తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక సునామీ సృష్టించబోతోందంటూ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. బహుశా తన సభకు వచ్చిన జన సందోహాన్ని చూసి ఆయన ఈ మాట అని ఉంటారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎందరు నాయకులు వచ్చి మాట్లాడినా తమ విజయానికి తిరుగులేదని పాలక భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) కూడా ఢంకా బజాయించి చెబుతోంది. ఈ మధ్యలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని, వారు రాష్ట్రాన్ని సందర్శిస్తే తమ గెలుపు ఖాయమని మరీ మరీ చెబుతోంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా, కనీసం ‘కింగ్ మేకర్’ కావడం ఖాయమని కూడా ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఇక్కడ విస్మరించరాని విషయం ఒకటుంది. ఎవరూ పట్టించుకోని కొన్ని పార్టీలు ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3.51 శాతం ఓట్లను కూడగట్టుకుంది. మాజీ ఐ.పి.ఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) కూడా 2.06 శాతం ఓట్లను సంపాదించుకోగలిగింది.ఈసారి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన, వై.ఎస్. షర్మిల నాయకత్వంలోని వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ కూడా రంగ ప్రవేశం చేశాయి. ఈ పార్టీలు కూడా కొద్దో గొప్పో ఓట్లను సంపాదించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో తమ వై.ఎస్.ఆర్.టి.పిని విలీనం చేయడానికి షర్మిల చర్చలు జరిపారు కానీ, అవి విఫలం కావడంతో ఆమె రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను నిలబెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక బి.ఎస్.పి చాలా కాలంగా గ్రామాల్లో పనిచేస్తూ దళితులను కూడగట్టుకుంటున్నందువల్ల ఇది పాలక పక్షానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీని ఈ కోవలో చేర్చలేం కానీ, అది ఏడెనిమిది స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉంది. బి.ఆర్.ఎస్‌కు మిత్రపక్షమైన మజ్లిస్ కాంగ్రెస్ ఓట్లను చీల్చి తమ మిత్రపక్షానికి సహాయపడే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు మిగిలే ఉంది. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారి కారణంగా కనీసం 20 స్థానాలను ప్రభావితం చేయవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావడంతో ఇక్కడ ఆ పార్టీకి సరైన నాయకులు లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానం ఉండడం వల్ల, బి.ఆర్.ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తున్నందు వల్ల, ఈ తెలుగువారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఎన్నికల నిపుణులు భావిస్తున్నారు. అయితే, తాము 80 స్థానాలలో పోటీ చేయబోతున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించినందువల్ల, సీమాంధ్రులు ఈ పార్టీకి సంఘీభావం ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇది కూడా బి.ఆర్.ఎస్, బి.జె.పికి కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయమే.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో బి.జె.పి మిత్రపక్షమైన జనసేన కూడా తెలంగాణలో 30 స్థానాల్లో పోటీ చేసే ఉద్దేశంలో ఉంది.బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఇటీవల జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌తో రహస్యంగా చర్చలు జరపడం జరిగింది. బీజేపీ కోరిక మేరకు జనసేన తెలంగాణలో పోటీ చేయకపోవడానికి కూడా అవకాశం ఉంది. గతగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ కోరిక మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. వాస్తవానికి, అభివృద్ధి, సంక్షేమాలను మేళవించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడడమే కాకుండా, తెలంగాణను దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్య భాగం చేసిన బి.ఆర్.ఎస్‌ను ఓడించడం మిగిలిన పార్టీలకు అంత తేలిక కాకపోవచ్చు. అయినప్పటికీ, తెలుగుదేశం తదితర పార్టీలను కూడా దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది.
New political equations in Telangana: తెలంగాణలో సరికొత్త రాజకీయ బంధాలు
బరిలో BRS, కాంగ్రెస్, BJP, MIM, YSRTP, TDP, BSP