Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్OBCs must be part of development: ఆర్థిక న్యాయానికి ఆమడ దూరం

OBCs must be part of development: ఆర్థిక న్యాయానికి ఆమడ దూరం

వీరందరికీ సముచిత స్థానం కల్పిస్తేనే అభివృద్ధి పట్టాలెక్కి పరుగులు పెట్టేది

దేశంలో దళితులు, ఆదివాసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఓ.బి.సి) తదితర వర్గాలకు ఆర్థిక న్యాయం మాత్రం ఆమడ దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వాలు, పాలకుల నుంచి వారికి పథకాలు, కార్యక్రమాల పేరుతో తీపికుబుర్లు అందుతున్నాయి కానీ, చివరికి అవన్నీ శుష్కప్రియాలు, శూన్య హస్తాలుగానే మిగిలిపోతున్నాయి. ఇందుకు అనేక ఉదాహరణలు, నిదర్శనాలు కనిపిస్తున్నాయి. బీహార్ లో ఇటీవల చేపట్టిన కుల గణన సర్వే ప్రకారం, ఆ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాక దళితులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు అతి దుర్భరంగా ఉన్నాయి. వారు సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉండడమే కాకుండా, ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఈ వర్గాలకు ఎటువంటి సామాజిక భద్రతా లేకపోగా, మౌలిక సదుపాయాలు, కనీస సౌకర్యాలు కూడా వారికి అందుబాటులో లేవని అర్థమవుతోంది.
ఈ వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తాము చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల ఫలాలు ఆ వర్గాలకు చేరుతున్నాయా లేదా అన్న సంగతిని మాత్రం పట్టించుకోవడం లేదు. దళితులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఇంకా పేదరికం, సామాజికంగా వెనుకబాటుతనం, భూమి లేకపోవడం అనేవి చాలా ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వర్గాలకు ఆర్థిక న్యాయం కూడా కల్పించాలన్న విషయాన్ని పక్కనపెట్టి పాలక పక్షాలు కేవలం భావోద్వేగపరమైన అంశాల ద్వారా వీరిని అన్ని విధాలుగానూ దోచుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం, మభ్యపెట్టడం జరుగుతోంది.

- Advertisement -

నిజానికి, ఇదంతా ఒక్క బీహార్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించి వెనుకబడిన తరగతుల వారికి అధికారాన్ని అప్పగించిన బీజేపీ సైతం కింది స్థాయిలో దళితులను, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను చాలావరకు విస్మరించడం జరుగుతోంది. సామాజికంగా ఈ వర్గాల స్థాయిని, స్థితిగతులను పెంచడానికి, ఆర్థిక సాధికారికతను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దాదాపు ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ దుర్వినియోగం చేయడమో, దారిమళ్లించడమో జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ సర్వేల ప్రకారం కూడా తెలియవస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులు, ఆదివాసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను రాజకీయం, సామాజికంగా, ఆర్థికంగా అభ్యున్నతి పథంలో నడిపించడానికి విధానాల రూపకల్పన చేసినమాట నిజమే. ఆ విధానాల ప్రకారం, వారికి రాజకీయాల్లోనే కాక, ప్రభుత్వాల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉన్నత పదవులు కల్పించడం జరుగుతోంది. అదే సమయంలో ఈ వర్గాలకు స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో తగిన పాత్ర కల్పించాలనే విషయాన్ని మాత్రం విస్మరిస్తోంది.

నిజానికి గత తొమ్మిదేళ్లలో ఈ వర్గాలు చాలావరకు బీజేపీ వైపు మొగ్గడం ప్రారంభమైంది. తమ ఆర్థిక సంక్షేమానికి, తమ సామాజిక అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వాలు పాటుపడతాయనే నమ్మకం ఈ వర్గాలకు ఏర్పడింది. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీల జనాభా నలభై శాతం వరకూ ఉంటుంది. అయినప్పటికీ రాజకీయాల్లో వారి వాటా ఇప్పటికీ అత్యల్పంగానే ఉంటోంది. మంత్రి పదవులు, చట్టసభల్లో సభ్యత్వాలు, ప్రభుత్వాల్లో హోదాలు వగైరాల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువగానే ఉంటోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆస్తుల పంపకంలో ఆర్థిక వెనుకబడిన తరగతుల వారి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటోంది. ఈ వర్గాలకు విధాన నిర్ణయాల్లో భాగం లభించడం లేదు. చాలా చిన్న ఉద్యోగులకు అత్యధిక శాతం పరిమితం కావడం జరుగుతోంది. కేంద్రంలోనే కాక, రాష్ట్రాల్లో కూడా ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా ప్రభుత్వాలు గట్టి కృషి చేయడం చాలా అవసరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సరికొత్త విధానాలతో సామాజిక వర్గాలన్నిటికీ న్యాయం చేకూర్చే దిశగా పరుగులు పెడుతుండగా కేంద్ర ప్రభుత్వం ఇక ఈ వర్గాలను ఉపేక్షించడం వల్ల ఒక వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోవాల్సి వస్తుంది.

దేశ ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక విధానాల్లో ఈ దళిత, ఆదివాసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కూడా సముచిత భాగస్వామ్యం లభించినప్పుడే భారతదేశం పూర్తి స్థాయిలో అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలతో పోటీపడగల స్థాయికి చేరుకుంటుంది. పట్టణీకరణ, పారిశ్రామిక ఉత్పత్తి, టెక్నాలజీ సంబంధమైన అభివృద్ది వంటి కీలక అంశాలలో ఈ వర్గాల ప్రాతినిధ్యం బాగా పెరగాల్సిన అవసరం ఉంది. సామాజిక, ఆర్థిక న్యాయాలకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, సంస్కరణలు చేపడుతూనే దళిత, ఆదివాసీ తదితర వెనుకబడిన తరగతులకు పాలనలో సరైన భాగస్వామ్యం కల్పించడం ద్వారా మాత్రమే దేశంలో వేగంగా పురోగతి చెందగలుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News