Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్No development no Welfare? సంక్షేమమే తప్ప అభివృద్ధి ఏదీ?

No development no Welfare? సంక్షేమమే తప్ప అభివృద్ధి ఏదీ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత రాజకీయ పరిస్థితి రోజు రోజుకూ వేడెక్కుతున్న తీరు గమనిస్తే శాసనసభ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయా అనిపిస్తుంది. రాష్ట్రంలో అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందువల్ల పార్టీ శ్రేణులంతా సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇక పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి దేశంలోనే కనీ వినీ ఎరుగని విధంగా ప్రజలను చేరడానికి వినూత్న పథకాలతో ముందుకు ఉరుకుతోంది. తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వెళ్లి తమ ప్రభుత్వం చేపడుతున్న, చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. శాసనసభ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది మేలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, పాలక, ప్రతిపక్షాలలో మాత్రం విపరీతమైన తొందర కనిపిస్తోంది. ఈ పార్టీల నాయకులు తాము అత్యంత వేగంగా నియోజక వర్గాలలో పర్యటనలు చేయడంతో పాటు తమ వర్గాలను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.
ఇందుకు ఇటీవల కొంత కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలే కారణం కావొచ్చు. పట్టభద్రుల ఎం.ఎల్‌.సి ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం, పాలక పక్షం మీద విపరీతంగా ఒత్తిడి పెరుగుతుండడం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. కొన్ని రకాల సమస్యలతో, ఒత్తిళ్లతో పాలక పక్షం ఉక్కిరిబిక్కిరై పోతోంది. పార్టీలో అసమ్మతివాదులు పెరుగుతుండడం పార్టీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండగా, పార్టీ ఎన్నికల వ్యూహాలు విఫలమై, తాము గెలవాల్సిన స్థానాలలో ప్రతిపక్షం గెలవడానికి అవకాశం ఇవ్వడం పార్టీ శ్రేణులను సైతం కలవరపరుస్తోంది. ఈరాజకీయ వ్యూహం విఫలం చెందడం పార్టీకి నైతికంగా భారీ నష్టాన్ని కలగజేసింది. ఇవి చాలవన్నట్టు, వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి తమ్ముడు వై.ఎస్‌. వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం అనేది జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మీద దుష్ప్రభావాన్ని ప్రసరింపజేస్తోంది. ఇది న్యాయస్థానం తేల్చాల్సిన అంశమే అయినప్పటికీ, రాజకీయంగా దీని ఫలితం మాత్రం చాలావరకు ప్రతికూలంగా ఉంటోంది.
ఈ హత్యతో జగన్మోహన్‌ రెడ్డికి ఎటువంటి సంబంధమూ లేనప్పటికీ, ప్రతిపక్ష టీడీపీ ఈ హత్యతో జగన్మోహన్‌ రెడ్డికి ప్రత్యక్ష సంబంధం ఉందన్నట్టుగా ప్రచారం చేయడంతో పాటు, జగన్మోహన్‌ రెడ్డి పాలనను ‘రాక్షస పాలన’గా అభివర్ణించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగించడానికి ప్రతిపక్ష టీడీపీ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటోంది. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే కార్యక్రమం ద్వారా పార్టీ నాయకులు ఇప్పటి వరకూ గత 11 రోజుల కాలంలో 78 లక్షల కుటుంబాలను సందర్శించి, తమ పార్టీ పథకాలు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ చేరుతున్నాయా లేదా అని పరిశీలించడం జరుగుతోంది. ఈ పార్టీలు ప్రజలను చేరడంలో రెండు విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి. పాలక పక్షం పూర్తిగా తమ సంక్షేమ పథకాల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తోంది. కాగా, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకత్వం మాత్రం పాలక పక్ష నాయకుల మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మీద వ్యక్తిగత ఆరోపణలు సైతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తడం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా సుడిగాలిలా పర్యటిస్తుండగా, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ రెండు నెలలుగా పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో గెలుపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న బీజేపీ అడపా దడపా పాలక పక్షం మీద విరుచుకుపడుతూ తన వంతు విమర్శలు, ఆరోపణలు కొనసాగిస్తోంది. నిజానికి, ఈ పార్టీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేదు కానీ, కేంద్రంలో ఈ పార్టీ అధికారంలో ఉండడం ఇందుకు ఊతమిస్తోంది. 2024 ఎన్నికల నాటికి వై.ఎస్‌.ఆర్‌.సి.పిని, దానితో పాటు తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా బలహీనపరచి, రాష్ట్రంలో పట్టు సంపాదించాలనేది ఈ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.మొత్తానికి, ఈ పార్టీలు చేస్తున్న ప్రచారాలు, ఆర్భాటాలు రాష్ట్ర రాజకీయ పరిస్థితిని ఘాటెక్కించడంతో పాటుగా వేడెక్కిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News