ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. భారతదేశ జనాభా క్రమక్రమంగా పెరుగుతుండడం, దానికి తగ్గట్టుగా ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరగాల్సి రావడం వంటి కారణాల వల్ల కొత్త పార్లమెంట్ భవనం అవసరమైంది. పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించడంలో పాత పార్లమెంట్ భవనం అభిలషణీయ స్థాయికి చేరుకుంది. ప్రస్తుత పార్లమెంట్ భవనానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన అప్పటి స్పీకర్ మీరా కుమార్ 2012లో ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని నియమించారు. అయితే, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో విస్తా ప్రాజెక్టు కింద పార్లమెంట్ భవన నిర్మాణం ప్రారంభమైంది. పాలక పక్షం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ పార్లమెంట్‌లో 1272 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చోవడానికి అవకాశం ఉంది. అంతేకాక, ఇది 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది.
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా అనేక విషయాలను ఆలోచించాల్సి ఉంటుంది. ఈ పార్లమెంట్ భవనంలో అయినా ప్రజా సమస్యల మీద చర్చలు, వాదాలకు అవకాశం ఉంటుందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందా? లేక రాజకీయ పార్టీలన్నీ తమ శత్రుత్వాలను, వైషమ్యాలను ఈ పార్లమెంట్‌కు కూడా తీసుకు వస్తాయా? కీలక చర్చలను సైతం ఇప్పటి లాగే పక్కదారి పట్టిస్తూనే ఉంటాయా? ఆరోగ్యకరమయిన చర్చలకు ఏమైనా అవకాశం ఉంటుందా? నిజానికి చాలాకాలంగా పార్లమెంట్ సమావేశాలు క్రమక్రమంగా దిగజారిపోతున్నాయి. గత అయిదేళ్ల కాలంలో గత బడ్జెట్ సమావేశాలే పరమ అధ్వానంగా మారాయి. పాలక పక్షానికి, ప్రతిపక్షాలకు మధ్య ఏమాత్రం పట్టు విడుపులు లేనికారణంగా సమావేశాలన్నీ ఆటంకాలు, అవరోధాలతో అర్థంతరంగా ముగుస్తున్నాయి. లోక్‌సభ సమావేశాల కాలం బాగా తగ్గిపోయింది. 16వ లోకసభ కేవలం 331 రోజుల మాత్రమే సమావేశం కాగలిగింది. పరిస్థితులు గనుక మెరుగుపడని పక్షంలో లోక్‌సభ సమావేశాల పరిస్థితి మరింతగా దిగజారిపోవడం ఖాయం.
ప్రజా సమస్యల మీద ఆరోగ్యకరంగా చర్చించడం, ప్రజల సమస్యలకు పరిష్కారం కనుగొనడం, రాజ్యాంగ ఆశయాలకు తగ్గట్టుగా, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాలను సుసాధ్యం చేయడం వంటివి జరిగినప్పుడే పార్లమెంట్‌కు విలువ, గౌరవం ఉంటాయి. అయితే, గత కొద్ది సంవత్సరాల నుంచి పార్లమెంట్ సమావేశాలు నానాటికీ తీసికట్టు అనే స్థాయిలో దిగజారిపోతున్నాయి. పాలక, ప్రతిపక్షాలు పరస్పరం విద్వే షాలను వెళ్లగక్కుకుంటున్నాయి. సమావేశాలను ముందుకు కొనసాగనివ్వకపోవడంలో పోటీపడుతున్నాయి. ఈ రెండు పక్షాల మధ్య సయోధ్య, సామరస్యంఅనేవి కలికానికి కూడా కనిపించడం లేదు. కనీసం కొత్త పార్లమెంట్ భవనమైనా ఈ రెండు పక్షాల మధ్య ఒక కొత్త సామరస్య పూర్వక అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశిద్దాం. సరైన చట్టాలను రూపొందించడానికి, సరైన పథకాలు బయటకు తీసుకు రావడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తే పార్లమెంట్‌కూ మంచిది, ప్రజాస్వామ్యానికీ మంచిది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పార్లమెంట్‌మీద ప్రజలకు నమ్మకం కలగాలంటే ఈ రెండు పక్షాలు పరస్పరం సహకరించుకోక తప్పదు.