అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే యువతను, నిరు ద్యోగులను, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాలను లేదా వ్యవ స్థను ప్రశ్నించే వర్గాలను “బొద్దింకలు” వంటి జీవులతో పోల్చడం కేవలం ఒక పదప్రయోగం కాదు; అది ఒక ప్రమాదకరమైన సామాజిక-రాజకీయ భావజాలానికి సంకేతం. ఎందుకంటే చరిత్ర మనకు స్పష్టంగా నేర్పిన ఒక సత్యం ఉంది: ఒక సమాజం ముందుగా మనిషిని అగౌరవపరుస్తుంది, తర్వాత అతని హక్కులను తీసి పడేస్తుంది. ఒక మనిషిని మనిషిగా కాకుండా అసహ్యకరమైన జీవిగా చిత్రీకరించే భాష ఎప్పుడూ సమానత్వానికి దారి తీసింది కాదు; అది ఎల్లప్పుడూ అణచివేతకు, వివక్షకు, నియంత్రణత్వానికి మాత్రమే దారి తీసింది.
అందుకే గుర్రం జాషువా తన గబ్బిలం ద్వారా భారత సమా జంలోని కులాధారిత అమానవీయతను తీవ్రంగా ప్రశ్నించాడు. సమాజం అసహ్యంగా చూసే గబ్బిలానికైనా దేవాలయంలోకి ప్రవేశించే హక్కు ఉందిగానీ, ఒక మనిషికి మాత్రం లేదని ఆయన తన కవిత్వం ద్వారా చెప్పినప్పుడు, అది కేవలం సాహిత్య ప్రకటన కాదు అది మనిషిని మనిషిగా చూడని సంస్కృతిపై ఒక చారిత్రక తిరుగుబాటు. వేల ఏళ్లుగా ఈ దేశంలో అణగారిన వర్గాలను “తక్కువ మనుషులు”, “అస్పృశ్యులు”, “అర్హత లేనివారు”గా చిత్రీక రించే సంస్కృతి ఎలా పనిచేసిందో మన చరిత్ర చెబుతోంది. అదే భావజాలం ఆధునిక భాషలో, కొత్త రూపాల్లో మళ్లీ బయటపడటం ఆందోళనకరం. భాష అనేది కేవలం భావాలు తెలుపుకునే సాధనం మాత్రమే కాదు; అది సంస్కృతిని నిర్మించే శక్తి. ఒక మాట సమాజాన్ని నిర్మించగలదు; అదే మాట సమాజాన్ని విషపూరితం చేయగలదు. “బొద్దింక” వంటి పదాలు కేవలం అవమానపరిచే పదాలు కావు, అవి ఒక వర్గాన్ని “మనుషులుగా చూడకూడదు” అనే ప్రమాదక రమైన మానసికతకు బీజం వేస్తాయి. చరిత్రలో నియంతృత్వ పాల నలు కూడా ఇలాగే ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నించే వర్గాలను అపహాస్యం చేశారు. తర్వాత వారి గౌరవాన్ని ధ్వంసం చేశారు. చివరికి వారి స్వేచ్ఛను హరించారు. అందుకే ప్రజా స్వామ్యంలో అధికార స్థానాల్లో ఉన్న వ్యక్తుల భాష మరింత బాధ్యతాయుతంగా ఉండాలి.
ఒకవేళ ప్రశ్నించే యువతనే “బొద్దింకలు” అయితే, ఈ దేశంలో అవినీతి, అక్రమాలు, అవకాశాల దోపిడీ ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలను నాశనం చేసినవారు చీడపురుగులా? ఇంట్లో కోట్ల డబ్బు బ్లాక్ మనీ దాచుకొని బట్టబయలు అయిన వారిని ఏమనాలి? ఎందుకంటే ఈరోజు నిరుద్యోగం అనేది యువత వైఫ ల్యం కాదు; అది వ్యవస్థ వైఫల్యం. కొందరు అధికార యంత్రాంగా ల్లో, రాజకీయ వ్యవస్థల్లో, నియామక వ్యవస్థల్లో పెరిగిన అవినీతి, అక్రమ నియామకాలు, పరీక్షా లీకులు, అవకాశాల కేంద్రీకరణ వల్లే నిరుద్యోగం ఈ దేశంపై ఒక సామాజిక గాయం లాగా మారింది.
ఈ నిరుద్యోగ సంక్షోభం ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై ఒకేలా పడటం లేదు. ముఖ్యంగా దళితులు, బహుజను లు, వెనుకబడిన వర్గాల యువత ఎక్కువగా ఈ బాధను మోస్తు న్నారు. రాజకీయ సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది. ఓటు హక్కు అందరికీ ఉంది. కానీ సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. చదువుకున్నా అవకాశాలు అందకపోవడం, ప్రతిభ ఉన్నా వ్యవస్థలో చోటు దక్కకపోవడం, కులం, ఆర్థిక స్థితి కారణంగా వెనుకబడిపోవడం ఇప్పటికీ ఒక కఠినమైన వాస్తవం.
ఒక నిరుద్యోగ యువకుడి జీవితం కేవలం ఒక గణాంకం కాదు. అతని వెనుక ఒక కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశలు ఉంటాయి. అప్పులు ఉంటాయి. సంవత్సరాల కష్టపడి చది విన శ్రమ ఉంటుంది. కానీ చివరికి పరీక్షలు లీకవుతాయి, ఉద్యో గాలు అమ్ముడవుతాయి, అవకాశాలు కొందరి చేతుల్లో బందీలవు తాయి. అలాంటి పరిస్థితుల్లో యువత ప్రశ్నిస్తే, వారి గొంతును అసహ్యకరమైన జీవులతో పోల్చడం అంటే బాధితులనే నిందించడం అవుతుంది. ఇది ప్రజాస్వామ్య భాష కాదు; ఇది అధికార అహంకార భాష.
ప్రజాస్వామ్యం ప్రశ్నలతో బతుకుతుంది. నియంతృత్వం ప్రశ్నలను చంపి బతుకుతుంది. ప్రశ్నించే యువత దేశానికి ప్రమా దం కాదు; ప్రశ్నను అణచివేయాలనుకునే సంస్కృతే దేశానికి అసలు ప్రమాదం. ఎందుకంటే ఈ దేశంలో అంతో ఇంతో ప్రజా స్వామ్యం ఇంకా బతికి ఉందంటే, అది ప్రశ్నించే గొంతుల వల్లే. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం వల్లే. సమానత్వం కోసం నిలబడే యువత వల్లే.
ఈ దేశాన్ని నిర్మించేది అధికార కుర్చీలు కాదు. ప్రజల విశ్వాసం. ప్రజల గౌరవం. ఒక నిరుద్యోగ యువకుడి కన్నీరు, ఒక అణగారిన వర్గం ఆవేదన, ఒక ప్రశ్నించే గొంతు ఇవే ప్రజాస్వామ్యా నికి నిజమైన పునాదులు. ఆ గొంతును పురుగులతో పోల్చే సమాజం చివరికి తన మానవత్వాన్నే కోల్పోతుంది.
ఈ దేశంలో అంతో కొంతో ప్రజాస్వామ్యం బతికి ఉంది అంటే అది కేవలం ప్రశ్నించే గొంతు వల్లనే. ‘కొందరి’ అగ్రకుల భాషలో చెప్పాలంటే “బొద్దింకల” వల్లే !!!
–
ఫౌజాన్
న్యాయశాస్త్ర విద్యార్థి

