2024 ఎన్నికల సందర్భంగా బీజేపీ 14 ఏప్రిల్ 2024 విడుదల చేసిన మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు మరియు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. అందుకు కొనసాగింపుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సిఫార్సుల మేరకు “ఒక దేశం, ఒకే ఎన్నికలు” విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయ సాధన తర్వాత దశలవారీగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు మరియు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు “ఇంప్లిమెంటేషన్ గ్రూప్”ను ఏర్పాటు చేస్తామని, రాబోయే కొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా పలు అంశాలపై సమగ్ర చర్చలు జరుపుతామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. ఏకకాల ఎన్నికల ప్రక్రియను రెండు దశల్లో అమలు చేస్తామని, మొదటి దశలో, లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను సమం చేసి, తదుపరి 100 రోజుల్లో, రెండవ దశలో భాగంగా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపడతామని తెలిపారు.
ఎప్పుడు బీజం పడింది?
“ఒక దేశం, ఒకే ఎన్నికలు” అనే ఆలోచన మొదట 1980లలో ప్రతిపాదించబడింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని “లా కమిషన్” మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభ మరియు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే పరిస్థితికి మనం తిరిగి వెళ్లాలి అని పేర్కొంది. గతంలో భారతదేశంలో 1951 మరియు 1967 మధ్య ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. 1967లో గరిష్ట స్థాయిలో పార్లమెంటు దిగువ సభకు జాతీయ ఎన్నికలతో పాటు 20 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. 1977లో ఈ సంఖ్య 17 కాగా, 1980 మరియు 1985లో 14 రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలతో సహా వివిధ రాష్ట్ర శాసనసభలను ముందస్తుగా రద్దు చేయడం వల్ల ఆయా రాష్ట్రాల శాసనసభల కాల చక్రం అస్తవ్యస్తమైంది. అలాగే లోక్‌సభ కూడా 1970 ప్రారంభంలోనే రద్దు చేయబడింది.
“ఒక దేశం, ఒకే ఎన్నికలు” విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుపరచేందుకు కొన్ని చట్ట సభల ఎన్నికలను నిర్ణీత కాల పరిమితి కంటే ముందే నిర్వహించడం, మరి కొన్నింటిని ఆలస్యం చేయడంతో సహా చాలా సర్దుబాట్లు అవసరమవుతాయి. ఈ ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరగగా, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా, మహారాష్ట్ర మరియు జార్ఖండ్‌లలో కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు 2025లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, బీహార్ కూడా ఉన్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో శాసనసభల పదవీకాలం 2026లో ముగుస్తుండగా, గోవా, గుజరాత్, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీకాలం 2027లో ముగియనున్నది. హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల గడువు 2028లో ముగుస్తుంది. ప్రస్తుత లోక్‌సభతో పాటు ఈ ఏడాది ఎన్నికలు జరిగిన రాష్ట్రాల శాసనసభల గడువు 2029లో ముగుస్తుంది.
రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు:
దేశవ్యాప్తంగా లోక్ సభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఏకకాల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం కోసం 2 సెప్టెంబర్ 2023న భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 191 రోజుల పాటు పౌర సమాజం, నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపి సాధ్యాసాధ్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం 18,626 పేజీలతో కూడిన నివేదికను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. కమిటీ సిఫారసు చేసిన 18 రాజ్యాంగ సవరణలలో చాలా వరకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేనప్పటికీ కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83 మరియు ఆర్టికల్ 172లో సవరణలు చేయవలసిందిగా కమిటీ సిఫార్సు చేసింది. ఏకకాల ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా లేవని నిర్ధారించడానికి, కోవింద్ కమిటీ లోక్‌సభ కాలపరిమితిని నియంత్రించే ఆర్టికల్ 83 మరియు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలానికి సంబంధించిన ఆర్టికల్ 172 కు సవరణలను ప్రతిపాదించింది. అన్ని ఎన్నికలను సమకాలీకరించడానికి కమిటీ ఒక-పర్యాయ తాత్కాలిక చర్యను సూచించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభను ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్రపతి మొదటి సమావేశం జరిగిన తేదీనే నోటిఫికేషన్ ద్వారా నూతన నిబంధనలను అమలులోకి తీసుకువస్తారు. ఈ తేదీని అపాయింటెడ్ డేట్ అంటారు. ఒక రాష్ట్ర శాసనసభ ఐదేళ్ల పదవీకాలం పూర్తి అయ్యిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతిపాదిత ఆర్టికల్ 82A కింద ఒక క్లాజు ప్రకారం, “నియమించిన తేదీ” తర్వాత జరిగే ఏదైనా సాధారణ ఎన్నికలలో ఏర్పడిన అన్ని రాష్ట్ర శాసనసభల గడువు లోక్ సభ పూర్తి కాలంతో పాటు ముగుస్తాయి. ఈ అంశంపై సవివరమైన చర్చలు జరిపిన కోవింద్ కమిటీ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), తృణమూల్ కాంగ్రెస్, ఎఐఎంఐఎం మరియు సమాజ్ వాదీ పార్టీలతో ఈ అంశంపై నలభై ఏడు రాజకీయ పార్టీలతో చర్చలు జరుపగా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 32 పార్టీలు మరియు వ్యతిరేకంగా 15 పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసాయి.
బిల్లు ఆమోదం పొందుతుందా?
“ఒకే దేశం, ఒకే ఎన్నికల” బిల్లు ఆమోదం పొందడం అనేది రెండు రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు వివిధ రాజకీయ పార్టీల నుండి విస్తృత మద్దతు అవసరం అవుతుంది. 18వ లోక్‌సభలో బిజెపికి సొంతంగా మెజారిటీ లేనందున, అది తన ఎన్‌డిఎ మిత్రపక్షాల మద్దతుతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా కూడగట్టుకోవలసి ఉంటుంది. కీలకమైన ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన జనతాదళ్ (యునైటెడ్) ఈ ప్రతిపాదనను సమర్థిస్తూ ఈ విధానం దేశంలో తరచుగా ఎన్నికలు జరగకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గిస్తుంది అంటూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని స్వాగతించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ మాట్లాడుతూ “ఒక దేశం, ఒకే ఎన్నికలు” దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉండడంతో పాటు దేశానికి సమగ్ర ప్రయోజనాలను తెస్తుంది అని అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికలు ఆచరణాత్మకం కాదని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు అధికార భారతీయ జనతా పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ప్రతిపాదనకు అవసరమైన ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు సవరణ బిల్లులను ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా సభ్యులుగా ఉండే స్టాండింగ్ కమిటీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వంటి పార్లమెంటరీ కమిటీకి పంపడం ద్వారా అర్థవంతమైన చర్చలు జరిపి ఏకాభిప్రాయానికి దారితీస్తాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ఈ ప్రతిపాదన అమలుకు కేంద్రం కూడా రాష్ట్రాలను భాగస్వామ్యం చేయవలసి ఉంటుంది. స్థానిక సంస్థలు ఏకకాల ఎన్నికల ప్రణాళికలో భాగం కావాలంటే, కనీసం సగం రాష్ట్రాలు అవసరమైన రాజ్యాంగ సవరణను ఆమోదించాలి. ప్రస్తుతం బీజేపీ డజనుకు పైగా రాష్ట్రాలను పరిపాలిస్తున్నప్పటికీ, రాబోయే హర్యానా, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ సమతుల్యతను మార్చవచ్చు.
పార్టీల భిన్నాభిప్రాయాలు:
ప్రజాస్వామ్యంలో “ఒక దేశం, ఒకే ఎన్నికలు” విధానం ఎంత మాత్రం అనుసరణీయం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లడంతో పాటు మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాలి తప్ప ఇలాంటి సర్దుబాట్లు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ బిల్లు ప్రతిపాదించినప్పుడు, సభలోనే ఓడిపోతుందని పార్టీ అధికార ప్రతినిధి మాణికం ఠాగూర్ అన్నారు. వారి మిత్రపక్షం, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) యొక్క అరవింద్ సావంత్, ప్రభుత్వం దేశం యొక్క ప్రాధాన్యతలను గుర్తించలేదని ఆరోపిస్తూ తన పార్టీ ఈ ప్రతిపాదన లోని లోపాలను ప్రజాక్షేత్రంలో ఎందగడుతుందని చెప్పాడు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తూ దీని అమలు విషయంలో ప్రభుత్వం గందరగోళంలో కొట్టుమిట్టాడుతోందని ఈ చర్య దేశానికి ఎలా సహాయపడుతుందో స్పష్టం చేయాలని సవాలు విసిరింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ, “ఒక దేశం, ఒక ఎన్నికలు” ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ చేస్తున్న మరొక చౌకబారు స్టంట్ మాత్రమే అని దుయ్యబట్టాడు. “ఒక దేశం, ఒక ఎన్నికలు” ఫెడరలిజాన్ని నాశనం చేయడంతో పాటు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని రాజీ పడేలా చేస్తుంది కనుక తాను ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా తన అసమ్మతిని వెళ్లగక్కారు. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం 28 రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో దేశంలో భారీ ఏర్పాట్లు అవసరమయ్యే పోలింగ్ ప్రక్రియ యొక్క లాజిస్టిక్‌లను సులభతరం చేయడం, ఎన్నికల వ్యయాన్ని తగ్గించడంతోపాటు ఈ విధానం దేశ ఖజానాకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నొక్కి చెప్పింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వైఖరిని “దేశ వ్యతిరేకి” అని బీజేపీ అభివర్ణించింది. జనతాదళ్ (యునైటెడ్) తమ నాయకుడు నితీష్ కుమార్ ఈ ప్రతిపాదనకు ఎప్పుడూ అనుకూలంగానే ఉన్నారని తెలిపింది.
అనుకూలతలు మరియు ప్రతికూలతలు:
సాధారణంగా ఎన్నికల నిర్వహణకు భారీ మొత్తంలో ఆర్థిక, మానవ వనరులు అవసరం అవుతాయి. ఏక కాలంలో లోక్ సభ, శాసనసభ మరియు స్థానిక సంస్థలకు ఎన్నికలను నివహించడం ద్వారా ఎన్నికల నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సార్లు ఎన్నికల విధుల్లో నిమగ్నమైన పరిపాలనా సిబ్బంది మరియు భద్రతా దళాలపై భారం తగ్గుతుంది. మాటి మాటికీ ఎన్నికల నిర్వహణ కోసం సమయాన్ని వెచ్చించే అంతేకాదు ప్రభుత్వ అధికార యంత్రాంగం పాలనాంశాలపై ఎక్కువ దృష్టి సారించవచ్చు. మాటి మాటికీ ఓటు వేసేకంటే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఓటర్లు మొగ్గు చూపుతారని అందువలన ఓటింగ్ శాతం పెరుగుతుందని లా కమిషన్ అభిప్రాయపడింది. ఒక దేశం, ఒకే ఎన్నికలను అమలు చేయడానికి, రాజ్యాంగం మరియు ఇతర చట్టపరమైన వ్యవస్థలలో కూడా మార్పులు అవసరం. ఒక దేశం – ఒకే ఎన్నికలకు రాజ్యాంగ సవరణ అవసరం మరియు దానిని రాష్ట్ర శాసనసభలలో ఆమోదం పొందడం లాంటివి ప్రతికూలాంశాలు.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్
✆ 8885050822