మహానగరంలో ఎవరెక్కడ?
- గూగుల్ మ్యాప్‌లే అందరికీ దిక్కు
- వాటిని నమ్ముకుంటే కష్టమే
- స్పష్టమైన చిరునామాలే పరిష్కారం
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)
చిరునామా.. ఈ మాట విని ఎన్నాళ్లు.. కాదు ఎన్నేళ్లయిందో కదా! ఒకప్పుడు కేవలం డోర్ నంబర్లు, వీధుల ఆధారంగానే ఎక్కడికైనా వెళ్లగలిగేవాళ్లం. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు, దేశంలో ఏ మారుమూలకు వెళ్లాలన్నా అవే దిక్కు. కాలనీ, వీధి, డోర్ నంబర్.. ఈ మూడు ఉంటే చాలు ఏ నగరంలో ఎవరు ఎక్కడున్నా సులభంగా పట్టుకోగలిగేవాళ్లం. క్రమంగా సాంకేతికత పెరిగింది. ఆ తర్వాత చిరునామా గల్లంతయిపోయింది. ఇది ఎంతలా అయ్యిందంటే, మనకు అత్యంత ఆప్తులు, బంధువులు, స్నేహితుల ఇళ్లు ఎక్కడున్నాయో మనకు తెలిసినా, వాళ్ల చిరునామాలు మాత్రం తెలియడం లేదు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందని వాళ్లను పిలవాలంటే శుభలేఖ పంపడానికి చిరునామాలను అప్పటికప్పుడు తీసుకుంటున్నారు, కార్డు మీద రాసి పోస్టు చేసి, ఆ తర్వాత దాని సంగతి పూర్తిగా మర్చిపోతున్నారు. దాంతో చిరునామా అనే ఒక పదమే కొత్త తరం మర్చిపోయేలా ఉంది.
స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ రాకతో…
స్మార్ట్ ఫోన్లు వచ్చి, అందులో పాకెట్ ఇంటర్నెట్ ఛార్జీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి పరిస్థితి మరీ మారిపోయింది. చిరునామాల స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ లాంటివి ఆక్రమించడం మొదలైంది. మనం ఎవరి ఇంటికి వెళ్లాలన్నా వాళ్లకు ముందే ఫోన్ చేసి లొకేషన్ అడుగుతున్నాం. దగ్గర వరకు మెట్రో రైల్లో వెళ్లినా, అక్కడినుంచి ఆటో, క్యాబ్ లాంటివాటిని ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి యాప్స్‌లో బుక్ చేసుకుంటున్నాం. మొదట్లో వాటికి కూడా చిరునామా ఇవ్వాల్సి వచ్చేది. కానీ క్రమంగా అవి కూడా అప్‌గ్రేడ్ అయ్యాయి. కేవలం లొకేషన్ ఉంటే చాలు, దాని ఆధారంగానే బుక్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు అవతలివాళ్లు పంపిన లొకేషన్‌కు నేరుగా బుక్ చేసుకుంటున్నాం, అక్కడకు వెళ్లి చేరుకుంటున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా చిరునామా అన్న ప్రసక్తే ఉండట్లేదు.
మ్యాప్స్ సరిగ్గానే చూపిస్తాయా?
గూగుల్ మ్యాప్స్ లాంటి వాటిలో లొకేషన్ షేర్ చేసేటప్పుడు 20 మీటర్ల దూరం వరకు కచ్చితం అనే ఒక నోట్ కనపడుతుంది. చాలామంది దాన్ని పట్టించుకోరు. కానీ, దానివల్ల చాలా సందర్భాల్లో ఒక సందు ముందుగానీ, ఒక సందు తర్వాత గానీ మన లొకేషన్ అవతలివాళ్లకి చూపిస్తుంది. అప్పుడు మళ్లీ ఫోన్ చేసి, ఎక్కడున్నారో కనుక్కుని దాన్ని బట్టి మన వివరాలు చెబుతూ వాళ్లను పిలిపించుకోవాల్సి ఉంటుంది.
చెరువులు.. కాలువల్లోకీ..
కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ లాంటి వాటిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అన్న సామెత నిజంగానే రుజువవుతోంది. ఇటీవల ఇద్దరు యువకులు కేరళ వెళ్లారు. అక్కడ వాళ్లు వెళ్లాల్సిన ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు. కానీ లొకేషన్ పట్టుకుని సెల్ఫ్ డ్రైవింగ్ కారు తీసుకుని మరీ వెళ్లారు. తీరా కొంతదూరం వెళ్లిన తర్వాత చీకటి పడింది. మ్యాప్స్‌లో వస్తున్న డైరెక్షన్స్ ఆధారంగా కుడి, ఎడమలు తిరుగుతూ నేరుగా వెళ్లి ఓ చెరువులో పడ్డారు. కేరళలో చాలా ప్రాంతాల్లో చెరువులు, కాలవలు, బ్యాక్ వాటర్స్ లాంటివి ఉంటాయి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఎడమ వైపునకు బదులు కుడివైపు తిరిగినా నేరుగా వెళ్లి నీళ్లలోనే పడతారు.
మూలాల్లోకి మళ్లీ వెళ్దామా?
నిజానికి సెల్ ఫోన్లు రాకముందు మనకి ఎస్టీడీ కోడ్‌తో సహా ఫోన్ నంబర్లు అన్నీ గుర్తుండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భీమవరంలో నంబరు అనగానే 08816 అనే కోడ్ గుర్తుకొచ్చేది. ఏలూరు అంటే 08812, వరంగల్ అంటే 0870, కరీంనగర్ అంటే 0878 ఉండేవి. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, చెన్నై నగరాలకు ప్రత్యేకంగా 011, 022, 033, 044 అనే ఎస్టీడీ కోడ్‌లు ఉండేవి. ఇలా ఫోన్ నంబర్లతో పాటు చిరునామాలను కూడా గుర్తుపెట్టుకునేవాళ్లం, లేదా జేబులో పట్టే చిన్న అడ్రస్‌బుక్‌లు తీసుకుని వాటిలో రాసుకునేవాళ్లం. మెహిదీపట్నం గుడిమల్కాపూర్ పూలమార్కెట్ ఎదురుగా సత్యనారాయణ నగర్ కాలనీలోని రేణుకా ఎల్లమ్మ గుడి తర్వాత నాలుగో ఇల్లు అని చెబితే… ఎవ్వరినీ అడగాల్సిన అవసరమే లేకుండా నేరుగా ఇంటి కాలింగ్ బెల్ కొట్టేలా ఉండేది. చందానగర్ పోలీసుస్టేషన్ పక్కనుంచి వెళ్తే ఎడమవైపు రెండో సందు తిరిగి తిన్నగా ముందుకు వస్తే కుడివైపు ఉండే అపార్టుమెంటు అని చెప్పేవారు. ఇక నిజాంపేట ప్రాంతంలో అయితే మూడు కోతులు, ఏనుగుల బొమ్మల సెంటర్ల నుంచి ముందు, వెనక కుడి, ఎడమవైపుల ఉన్న సందుల్లో అంటూ చిరునామాలు చెప్పేవారు. ఇప్పుడు అవన్నీ మళ్లీ ఒక్కసారి గుర్తుతెచ్చుకుంటే… మన మూలాల్లోకి వెళ్లే ఎంత బాగుంటుందో కదా!