Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్New government new policies: కొత్త ప్రభుత్వం కొత్త విధానాలు

New government new policies: కొత్త ప్రభుత్వం కొత్త విధానాలు

కొత్త కేంద్ర మంత్రి మండలి కూర్పు, వారికి అప్పగించిన మంత్రిత్వ శాఖలను బట్టి చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని భారీ మార్పుల వైపు, సంస్కరణల వైపు తీసుకు వెళ్లబోతున్నట్టు అర్థమవుతోంది. మూడవసారి కూడా మంత్రి మండలి కూర్పు మీద మోదీ స్పష్టమైన ముద్ర కనిపిస్తోంది. అయితే, ఇది ఈసారి మోదీ ప్రభుత్వంగా ఉండబోవడం లేదని, ఎన్‌.డి.ఏ ప్రభుత్వంగా కొనసాగబోతోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్‌.డి.ఏ 292 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తనకు తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 40 స్థానాలు తగ్గడంతో ప్రభుత్వ పనితీరులో కొద్దిగా మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వానికి కొనసాగింపే కానీ పాలనలో కొత్తగా మార్పులు తీసుకు వచ్చే అవకాశం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదివరకటి ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈసారి బీజేపీ ప్రభుత్వం ఎక్కువగా భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కూటమిలోని పార్టీలన్నీ ఒకే తాటి మీద నిలబడడానికి, కలసికట్టుగా ఉండడానికి వేటి కారణాలు వాటికి ఉన్నప్పటికీ, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండకపోవచ్చు. దేశ భద్రత, ఆర్థిక విధానాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలను ఇదివరకటి మంత్రులకే అప్పగించడం వల్ల ప్రభుత్వ విదేశీ, ఆర్థిక, రక్షణ విధానాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనే వాదనలో అర్థం లేదు. తాము అధికారంలోకి వచ్చే పక్షంలో ఈ పర్యాయం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, మార్పులు, సంస్కరణలు చేపడతామని ఎన్నికల ప్రచార సభల్లో మోదీ చేసిన ప్రకటనలను బట్టి ఈ ప్రభుత్వం వెనుకటి ప్రభుత్వం లాగా ఉండే అవకాశం లేదని అర్థం చేసుకోవచ్చు. ఎన్‌.డి.ఎ కూటమిలో కొత్తగా చేరిన తెలుగుదేశం పార్టీ, జె.డి (యు), జె.డి (ఎస్‌), ఏక్‌ నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నాయకత్వంలోని ఎన్‌.సి.పి, చిరాగ్‌ పాశ్వాన్‌ నాయకత్వంలోని ఎల్‌.జె.పిలకు ఈ విషయం క్షుణ్ణంగా తెలుసు. ఈ పార్టీలతో ఎన్నికల పొత్తు కుదిరిన తర్వాతే మోదీ తన ప్రచారంలో తమ పార్టీ ప్రాధాన్యం ఇవ్వబోయే అంశాలను ప్రకటించారు.
మంత్రివర్గంలో వివిధ పార్టీలకు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని బట్టి బీజేపీ ప్రభుత్వ జాతీయ వాద ధోరణి, దేశ ప్రాధాన్యం మరింత స్పష్టమవుతున్నాయి. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన క్రైస్తవులు, సిక్కు లకు మంత్రివర్గంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ముస్లింలకు ప్రాతినిధ్యం లేనప్పటికీ, వారి సంక్షేమం విషయంలో తాము రాజీ పడేది లేదని మోదీ పదే పదే ప్రకటించడం జరిగింది. రాజ్‌ నాథ్‌ సింగ్‌, ఎస్‌. జైశంకర్‌, అమిత్‌ షా, నిర్మలా సీతా రామన్‌లు వరుసగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో కొనసాగడాన్ని బట్టి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గతంలో మిగిలిపోయిన లక్ష్యాలను పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు అర్థమవుతోంది. వీరు తమ బాధ్యతలను నిబద్ధతగా, చిత్తశుద్ధిగా నిర్వర్తించిన తీరును బట్టి మోదీకి వీరి పట్ల నమ్మకం పెరిగినట్టు కూడా భావించవచ్చు. కేంద్ర ప్రభుత్వ రక్షణ ఆశయాలను నెరవేర్చడంతో పాటు, సైన్యం కోసం అగ్నిపథ్‌ వంటి పథకాలను అమలు చేయడంలో కూడా రాజ్‌ నాథ్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారు. ఇక విదేశాంగ మంత్రిగా జైశంకర్‌ దేశ సాంప్రదాయిక బంధాలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు, కొత్త బంధాలను ఏర్పరచుకోవడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అమెరికాతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే, భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో జైశంకర్‌ అత్యంత సమర్థంగా వ్యవహరించారు.
కోవిడ్‌ కాలంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో నిర్మలా సీతారామన్‌ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు. వెనుకటి ప్రభుత్వంలో హోం మంత్రిగా దేశంలో శాంతిభద్రత లను పరిరక్షించడంలో అందరి ప్రశంసలూ అందుకున్న అమిత్‌ షా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలకు కృషి చేయడంతో పాటు, ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి మంత్రికీ ప్రధాని స్పష్టమైన, నిర్దుష్టమైన లక్ష్యాలను, బాధ్యతలను నిర్దేశించడం జరిగింది. సుస్థిర ప్రభుత్వానికి కృషి చేయడంతో పాటు బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కూడా వీరి మీద అదనంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News