ఇందిరా గాంధీ హయాంలో, అంటే దాదాపు 1969 నుంచి గవర్నర్ల వ్యవస్థ కొత్తపుంతలు తొక్కింది. రాష్ట్రాల గవర్నర్లుగా సమాజ సేవకులను నియమించడమనే సంప్రదాయం అడుగంటి పోయి, తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు, తమకు, తమ కుటుంబానికి విధేయంగా ఉన్న నేతలకు, తమ అడుగులకు మడుగులొత్తే నాయకులు లేదా రిటైర్డ్ అధికారులకు గవర్నర్ల పదవులు అప్పగించడం ఆనవాయితీగా మారింది. పైగా ఏ గవర్నరూ పూర్తిగా అయిదేళ్ల కాలం అధికారంలో కొనసాగడమనేది అరుదుగా జరుగుతుండేది. ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో కొత్త సంప్రదాయాలను నెలకొల్పడం జరిగింది. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన అధినేతలు. రాష్ట్రపతికి రాష్ట్రాల్లో ప్రతినిధులుగా వ్యవహరించడమనేది ఈ గవర్నర్ల ప్రధాన కర్తవ్యం. అయితే, కాల క్రమంలో వారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధులుగా మారిపోవడం జరుగుతోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆరుగురు గవర్నర్లను నియమించడం, ముగ్గురు గవర్నర్లను బదిలీ చేయడం రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అద్దం పడుతోంది. గవర్నర్లు తమ రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు కాకుండా రాజ్యాంగేతర బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం కూడా గవర్నర్ల నియామకంలో నియమ నిబంధనలను, సంప్రదాయాలను ఏమాత్రం ఉల్లంఘించలేదు. సీనియర్ రాజకీయ నాయకులను, తమకు విధేయులుగా ఉన్న రిటైర్డ్ బ్యురాక్రాట్లను మాత్రమే గవర్నర్లుగా నియమించడం జరిగింది. సమాజానికి సేవ చేసినవారిని, స్వతంత్ర ఆలోచనలు కలిగిన వారిని గవర్నర్లు నియమించడమనే సంప్రదాయం అంతరించిపోయి అయిదు దశాబ్దాలు కావస్తున్నందు వల్ల ఇక వాటి గురించి చింతించి ప్రయోజనం లేదు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ఒ.పి. మాథుర్ ను సిక్కిం గవర్నర్ గా నియమించారు. తనకన్నా జూనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాధుర్ రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించడం ఇష్టం లేని బీజేపీ ప్రభుత్వం ఆయనను సిక్కిం రాష్ట్రానికి పంపేయడం జరిగింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు ఎవరూ అడ్డు రాకూడదనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఏ పార్టీ ప్రభుత్వానికైనా గవర్నర్ పదవి అనేది పునరావాస కేంద్రమే. రాష్ట్రాల వ్యవహారాలకు సంబంధించిన ఏ పార్టీకైనా గవర్నర్ల వ్యవస్థ ఒక మార్గదర్శక మండలేననడంలో సందేహం లేదు. మాజీ కేంద్ర మంత్రి గంగ్వార్ ను జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పంపడం జరిగింది. ఆయన రాజకీయంగా చురుకైన పాత్ర పోషించలేకపోతున్నందువల్ల ఆయనను జార్ఖండ్ రాష్ట్రానికి తరలించాల్సి వచ్చింది. ఆయనకు ఇది రాజకీయ పునరావాసం. కొందరు నాయకులు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా కూడా ఇటువంటి ప్రతిఫలాలు అందు తుంటాయి.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీర విధేయుడుగా ఉన్న మాజీ ఐ.ఎ.ఎస్ అధికారి కె. కైలాసనాథన్ ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. ఆయన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఈ విధంగా పునరావాసం కల్పించడం జరిగింది. ఒకటి రెండు నియామకాలు తమ సౌకర్యం, తమ వెసులుబాటు, తమ అవసరాల కోసం కూడా జరుగుతూ ఉంటాయి. అస్సాం గవర్నర్ గా ఉన్న గులాబ్ చంద్ కటారియాను పంజాబ్ గవర్నర్ గా బదిలీ చేశారు. ఇది ఆయన స్వరాష్ట్రమైన రాజస్థాన్ కు దగ్గరగా ఉంది. జార్ఖ్‌ండ గవర్నర్ గా ఉన్న సి.పి. రాధాకృష్ణన్‌ను మరింత పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రకు బదిలీ చేయడం జరిగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్నందువల్ల ఈ మార్పులు జరిగాయి. గవర్నర్ల నియామకమనేది కేంద్ర ప్రభుత్వ ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. గవర్నర్ల నియామకం కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి సంబంధించింది. అయితే, ఈ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్యలు సృష్టించకుండా ఉండడమనేది చాలా ప్రధానం. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో గవర్నర్లకు మార్గనిర్దేశకత్వం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కొందరు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్యలు సృష్టించడం, వాటి బాధ్యతలకు అడ్డు తగలడం, వేధించడం జరుగుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు రాజ్యాంగాతీతంగా, రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించడమనేది అభిలషణీయం కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తినే కాక, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తిని కూడా దెబ్బతీసి, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నీరుగార్చే అవకాశం ఉంటుంది. గవర్నర్ పదవికి రాజ్యాంగం ప్రత్యేక అర్హతలను నిర్దేశించనప్పటికీ, చాలా ఏళ్లుగా గవర్నర్లు రాజ్యాంగం పట్ల పూర్తి అజ్ఞానంతో వ్యవహరించడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఇందుకు సహకరించడం, దీన్ని ప్రోత్సహించడం కూడా జరుగుతోంది.