగన్మోహన్‌ రెడ్డి దుర్వ్యయానికి ప్రతీక కనిపించడం, ఈ ఇద్దరి పాలనను పోల్చి చూసుకోవడం వై.ఎస్‌.ఆర్‌.సి.పిని చాప కింద నీరులా దెబ్బ తీసిందన డంలో సందేహం లేదు. అవినీతి కేసులో చంద్రబాబు నాయుడును జగన్మోహన్‌ రెడ్డి అత్యంత అవమానకరంగా అరెస్టు చేయడం, 52 రోజుల పాటు జైలు పాలు చేయడం కూడా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఒక మైనస్‌ పాయింట్‌ గా మారింది. వీటన్నిటి నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఒకటి రెండు గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. మొదటగా ప్రతీకార రాజకీయా లకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం వల్ల ప్రయోజనం ఉండదు. రెండవది, అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య సమ తూకం పాటించాలి. చంద్రబాబు నాయుడుకు ఒక సదవకాశం అంది వచ్చింది. 175 స్థానాల్లో 164 స్థానాలను చేజిక్కించుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా ఆయనకు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే అవకాశం లభించినందువల్ల దీన్ని ఒక గొప్ప అవకాశంగానే పరిగణించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News