Homeఎడిటోరియల్ / బహుళElection Promises : హామీలు కాదు.. అమలే గీటురాయి

Election Promises : హామీలు కాదు.. అమలే గీటురాయి

సంక్షేమం ఓట్లు తెచ్చి పెట్టొచ్చు. ఆకాంక్షలను నెరవేర్చ కపోతే అధికారాన్ని నిలబెట్టలేదు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం రాజ కీయ పార్టీలకు సహజమే కానీ ప్రజాస్వామ్యంలో హామీ అనేది కేవలం ఎన్నికల ప్రకటన కాదు.. ప్రజలతో చేసుకునే ఒక ఒప్పందం. ఆ మాటను ఎంతవరకు నిలబెట్టుకున్నా రన్నదే చివరకు ప్రభుత్వ పనితీరుకు కొలమానం. తెలంగాణలో 2023లో జరిగిన అధికార మార్పు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. 2014 లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజల్లో అపారమైన ఆకాంక్షలు ఉన్నాయి. కొత్త రాష్ట్రం తమ జీవితాలను మార్చుతుందన్న ఆశ కనిపించింది.

- Advertisement -

ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, సంక్షేమం, మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. వ్యవ సాయానికి ఉచిత విద్యుత్తు, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలు ప్రత్యక్షంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పనితీరుకు కనిపించే గుర్తులుగా నిలిచాయి.

ఈ పనితీరే 2018లో మరోసారి ప్రజల మద్దతును అందించడంలో కీలకమైంది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అంచనాలు మారాయి. కేవలం సంక్షేమం సరిపోదని, తమ పిల్లలకు మంచి విద్య, యువతకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు, భూమి లేని కుటుంబాలకు భూమి, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలని కోరుకున్నారు. అంటే ప్రజల అవసరాలు బతుకుదెరువు నుంచి భవిష్యత్తు వైపు మళ్లాయి. ఇక్కడే హామీల అమలు ప్రభుత్వానికి సవాలుగా మారింది.

దళితులకు మూడు ఎకరాల భూమి, పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలు ప్రజల్లో భారీ అంచనాలను కలిగించాయి. అయితే వాటిలో కొన్ని పరిమిత స్థాయిలోనే అమలయ్యాయి. మరికొన్ని ఆలస్య మయ్యాయి. కొన్ని పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ప్రత్యేకంగా యువతలో ఏర్పడిన అసంతృప్తి రాజకీయంగా కీలకమైంది. ఉద్యో గాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన వారికి నియామకాల ప్రక్రియలో జాప్యం, పరీక్షల వివాదాలు, నిరుద్యోగ భృతి అమలు కాక పోవడం వంటి అంశాలు నిరాశ కలిగించాయి.

తల్లిదండ్రులకు సంక్షేమం కొంత ఉపశ మనం ఇచ్చినా యువత మాత్రం ఉపాధి, అవకా శాలు, భవిష్యత్తు కోరుకుంది. ఇక్కడ ఒక ముఖ్య మైన రాజకీయ సత్యం ఉంది.. సంక్షేమం తక్షణ సంతృప్తిని ఇవ్వగలదు. కానీ ఆకాంక్షలకు పరి ష్కారం చూపకపోతే దీర్ఘకాలిక విశ్వాసం నిల వదు. అమలు కాని పాత హామీకి బదులు కొత్త హామీ ఇవ్వడం కూడా సమస్యకు పరిష్కారం కాదు.

ప్రజలు ఇప్పుడు పథకాల పేర్లను మాత్రమే చూడటం లేదు. ప్రకటన తర్వాత తమ జీవితాల్లో వచ్చిన మార్పును గమనిస్తున్నారు. ఇల్లు వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? పంటకు గిట్టుబాటు లభించిందా? పిల్లలకు నాణ్య మైన విద్య అందుతోందా? వైద్యం అందుబాటులో ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు.

2023లో జరిగిన అధికార మార్పును ఒక్క కారణంతో వివరించడం సరైంది కాదు. పదేళ్ల పాలనపై సహజంగా ఏర్పడిన వ్యతిరేకత, అమలు కాని లేదా ఆలస్యమైన హామీలు, యువత అసంతృప్తి, ప్రత్యామ్నాయానికి ప్రజలు ఇచ్చిన అవకాశం.. ఇవన్నీ కలిసి ఆ ఫలితాన్ని ప్రభావితం చేశాయి.

ఈ పాఠం తెలంగాణకే పరిమితం కాదు, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి వర్తిస్తుంది. ఎన్నికల హామీ ఎంత గొప్పద న్నది కాదు, దాని అమలు ఎంత నిజా యితీగా జరిగిందన్నదే ప్రజల తీర్పును నిర్ణయిస్తుంది. అందుకే భవిష్యత్తులో రాజ కీయ పార్టీలు హామీల సంఖ్యను తగ్గించి, అమలు సామర్థ్యాన్ని పెంచాలి. ప్రతి హామీకి నిధులు, కాలపరిమితి, బాధ్యత వహించే వ్యవస్థను ముందుగానే ప్రకటించాలి. సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, పారదర్శక పాలనకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలు ఇక ప్రకటనలను లెక్కించరు. ఫలితాలను లెక్కిస్తారు. హామీ ఓటును తెచ్చిపెట్టవచ్చు. కానీ అమలే నమ్మకాన్ని నిలబెడుతుంది.

కొలను వెంకటేశ్వర రెడ్డి
రిటైర్డ్‍ ఎస్.పి. (జైళ్లు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News