Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్No night duties for women?: నైట్‌ డ్యూటీల తగ్గింపే సరైన పరిష్కారమా?

No night duties for women?: నైట్‌ డ్యూటీల తగ్గింపే సరైన పరిష్కారమా?

దేశంలో మహిళల మీద ఎప్పుడు ఎక్కడ అత్యాచారం జరిగినా, వారిని హతమార్చినా మహిళల భద్రత మీద కొద్ది రోజుల పాటు చర్చోపచర్చలు జరగడం, ప్రభుత్వాలు హడావిడి పడడం ఆనవాయితీ అయిపోయింది. గత 9వ తేదీన కోల్‌ కతాలోని ఆర్‌.జి. కార్‌ ఆస్పత్రిలో ఒక మహిళా వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగడం, ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయడం దేశ ప్రజల మనసులను కదల్చి వేసిందనడంలో సందేహం లేదు. అయితే, మహిళల భద్రతకు సంబంధించి ఎప్పటి మాదిరిగానే పోలీసులు, అధికారులు, పాలకుల్లో హడావిడి కనిపిస్తోంది తప్ప, దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి, మహిళలకు వీలైనంతగా నైట్‌ డ్యూటీలు తగ్గించడం వల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. అంతమాత్రాన ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలకు భద్రత లభిస్తుందా అన్నది ఇక్కడ ప్రశ్న. దీనివల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గకపోగా, అనేక కంపెనీలు వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది.
పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే త్రైపాక్షిక నివేదిక ప్రకారం, 2024 జూన్‌ నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య పురుషులతో పోలిస్తే 25.2 శాతం మాత్రమే ఉంది. ఆస్పత్రులు, కాల్‌ సెంటర్లు, కర్మాగా రాలు, హోటళ్లు, పత్రికా రంగం వంటి విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు నైట్‌ డ్యూటీలు ఉండకుండా పోవు. అయితే, వారికి తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాల మీద ఉంది. వారికి నైట్‌ డ్యూటీలు తగ్గించడం వల్ల వారు ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ‘రాత్తిరర్‌ సాథి’ కార్యక్రమంలో భాగం మహిళలకు వారి కార్యాలయాల్లో ప్రత్యేక టాయిలెట్లు, రెస్ట్‌ రూమ్‌ లు ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువ సంఖ్యలో సి.సి.టి.వి కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక మొబైల్‌ ఫోన్‌ యాప్‌ లను అందివ్వాలని కూడా భావిస్తోంది. నిజానికి, అనేక కార్యా లయాల్లో ఇవన్నీ ఇప్పటికే ఏర్పాటయి ఉన్నాయి.
కోల్‌ కతా ఆస్పత్రి కేసు విషయంలో సుప్రీంకోర్టు తనకు తానుగా దీనిపై విచారణ జరుపుతూ, మహిళా డాక్టర్లు, మహిళా ఉద్యోగుల భద్రత కోసం జాతీయ స్థాయిలో ఒక పటిష్ఠమైన కార్యాచరణ దళాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఏ రంగంలో చూసినా మహిళా ఉద్యోగుల భద్రత ఆందోళనకరంగానే ఉంటోంది. ఢిల్లీలో 2012లో నిర్భయ కేసు తర్వాత కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అనేక చర్యలు చేపట్టడంతో పాటు చట్టాలను కూడా కఠినం చేసింది. అయితే, వీటివల్ల పెద్దగా ఉపయోగం కలగడం లేదు. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డుల ప్రకారం, 2022లో మహిళలపై సుమారు 4.45 లక్షల నేరాలు జరిగాయి. అంటే, గంటకు 50కి పైగా ఎఫ్‌.ఐ.ఆర్‌ లు నమోద య్యాయన్న మాట. ప్రభుత్వాలు చేపట్టే ఎటువంటి చర్యలైనా కాగితాలకే పరిమితమవుతు న్నాయి తప్ప సరిగ్గా ఆచరణలోకి రావడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించడం జరిగింది. కాగా, 2012 నిర్భయ కేసుపై 2017లో సుప్రీంకోర్టు నలుగురికి ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పిన సందర్బంలో న్యాయమూర్తి ఆర్‌. భానుమతి దీనిపై మాట్లాడుతూ, కేవలం చట్టాల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని, ప్రజల్లో మహిళల భద్రత పట్ల అవగాహన, చైతన్యం కలిగించాల్సిన అవసరం కూడా ఉందని వ్యాఖ్యానించారు. కార్‌ ఆస్పత్రి సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను బట్టి ప్రభుత్వాలు ప్రజా స్పందనను అర్థం చేసుకోవాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News