Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Odissa politics: నవీన్‌ పట్నాయక్‌ ఎన్నికల వ్యూహం

Odissa politics: నవీన్‌ పట్నాయక్‌ ఎన్నికల వ్యూహం

రాజకీయాల విషయానికి వస్తే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఓ అపర చాణక్యుడనే చెప్పవచ్చు. తన సిద్ధాంతాలు, తన ఆశయాలు, తన పార్టీ సిద్ధాంతాలతో ఏమాత్రం రాజీపడకుండా అతి క్లిష్టమైన రాజకీయ సంబంధాలతో ఆయన వ్యవహరించే తీరు ఆయన ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. గత శనివారం నాడు ఆయన పార్టీ జర్సుగూడ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కొద్ది గంటలకేఆయన ఈ జాతీయ పార్టీ మీద బాణాలు ఎక్కుపెట్టారు. ఆ పార్టీ ‘డబుల్‌ ఇంజన్‌’ నినాదాన్ని ఆయన ఘాటుగా తూర్పారబట్టారు. “ఈ డబుల్‌ ఇంజన్‌ వ్యవహారంతో ఎవరికీ పనిలేదు. ప్రజలకు తమకు అనుకూలమైన పాలనే అన్నిటికన్నా ముఖ్యం’ ’ అని ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ విమర్శించారు. ఏ పార్టీనైనా విమర్శించడానికి ఆయన సరైన సమయాన్ని, సందర్భాన్ని ఎంచుకుంటారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే ఆయన బీజేపీ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.
కొద్ది రోజులక్రితమే ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో తాను చేరేది లేదని ఆయన అక్కడ ప్రకటించారు. ఆయన బీజేపీకి సన్నిహితం అవుతున్నారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. గత రెండు నెలల కాలంలో ఆయనను బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలుసుకున్నారు. ఈ రెండు సందర్భాలలోనూ ఆయన ఈ సమావేశాలు రాజకీయ సంబంధమైనవి కావని స్పష్టం చేశారు.నిజానికి ఆ నాయకులిద్దరూ 2024 ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరాటానికి నవీన్‌ను ఆహ్వానించడానికే వచ్చారు.నవీన్‌ వైఖరి విషయంలో వారు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనించాల్సిన విషయం.
దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరుగా ఈ బిజూ జనతా దళ్‌ నేత తన రాష్ట్రం మీద మాత్రమే దృష్టి పెడుతుంటారు. ఆయనకు మరో ధ్యాస ఉండదు. జాతీయ సమస్యల విషయానికి వచ్చే సరికి ఆయన బీజేపీని సమర్థిస్తుంటారు. రాష్ట్ర సమస్యల విషయంలో మాత్రం బీజేపీని తీవ్రాతితీవ్రంగా విమర్శిస్తుంటారు. అతి త్వరలో దేశంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తనకు రాష్ట్రమే ముఖ్యమన్న సందేశాన్ని గట్టిగా అందజేశారు. తనకు రాష్ట్రానికి సంబంధించినంత వరకూ తనకు బీజేపీ ప్రబల ప్రత్యర్థి అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో మంతివర్గ పునర్వ్యస్థీకరణ జరగాల్సి ఉంది. తమ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలకు, సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలకు ఆయన తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. ఆయన తన మంత్రులు, శాసనసభ్యుల పనితీరును మదింపు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలోని మొత్తం 30 జిలాలలో 23 జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి మండలులను ఏర్పాటు చేయడం కూడాజరిగింది.ఇవి రాష్ట్రంలో గిరిజన సంస్కృతిని కాపాడడానికి ఉద్దేశించినవి. గిరిజన ప్రాంతాలలోకి చొచ్చుకు వెళ్లడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టవేయడమే ఆయన ఉద్దేశం. ఆయన తన రాజకీయ వ్యూహంతో, చతురతతో ఎటువంటి కఠిన రంగంలోనైనా ఈదుకు రాగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News