Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్New strategy for Kashmir: కాశ్మీర్‌ కోసం కొత్త వ్యూహం

New strategy for Kashmir: కాశ్మీర్‌ కోసం కొత్త వ్యూహం

కాశ్మీర్‌ లో 48 గంటల కాలంలో వరుసగా నాలుగుసార్లు ఉగ్రవాదుల దాడుల జరిగాయి. జమ్మూలోని కతువా పట్టణానికి 124 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్నోటా గ్రామంలో సైనిక శకటాలపై ఉగ్రవాదులు గత 8వ తేదీన దారి కాచి దాడి చేయడంతో అయిదుగురు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2016 జూలై 8న దక్షిణ కాశ్మీర్‌ లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ నాయకుడు బుర్హాన్‌ వనీని సైనికులు హతమార్చినందుకు ప్రతీకారంగా, వనీ వర్ధంతి రోజును ఎంచుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా కనిపిస్తోంది. కాగా, జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాదాపు రోజుకొక దాడికి పాల్పడుతూనే ఉన్నారు. ఇదివరకూ కాశ్మీర్‌ ప్రాంతానికే పరిమితమైన ఉగ్ర దాడులు క్రమంగా జమ్మూ ప్రాంతం వైపు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది. పైగా, ఉగ్రవాదులు తమ దాడులకు రాజౌరి-పూంచ్‌ రంగాన్ని ఎంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున, అంటే గత జూన్‌ 9న ఉగ్రవాదులు రియాసి జిల్లాలో టూరిస్టు బస్సుపైన దాడి చేసి తొమ్మిది మందిని పొట్టనబెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో యాత్రికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ప్రాంతంలో 1990లలోనూ 2000లలోనూ చొరబాట్లు ఎక్కువగా జరుగుతుండేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటోంది. స్థానికుల సహాయ సహాకారాల వల్ల, 2003లో ఆపరేషన్‌ సర్ప వినాశ్‌ పేరుతో సైనికులు చేపట్టిన వ్యూహం వల్ల ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకు సర్దుమణిగాయి.
ఈ విధంగా సైనికుల మీదా, పౌరుల మీదా తరచూ దాడులు జరగడం ఆధునిక రక్షణ పద్ధతుల్లో, టెక్నాలజీలో సుశిక్షుతలైన సైనిక బలగాలకు ఏమాత్రం సమంజసమైన వ్యవహారం కాదు. సైనిక బలగాలు మరింత కఠినంగా, మరింత చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తమ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను మరింతగా పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ పాటించడం వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్న ప్పటికీ, ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త రకం హింసాకాండలను చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాశ్మీర్‌ లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడానికి అనేక కారణాలుండవచ్చు. ఎక్కువ మంది సైనికులను తూర్పు లడఖ్‌ ప్రాంతానికి తరలించడం కూడా ఇందుకు కొద్దిగా దోహదం చేసి ఉండవచ్చు. చైనా బలగాల కారణంగా 2020 నుంచి తూర్పు లడఖ్‌ లో అత్యధిక సంఖ్యలో సైనిక బలగాల తరలింపు అవసరమవుతోంది. దీని ఫలితంగా ఇంటెలిజెన్స్‌ సిబ్బంది కూడా ఆ ప్రాంతం మీద దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది.
చొరబాట్లను, దాడులను పెంచే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఆధునిక టెక్నాలజీ పద్ధతులను విస్తృ తంగా వాడడం జరుగుతోంది. స్థానికులతో కలిసిపోవడం కూడా వీరికి తేలిక అవుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి సంబంధించి పాకిస్థాన్‌ మీద అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్‌ లో స్థానిక ఉగ్రవాదులను పెంచి పోషించడం, వారికి శిక్షణనివ్వడం ఎక్కువవుతోంది. ఇది కాకుండా, కొత్త ఉగ్రవాద సంస్థలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడ ఏ దాడి జరిగినా తాము బాధ్యులమంటూ ప్రకటించుకుంటున్నాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి, స్థానిక పాలనా యంత్రాంగానికి, సైనిక బలగాలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక్కడ సైనిక బలగాలను మరింతగా పెంచడం, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను పటిష్ఠం చేయడం, సైనికులకు మరింత ఆధునిక శిక్షణనివ్వడం వంటి ద్వారానే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకుని ఇక్కడ అమలు పరిస్తే తప్ప పౌరులకు, సైనికులకు నిష్కృతి ఉండకపోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News