కాశ్మీరం.. భారతదేశానికి శిరస్సు లాంటిది. అలాంటిచోట పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడి, 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలు బలిగొన్నారు. అందులోనూ ముస్లింలు కానివారు ఎవరని తెలుసుకుని మరీ చంపేశారు. ఈ దారుణ ఘటనపై దేశమంతా రగిలిపోయింది. ఎప్పుడెప్పుడు దాయాది దేశానికి తగిన బుద్ధి చెబుతారా అంటూ ఎదురుచూసింది. ఆ క్షణం రానే వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన దాడుల్లో.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికదళాలు అర్ధరాత్రి విరుచుకుపడ్డాయి. అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించాయి. అయితే… వీటన్నింటి వెనుక చాలా పటిష్ఠమైన వ్యూహాలు ఉన్నాయి. ముందు అంతర్జాతీయంగా తగిన మద్దతు కూడగట్టుకోవాలి. మనకు జరిగిన నష్టం ఏంటన్నది అందరికీ తెలియజేయాలి. మనం చేసేది కూడా దాడిలా కాకుండా.. మనపై జరిగిన దాడికి సమాధానంగా మాత్రమే కనపడాలి. అంతర్జాతీయ దౌత్య యవనికపై మన దేశం ఎప్పటికీ సమున్నతంగానే నిలవాలి. ఈ లక్ష్యాలన్నింటినీ ఒక్క అడుగుతోనే సాధించిన ఘనత… ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీకే దక్కుతుంది!! కేవలం పాకిస్థాన్‌లోని జీహాదీ ఉగ్రవాద స్థావరాల లక్ష్యాలను ఛేదించడమే కాదు.. 145 కోట్ల మంది భారతీయుల ఆగ్రహావేశాలకు కూడా సమాధానం ఈ ఒక్క దాడితోనే చెప్పారు.
అంతర్జాతీయ మద్దతు
నిజానికి భారత్ ఏదో చేయబోతోందని పాకిస్థాన్ మూడు నాలుగు రోజుల నుంచే గగ్గోలు పెడుతోంది. భారత్ గనక దాడి మొదలుపెడితే తాను ఇంగ్లండ్ పారిపోతానని పాక్ ఎంపీ ఒకరు ముందే చెప్పారు. నిజంగా భారత్ యుద్ధమే మొదలుపెడితే, పాక్ దగ్గర ఉన్న ఆయుధ సామగ్రి, శతఘ్ని గుండ్లు అన్నీ నాలుగు రోజుల్లోనే నిండుకుంటాయి. ఆ విషయం వాళ్లకు తెలిసే, ముందుగా మనమీద బురద చల్లడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. అందుకే వారికి గట్టిగా చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇవ్వడానికి ప్రధాని మోదీ తగిన వ్యూహాలు రచించారు. ముందుగా అంతర్జాతీయ నాయకుల మద్దతు కూడగట్టుకున్నారు. పలు దేశాలు ఇప్పటికే భారతదేశానికి తమ మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా రష్యా అయితే.. భారత్ ఏం చేసినా తాము వెంట ఉంటామని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం.. భారత్ ఈ తరహా దాడులు చేస్తుందని ఊహించామని, అది సబబేనని వ్యాఖ్యానించారు. ఈ తరహా అంతర్జాతీయ మద్దతు ముందుగా కూడగట్టడం ఈ తరహా దాడులకు చాలా ముఖ్యం. లేకపోతే నింద మన మీద పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగానే అందరికీ మన మీద జరిగిన దాడి గురించి క్షుణ్ణంగా తెలిసేలా చేశారు.
భారీ కసరత్తు
పహల్‌గావ్ దాడి జరగడానికి, ఆపరేషన్ సిందూర్‌కు మధ్య ఉన్న ఈ 15 రోజుల్లో మోదీ పెద్ద కసరత్తే చేశారు. ముందుగా త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. మనకున్న అవకాశాలు, ఎదురయ్యే సమస్యలు అన్నింటిపై కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో రెండు రోజులు భేటీ అయ్యారు. ఈ మధ్యలోనే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరయ్యారు. బీహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్.. ఇలా పలు రాష్ట్రాలు తిరుగుతూ తామేదో యుద్ధసన్నాహాలు చేస్తున్నామన్న ఆలోచన కూడా శత్రుదేశానికి రానీయకుండా చేశారు. శత్రువు ఊహించని సమయంలో, ఊహించని విధంగా దెబ్బకొట్టడం చాలా అవసరం. సరిగ్గా అదే పని చేశారు ప్రధాని మోదీ.
సిందూర్ పేరు ఎందుకు పెట్టినట్లు?
ఏప్రిల్ 22న పహల్‌గావ్‌లో ఉగ్రవాదులు దాడిచేసి, 26 మంది అమాయక భారతీయులను చంపేశారు. ఆ సమయంలో కేవలం పురుషులనే చంపుతూ… మోదీకి ఈ విషయం చెప్పాలని వారి భార్యలతో అంటూ ఎద్దేవా చేసినట్లు మాట్లాడారు. అలా హిందువుల్లో మగవారిని చంపడం ద్వారా.. వారి భార్యల నుదుట ఉన్న సిందూరాన్ని చెరిపేశారు. అందుకే ఈ ఆపరేషన్‌కు స్వయంగా ప్రధాని మోదీయే పేరు పెట్టారు. అదే.. ఆపరేషన్ సిందూర్. హిందూ మహిళల మర్యాదకు చిహ్నమైన ఈ సిందూరాన్ని చెరిపేసినందుకు తగిన సమాధానం చెప్పి తీరాలని త్రివిధ దళాధిపతులకు చెబుతూ.. మహిళలకు ఒక అన్నగా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ పేరు పెట్టి జాతి మొత్తానికి ఒక విధమైన సందేశం పంపారు. అలాగే, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన లోగోను డిజైన్ చేయించేటప్పుడు కూడా ఆపరేషన్ సిందూర్‌లో వచ్చే అక్షరాల్లో ఒక ఓ దగ్గర అచ్చం కుంకుమబొట్టు చల్లినట్లుగా డిజైన్ చేయించారు. ఆపరేషన్ జరిగిన వెంటనే భారత సైన్యం చేసిన ట్వీట్‌లోనే ఈ ఆపరేషన్ సిందూర్ లోగోను కూడా విడుదల చేశారు. న్యాయం చేయడమే కాదు… చేసినట్లు కనిపించాలి కూడా. అందుకే ఈ ఆపరేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో చేసి, ఆపరేషన్ సిందూర్ అనే పేరును అప్పుడు బయటకు వెల్లడించారు. భారతీయ మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన సమయం రాగానే అందుకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసినట్లయింది. అసలు భారతదేశం అంటేనే భరతమాత అంటాం. అందుకే.. ఈ ఆపరేషన్ వివరాలను కూడా ఇద్దరు మహిళా అధికారులు, అందులోనూ ఒకరు ముస్లిం మహిళతో చెప్పించారు. వింగ్ కమాండర్ వ్యోమికా బక్షి, కర్నల్ సోఫియా ఖురేషి ఈ వివరాలు వెల్లడించారు.
పాకిస్థాన్ తప్పుడు ప్రచారం షురూ
ఎప్పటిలాగే, ఎదురుదెబ్బ తిన్నప్పుడల్లా పాకిస్థాన్ తన తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. ముందుగా భారతదేశానికి చెందిన ఐదు యుద్ధవిమానాలను తాము కూల్చేశామని చెబుతూ, అందుకు ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తీరా ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా దాన్ని పరిశీలిస్తే, పంజాబ్‌లో దాదాపు రెండు మూడేళ్ల క్రితం విన్యాసాలు చేస్తుండగా ఒక మిగ్ 21 విమానం కూలిపోయింది. ఆ వీడియోనే పాకిస్థాన్ ఇప్పుడు తాము కూల్చేశామంటూ చెబుతోందని తేలిపోయింది. పాకిస్థాన్ ఆర్మీలోని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరి ఈ దాడి గురించి స్పందిస్తూ.. భారత సైనికులు పిరికిపందల్లా దొంగదెబ్బ తీశారని, ఈ దాడిలో అమాయకులైన పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా మరణించారని, అందువల్ల దీనికి తాము తమ ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చినచోట, ఇష్టం వచ్చినట్లు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. అసలు భారతదేశం అత్యంత కచ్చితత్వంతో, కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రెసిషన్ ఎటాక్స్ చేసింది. అందులో అసలు సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశమే లేదు. అయినా.. తమ వాళ్లకు ఏదో అయిపోయిందంటూ అంతర్జాతీయంగా సానుభూతి పొందాలన్న ఉద్దేశంతో పాక్ ఇలా చెబుతోంది. అయితే, ప్రధాని మోదీ ముందుగానే రంగం సిద్ధం చేసుకుని, కేవలం ఒక్క అడుగు మాత్రమే ముందుకు వేయడం ద్వారా తన వ్యూహం ఎంత పటిష్ఠమైనదో ప్రపంచం మొత్తానికి చాటిచెప్పారు. వారం మధ్యలో ఒకరోజు.. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో పట్టపగలు సమయంలో ఈ దాడి చేయడం ద్వారా, తమ లక్ష్యాలు పరిమితమని.. వాటిని ఛేదించామని సందేశం ఇచ్చారు. అందుకే ట్రంప్ నుంచి అలాంటి స్పందన వచ్చింది. పహల్‌గావ్ ఉగ్రదాడికి భారత్ స్పందిస్తుందని తాను ఊహించానని, ఈ దాడి ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని మాత్రమే ట్రంప్ అన్నారు తప్ప.. మనమేదో ఒంటికాలిమీద పాకిస్థాన్‌పై యుద్ధానికి తెగబడ్డామన్నట్లు చెప్పలేదు.
కొసమెరుపు: ఆపరేషన్ సిందూర్ ముగిసిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంటివాళ్లు మాట్లాడారే తప్ప, ప్రధాని మోదీ మాత్రం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీవీ లైవ్ కార్యక్రమంలో ఆయన కనిపించారు గానీ, అప్పుడు ఆయన కేవలం స్పేస్ టెక్నాలజీ గురించి మాత్రమే చెప్పుకొచ్చారు. ఆ ఆపరేషన్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ ఒక రకంగా మోదీయే అయినా ఇప్పుడు మాత్రం దాని గురించి మౌనం పాటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఇది సర్వసాధారణంగా చేసే పనే తప్ప.. ఏదో అసాధారణ చర్య కాదని, అందువల్ల తన రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం లేదన్నట్లుగా ఆయన ఓ సందేశమిచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే.. మోదీ రెండు విషయాలు చెప్పాలనుకున్నారు. తన ఆలోచనల్లో ఉన్న చాలా విషయాల్లో పాకిస్థాన్ విషయం ఒక్కటి మాత్రమేనని, అలాగే మొత్తం పరిస్థితి తన నియంత్రణలోనే ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ఒక ఫొటో సర్క్యులేట్ అవుతోంది. పహల్‌గావ్ ఉగ్రవాది ఒక హిందూ పురుషుడిని చంపి, వెళ్లి మోదీకి చెప్పు అని అతడి భార్యతో అంటాడు. రెండో ఫొటోలో ఆ మహిళ నేను మోదీకి చెప్పాను అని ధైర్యంగా నిలబడి అంటుంది. అప్పుడా ఉగ్రవాది బిక్కచచ్చిపోయి ఉంటాడు. రెండోఫొటోలో నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ లోగో కనిపిస్తుంది. దటీజ్ మోదీ!