దేశంలో లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలను నిర్వహించాలన్న బీజేపీ ప్రభుత్వ పట్టుదల ఎట్టకేలకు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు దాదాపు ఆమోద ముద్ర పడిపోయింది. ఈ జమిలి ఎన్నికల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇందుకు అను కూలంగా ఒక నివేదికను సమర్పించింది. పాలనా రంగంలోని లోక్ సభ, శాసనసభ, మున్సిపల్ ఎన్నికలను ఏక కాలంలో నిర్వ హించడం దేశానికి అన్ని విధాలా మేలు చేస్తుందని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నాయకత్వంలోని కమిటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను అందజేసింది. ఈ జమిలి ఎన్నికల విషయంలో ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉన్నందు వల్ల ఈ కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగానే నివేదికను సమర్పిస్తుందనే విషయం ముందుగా ఊహించిందే. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల ప్రకారం, రామ్ నాథ్ కోవింద్ కమిటీని నియమించింది ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కాదు. జమిలి ఎన్నికలను సమర్థించడానికి, విధి విధానాలను సూచించడానికి మాత్రమే ఈ కమిటీని నియమించడం జరిగింది. ప్రభుత్వ ఉద్దేశానికి ఆమోద ముద్ర వేయడంతో పాటు, దానికి ఒక గౌరవనీయతను ఆపాదించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో ఈ కమిటీని వేయడం జరిగిందని కూడా ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.
తనకు అప్పగించిన బాధ్యతలను ఈ కమిటి అతి తక్కువ కాలంలో నెరవేర్చింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏక కాలంలో, వంద రోజుల లోపల నిర్వహించాలని, ఇది సాధ్యమయ్యే విషయమేనని, ఇది ప్రజాస్వామ్యానికి గానీ, రాజ్యాంగానికి గానీ, సమాఖ్య స్ఫూర్తికి గానీ ఏమాత్రం విరుద్ధం కాదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఈ మూడంచెల వ్యవస్థల ఎన్నికలకు తగ్గట్టుగా ఓటర్ల కార్డులను, గుర్తింపు కార్డులను, ఓటర్ల జాబితాలను రూపొందించాల్సి ఉంటుందని అది సూచించింది. వివిధ రాజకీయ పక్షాల నుంచి, వివిధ వర్గాల నుంచి, ఆసక్తి చూపించిన వ్యక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించడం జరిగిందని, ఇందులో అత్యధిక శాతం మంది ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి అనుకూలంగానే అభిప్రాయం తెలిపారని అది పేర్కొంది.
ప్రస్తుత ఎన్నికల విధానానికి స్వస్తి చెప్పి, జమిలి ఎన్నికలు నిర్వహించడమే మంచి దంటూ ఈ కమిటీ చేస్తున్న వాదన అంత నమ్మశక్యంగా లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. “విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల వనరులు వృథా అవుతాయి. పాలనా యంత్రాంగం ఎక్కువ కాలం స్తంభించిపోతుంది. సామాజిక, ఆర్థికపరమైన ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఓటర్లకు విసుగుపుడుతుంది” అని ఈ కమిటీ పేర్కొంది. ప్రభుత్వం కూడా అనేక పర్యాయాలు ఇవే కారణాలను పేర్కొంటూ వచ్చింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం గానీ, ఈ కమిటీ గానీ లోతుగా అధ్యయనం చేసినట్టు కనిపించడం లేదు. దీనికి వ్యతిరేకంగా వ్యక్తమైన విమర్శలను అవి పరిగణనలోకి తీసుకోలేదు. ఇతరులతో సంప్రదింపుల సందర్భంగా తమ ముందుకు వచ్చిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అవి పరిశీలించ లేదు. ఎన్నికలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడానికి సంబంధించిన అంశాన్ని పరిశీలిం చాలంటూ ప్రతిపక్షాలు చేసిన సూచనలను కూడా పట్టించుకోలేదు.
ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏ.పి. షా ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండదు. ప్రజాప్రతినిధులకు ఒక నిర్ణీత పదవీ కాలాన్ని నిర్ధారించడం వల్ల వారి పనితీరును మదింపు చేయడానికి అవకాశం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. ఈ భయాలు, ఆందోళలకు, సందేహాలు, అనుమానాలకు అర్థం లేదని, ఇవన్నీ ఊహాజనితాలని ఈ కమిటీ కొట్టి పారేసింది. నిజానికి, ఈ ప్రశ్నలకు, ఆందోళనలకు, భయాలకు, సందేహాలకు ఈ కమిటీ ఎక్కడా సమాధానం ఇవ్వలేదు. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు విభిన్న అంశాలపై జరుగుతాయని, ఈ విభిన్న అంశాల ప్రస్తావనకు జమిలి ఎన్నికల్లో సమాధానాలు దొరకడం దుర్లభమవుతుందని ప్రతిపక్షాలు, విమర్శకులు భావించడం జరుగుతోంది. అంతే కాక, జమిలి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ పార్టీలకు ఉన్నన్ని అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు, ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఉండవని కూడా కొందరు విమర్శించడం జరుగుతోంది.
ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలతో పాటు, అనేక రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలు, విమర్శకులు వ్యక్తం చేస్తున్న భయాందోళన లేవీ అక్కడ కనిపించడం లేదని జమిలి ఎన్నికల మద్దతుదార్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘జాతీయ ఎన్నికలను, ప్రాంతీయ ఎన్నికలను విడివిడిగా చూడగల వివేకం, శక్తి సామర్థ్యాలు దేశంలోని ఓటర్లకు పుష్కలంగా ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇది రుజువయింది’ అని మద్దతుదార్లు వాదిస్తున్నారు. అయితే, ఈ అంశాన్ని అంత తేలి కగా కొట్టిపారేయడం సమంజసంగా లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. జమిలిగా ఎన్నికలు నిర్వహించడం రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని, వ్యతిరేకతలను, విమర్శలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన ప్రతిపాదనను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి.
One nation one election need of the hour?: ఏక కాలంలో ఎన్నికలు తప్పవా?
జమిలికి దేశం దాదాపు సిద్ధం