Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్NIRF report: విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలకు గ్రహణం

NIRF report: విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలకు గ్రహణం

దేశంలోని పలు విద్యా సంస్థల తీరుతెన్నులను మదింపు చేసే ‘ది నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌’ (ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌) తన 2024 నివేదికలో కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలను వెల్లడించింది. దేశంలోని విద్యాసంస్థల మధ్య పోటీదాయక పరిస్థితిని పెంపొందించి, అవి తమ ప్రమాణాలను మెరుగుపరచుకునేలా చేయడానికి ఈ ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌ సంస్థ ఏర్పడింది. అంతర్జాతీయ స్థాయి మదింపు సంస్థల వల్ల భారతదేశానికి పెద్దగా ఉపయోగ మేమీ లేనందువల్ల ఇటు వంటి జాతీయ సంస్థను ఏర్పాటు చేయవలసి వచ్చింది. దేశంలోని విద్యాసంస్థలను 16 వర్గాలుగా విభజించి, వీటి ప్రమాణాలను, స్థితిగతులను మదింపు చేయడం జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నైపుణ్య విశ్వవిద్యాలయాలు, బహిరంగ విశ్వవిద్యాలయాల పేరుతో మూడు కొత్త కేటగిరీలను ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌ సంస్థ తాజాగా చేపట్టిన మదింపులో ఐ.ఐ.టి-మద్రాసుకు మొదటి స్థానం లభించగా, బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సికి రెండవ స్థానం, ముంబైలోని ఐ.ఐ.టికి మూడవ స్థానం లభించాయి.
ఇక ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ, బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ లకు కూడా వాటి కేటగిరీల్లో ఉన్నత స్థానాలు లభించాయి. ఈ సార్వత్రిక మదింపులో తేలిందేమిటంటే, ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేట్‌ విద్యా సంస్థలే అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్నాయి. నిజానికి, గత ఏడాదితో పోలిస్తే అనేక ఉన్నత స్థాయి సంస్థలు మరింత మెరుగు పడ్డాయి కానీ, అవి తమ కేటగిరీల్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న కొన్ని సంస్థల స్థాయికి చేరుకోవాల్సి ఉంది. ఈ ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌ సంస్థ ప్రధాన లక్ష్యం కూడా అదే. అంతర్జాతీయ విద్యాసంస్థల ర్యాంకింగుల విషయానికి వస్తే మాత్రం ఈ సంస్థలేవీ వాటికి పోటీ పడేంత స్థాయిలో లేవు. కేవలం దేశంలోని విద్యాసంస్థలు మాత్రమే ఒక దానితో ఒకటి పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్‌.ఐ.ఆర్‌.ఎఫ్‌ సంస్థ అందుకు వీలైనన్ని అవకాశం కల్పిస్తూ, వాటికొక ప్రధాన వేదికగా, కేంద్ర బిందువుగా మారింది.
ప్రభుత్వ విద్యా సంస్థల విషయానికి వస్తే, ప్రభుత్వం మరింత పటిష్ఠమైన విధానాలను రూపొం దించడంతో పాటు, బడ్జెట్‌ పరంగా కూడా వీటికి ఆలంబన కావాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యలో ప్రమాణాలు పెరగాలన్న పక్షంలో పాఠశాల విద్య స్థాయి నుంచే అందుకు పునాదులు పడాల్సి ఉంటుంది. అంటే, పాఠశాల స్థాయి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వశాఖ కూడా దేశంలోని సుమారు 15,000 పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ)ల పనితీరును, ప్రమాణాలను మదింపు చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఐ.టి.ఐల పనితీరును మెరుగుపరచ డానికి, వాటి ప్రాభవం పెంచడానికి భారీగా చర్యలు తీసు కోవాలని ఈ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వీటి ద్వారా మరింత మెరుగైన సాంకేతిక, వృత్తిపరమైన విద్యను అందించాలని ఈ మంత్రిత్వ శాఖ సంకల్పించింది. దేశంలో అత్యధిక భాగం ఐ.టి.ఐలు ప్రైవేట్‌ రంగంలోనే ఉన్నాయి. అయితే, ప్రైవేట్‌ రంగంలోని ఐ.టి.ఐలలో చేరుతున్న వారి సంఖ్య 43 శాతానికి మించి లేకపోవడం, ప్రభుత్వ ఐ.టి.ఐలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య 50 శాతం దాటు తుండడాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది.
భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి నైపుణ్యాల కొరత ప్రధాన అవరోధంగా ఉన్నందు వల్ల నైపుణ్యాల మంత్రిత్వ శాఖ దేశంలో విద్యాధిక యువతలో ఆధునిక నైపుణ్యాలను పెంచడం మీద దృష్టి కేంద్రీకరిస్తోంది. నైపుణ్యాలను పెంచడానికి ఐ.టి.ఐలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుం దని ఈ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ ఐ.టి.ఐలలో సుమారు 150 వృత్తుల్లో శిక్షణనివ్వడం జరుగుతోంది. ఈ పారిశ్రామిక సంస్థలను మరింత ఆధునికం చేసి, మరింత మంది విద్యార్థులను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐ.టి.ఐల పనితీరును పోటీదాయకం చేయడానికి ఇటువంటి మదింపు చాలా అవసరం. దేశంలోని దాదాపు ప్రతి విద్యాసంస్థలోనూ ప్రమాణాలను, పోటీ తత్వాన్ని పెంచడానికి ఇటువంటి ర్యాంకింగ్‌ వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News