నరేంద్ర మోడీ నాయకత్వంలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని అంశాలు కీలకం కానున్నాయి. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి, కులగణన, అగ్నిపథ్ పథకం, పౌరసత్వ సవరణ చట్టం ముఖ్యమైనవి.
ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోదని గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించే అవకాశాలున్నాయి. బీహార్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలను దూరం చేసుకోవాలని ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీ అధినేత నితీశ్ కుమార్ అనుకోరు. ఈ ఏడాది ఏప్రిల్ 14న కమలం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల ప్రతిపాదన ఉంది. ఒకే దేశం – ఒకే ఎన్నికల నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వాస్తవానికి జమిలి ఎన్నికలంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడమే. రాజ్యాంగంలో పొందుపరచిన సమాఖ్య స్ఫూర్తికి ఎసరు పెట్టడమే తప్ప మరొకటి కాదు. అంతేకాదు జమిలి ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రమాదంలో పడుతుందంటున్నారు రాజ్యాంగ నిపుణులు.
ఊహించిందే జరిగింది
బీహార్ ముఖ్యమంత్రి, జేడీ (యూ) అధినేత నితీశ్ కుమార్ స్వరం పెంచారు. కేంద్ర ప్రభుత్వంపై గళమెత్తారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేని పక్షంలో అందుకు సమానంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జేడీ (యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై పెద్దగా స్పందించలేదు. గత రెండు ప్రభుత్వాల్లో కేంద్రంలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలాన్ని చూసి నితీశ్ కుమార్ కూడా పెద్దగా పట్టుబట్టలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వంలో జేడీ (యూ) భాగస్వామ్య పక్షంగా చేరిన తరువాత నితీశ్ కుమార్ స్వరం మారింది. నితీశ్ కుమార్ ఏ ఒక్క డిమాండ్‌కో పరిమితమయ్యే నాయకుడు కాదు. బీహార్ ప్రయోజనాల కోసం ఇక వరుస డిమాండ్లు చేస్తారు. తాను అనుకున్నది సాధించేదాకా నితీశ్ వదలిపెట్టరు. తాను పెట్టిన డిమాండ్ ను ఏమాత్రం సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోకపోయినా, నరేంద్ర మోడీ – అమిత్ షా ద్వయానికి చుక్కలు చూపించే ఘనుడు నితీశ్ కుమార్. అంతేకాదు నితీశ్ కుమార్ ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక శిబిరానికి కట్టుబడి ఉండే నాయకుడు కాడు. వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది నితీశ్ కుమారే. అయితే ఇండియా కూటమి కన్వీనర్ పదవి దగ్గర కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదాలు రావడంతో ఎటువంటి మొహమాటం లేకుండా ఇండియా కూటమికి గుడ్‌బై కొట్టారు.బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలోకి జంప్ చేశారు. నితీశ్ కుమార్ పొలిటికల్ ఫీట్లు కమలనాథులకు తెలియనిది కాదు.
తాజాగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని అంశాలు కీలకం కానున్నాయి. వీటిలో ఉమ్మడి పౌరస్మృతి, కులగణన, అగ్నిపథ్ పథకం, పౌరసత్వ సవరణ చట్టం ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతి కొత్త అంశం కాదు. సివిల్ అంశాలకు సంబంధించి అన్ని మతాలవారిని ఒకే చట్టం కిందకు తీసుకురావాలన్నది కొంతకాలంగా భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బీజేపీ అజెండాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అయితే అప్పటికి బీజేపీ మిత్రపక్షాలమీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది. దీంతో పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది భారతీయ జనతా పార్టీ. గతంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో తగినంత సంఖ్యాబాలం ఉండటంతో ఉమ్మడి పౌరస్మృతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మనదేశంలోని ప్రజలందరికీ నేరాలకు సంబంధించి విచారించడానికి ఒక చట్టం ఉంది. అదే ఇండియన్ పీనల్ కోడ్. మతాలతో సంబంధం లేకుండా ఎవరు నేరం చేసినా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వారిని విచారిస్తారు. నేరం రుజువైతే శిక్ష విధిస్తారు. ఈ అంశంతో ఎవరికీ పేచీ లేదు. నేరం ఎవరు చేసినా నేరమే. ఇందులో రెండో ముచ్చటే లేదు. అయితే వివాహం, విడాకులు, దత్తత, వారసత్వ హక్కులు వంటి సివిల్ అంశాలకు సంబంధించి వేర్వేరు చట్టాలున్నాయి. ఇలాంటి వ్యక్తిగత అంశాలకు సంబంధించి ముస్లింలు తమ ధర్మశాస్త్రమైన షరియాను అనుసరిస్తుంటారు. షరియాకు లోబడే అన్ని సివిల్ వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇది, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే. అయితే ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశ ప్రజలందరికీ వారివారి మతవిశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే హక్కు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదిస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడం అంటే తమ మతపరమైన ఆచారాలకు, విశ్వాసాలకు సంబంధించిన హక్కులను పాతర వేయడమేనంటున్నారు ముస్లిం పెద్దలు. ఇదిలా ఉంటే ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోదని గతంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకించే అవకాశాలున్నాయి. బీహార్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీలను దూరం చేసుకోవాలని ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీ అధినేత నితీశ్ కుమార్ అనుకోరు. ఇక పౌరసత్వ సవరణ చట్టం విషయానికి వస్తే ఇది కూడా పాత అంశమే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన వాగ్దానాల్లో సీఏఏ అమలు కూడా ఒకటి. ప్రస్తుతం కమలం పార్టీతో జత కట్టిన జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీ కూడా గతంలో సీఏఏను వ్యతిరేకించింది. సీఏఏను బీహార్‌లో అమలు జరిపేది లేదని ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుండబద్దలు కొట్టారు. కాగా సీఏఏ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి తెలియాల్సి ఉంది.
వివాదాస్పదంగా జమిలి ప్రతిపాదన !
ఈ ఏడాది ఏప్రిల్ 14న కమలం పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికల ప్రతిపాదన ఉంది. ఒకే దేశం – ఒకే ఎన్నికల నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వాస్తవానికి జమిలి ఎన్నికలంటే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడమే. రాజ్యాంగంలో పొందుపరచిన సమాఖ్య స్ఫూర్తికి ఎసరు పెట్టడమే తప్ప మరొకటి కాదు. అంతేకాదు జమిలి ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రమాదంలో పడుతుందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. సహజంగా లోక్‌సభ ఎన్నికలప్పుడు, జాతీయ అంశాలు తెరమీదకు వస్తుంటాయి.అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదకు వస్తుంటాయి. ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్‌సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తుంటారు. ఇదిలాఉంటే,లోక్‌సభకు, అసెంబ్లీలకు జమిలి పేరుతో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నది ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్ ) పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే. కులగణన…ఇది మరో కీలక అంశం. నితీశ్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కులగణనను విజయవంతంగా రెండు విడతల్లో నిర్వహించింది. అంతేకాదు కులగణనను దేశవ్యాప్తంగా నిర్వహించాలని జేడీ ( యూ) కోరుతోంది. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు జరగాలన్నా కులాలవారీగా జనాభాను లెక్కించి తీరాల్సిందే. బీసీల నాయకత్వంలో నడిచే ప్రధాన రాజకీయ పార్టీలు చాలా కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నాయి. కులాలవారీగా లెక్కలు లేనట్లయితే తమ మేలు కోసం తీసుకువచ్చే చట్టాల అమలులో తీవ్ర ఇబ్బందులు ఉంటాయంటున్నారు బీసీ వర్గాల నేతలు. దేశ జనాభాలో కులపరంగా, ఆర్థికంగా, చదువుపరంగా వెనుకబడిన కులాలు …అంటే ఓబీసీలు 52 శాతం ఉంటారన్నది ఒక అంచనా. వీరికి కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ గతంలోనే సిఫార్సు చేసింది. 1931లో చివరిసారిగా జరిగిన కులగణన వివరాలను ఓబీసీల గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంది. అప్పటి నుంచి దేశంలో వివిధ వెనుకబడిన తరగతులు ఎంత శాతం ఉన్నాయనే విషయాన్ని కచ్చితంగా లెక్కగట్టాలనే డిమాండ్ బలంపుంజుకొంది. అయినా 2001,2011 సెన్సస్‌లో కులాల వారీగా లెక్కలు తీయడానికి కేంద్రం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బీజేసీ అసాధ్యం అనుకున్న కులగణనను చేసి అందరితో శెహభాష్ అనిపించుకున్నారు నితీశ్ కుమార్. అయితే కులగణనపై చంద్రబాబు నాయుడు భిన్నమైన వైఖరి తీసుకుంటారన్న వార్తలందుతున్నాయి.
అగ్నిపథ్ పథకం రద్దు అవుతుందా ?
అగ్నిపథ్ ..దాదాపు రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం ఇది. మెరికల్లాంటి యువతకు సైన్యంలో కొలువులు కల్పించడమే అగ్నిపథ్ పథకం ప్రధాన లక్ష్యం. అయితే సైన్యంలో కొలువు అంటే ఓ ఇరవై ఏళ్లో లేదా పాతికేళ్లో అని అందరూ భావిస్తారు. కనీసం పదిహేనేళ్లు అయినా ఉంటుందని ఆశిస్తారు. అయితే అగ్నిపథ్ పథకంలో కేంద్రం ఇచ్చే ఉద్యోగం కేవలం నాలుగేళ్లే ఉంటుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తరువాత అగ్నివీరులు ఇంటికి పోవాల్సిందే. మరో ప్రత్యామ్నాయం లేదు. స్థూలంగా ఇదీ కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న అగ్నిపథ్ పథకం అసలు రూపం. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకాన్ని మరోసారి సమీక్షించాలని జనతాదళ్ (యునైటెడ్ ) అలాగే లోక్‌జనశక్తి పార్టీ కోరుతున్నాయి. దేశ అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని భాగస్వామ్యపక్షాల సూచనల మేరకు సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నరేంద్ర మోడీ ఒంటెత్తు పోకడలకు ఇక చోటుండదు. పాత రాజకీయాలకు బదులు తమ ప్రయోజనాలే పార్టీలకు లక్ష్యాలు కావాలని దేశ ప్రజలు ఈ ఎన్నికలలో స్పష్టంగా తీర్పు ఇచ్చారు. సంకీర్ణ ధర్నాన్ని పాటిస్తారన్న భరోసాతోనే నరేంద్ర మోడీ నాయకత్వానికి భాగస్వామ్యపక్షాలు జై కొట్టాయి. దీనికి అనుగుణంగా నరేంద్ర మోడీ సర్కార్ వ్యవహరించాలి. సంకీర్ణ ధర్మాన్ని పాటించి తీరాలి.
- ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320