విభిన్న సిద్ధాంతాల పార్టీలు కలవడం, చేతులు కలపడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఈ విషయంలో ఇప్పటికే ప్రజల్లో మొదటి నుంచి సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. మొత్తం మీదా తాజా రాజకీయ పరిస్థితులను బట్టి, ప్రతిపక్ష ఇండియా కూటమి చిన్నాభిన్నం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇరవై ఎనిమిది పార్టీలతో ఈ కూటమి ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇది ఏ విషయంలోనూ ‘ఉమ్మడి’ భాగ్యానికి నోచుకోలేదు. మొదటి నుంచి ఎవరికి వారే యమునా తీరే అనే చందంగానే కొనసాగుతూ వచ్చింది. కూటమికి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం అటుంచి, ఒక చైర్మన్ ను, ఒక కన్వీనర్ ను నియమించడం, ఉమ్మడి ఎజెండాను రూపొందించుకోవడం, సీట్ల పంపకం చేపట్టడం వంటి కీలక అంశాలన్నీ ఇంతవరకూ ఒక రూపాన్ని సంతరించుకోలేదు. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతున్నాయనగా ఈ కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తాము లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఈ కూటమి కుప్పకూలినట్టయింది. సీట్ల పంపకానికి సంబంధించి తాను చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించడంతో తాము ఇక ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆమె ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఒకటి రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ లో ప్రవేశిస్తుందనగా మమతా బెనర్జీ ఇటువంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ లేకుండా, మమతా బెనర్జీ సలహాలు, సూచనలు లేకుండా ఇండియా కూటమి బతికి బట్టకట్టే అవకాశం లేదని కాంగ్రెస్ దీనిపై తన స్పందించింది. ఈ కూటమికి తృణమూల్ కాంగ్రెస్ ఒక ముఖ్యమైన స్తంభం అనడంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్ లో మిగిలిన పార్టీలన్నీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తాయని ప్రకటించి కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఈ వివాదాన్ని మసపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీ మాత్రం ఈ విషయంలో భీష్మించుకు కూర్చున్నారు. సీట్ల పంపకం విషయంలో ఇకపై ఎవరితోనూ చర్చలు జరిపే అవకాశం లేదని, ఎన్నికలలో విజయాలు సాధించడాన్ని బట్టి కూటమి విషయం ఆలోచించవచ్చని ఆమె పేర్కొన్నారు. నిజానికి, ఈ కూటమిలోని ప్రధాన ప్రతిపక్షాల తీరుతెన్నులు గమనించినవారికి ఎన్నికల తర్వాత కూడా ఈ పార్టీల మధ్య సయోధ్యకు అవకాశాలు కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించినంత వరకూ తమకు, కాంగ్రెస్ పార్టీకి, వామపక్షాలకు భవిష్యత్తులో కూడా సంబంధబాంధవ్యాలు ఉండే అవకాశం లేదని మమత తేల్చి చెప్పారు. ఎవరి రాష్ట్రాల్లో వారు బీజేపీతో తలపడడమే మంచిదని, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 300 స్థానాల్లో పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తాము ఇక మీదట ఈ కూటమి సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు. కూటమిలోని మరికొన్ని మమతా బెనర్జీ అనుకూల పార్టీలు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి.
మొదటి నుంచి చిటపటలు రాహుల్ గాంధీ చేపడుతున్న పాదయాత్ర విషయంలో కూడా మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పాదయాత్ర గురించి తమకు ముందుకు తెలియజేయాలన్న ఇంగితం కూడా ఆ పార్టీకి లేదని ఆమె వ్యాఖ్యానించారు. చివరికి తమ రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు కూడా ఆ పార్టీ నాయకులు తమకు సమాచారం అందించలేదని ఆమె అన్నారు. ఇది ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ నాయకత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అసలు ఈ కూటమికి మొదటి నుంచి సైద్ధాంతిక సారూప్యత లేదని, సిద్ధాంతాలు, విలువలు లేని పార్టీలన్నీ ఒక తాటి మీదకు వచ్చే ప్రయత్నం చేస్తే చివరికి ఇటువంటి ఫలితాలే వస్తాయని స్థానిక బీజేపీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. బీజేపీని ఓడించడం, మోదీని గద్దె దించడం తప్ప ఈ కూటమికి మరో సిద్ధాంతం గానీ, మరో ఎజెండా గానీ లేదని, ఇటువంటి కూటమి చేతిలో దేశం సర్వనాశనం అయిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ వ్యాఖ్యానించారు.
నిజానికి, ఇటీవలి శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ప్రాధాన్యాన్ని చాలావరకు కోల్పోయింది. కాంగ్రెస్ విజయాలు సాధించి ఉంటే మమతా బెనర్జీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఉండేవారు కాదు. ఇటీవలి నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలను నిరాశా నిస్పృహలకు గురిచేసి ఉండవచ్చు. నరేంద్ర మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలోని మూడు రాష్ట్రాలలోనూ విజయకేతనం ఎగరేయడం ప్రతిపక్షాలకు అశనిపాతంగా పరిణమించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఏమంత పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ లేకపోవడం కూడా ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశపడ్డ చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలు కావడం మాత్రం కాంగ్రెస్ పార్టీకే కాక, ఇతర ప్రతిపక్షాలకు కూడా మింగుడు పడడం లేదు. నిజానికి ఈ మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ చాలా కాలంగా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. ఈ హిందీ భాషా రాష్ట్రాలలో జనాభా ఎక్కువ. సీట్ల సంఖ్య కూడా ఎక్కువే. ఈ రాష్ట్రాలు బీజేపీకే కాకుండా అన్ని పార్టీలకూ కీలకమైనవి. ఇక్కడ విజయం సాధించడమన్నది లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రధానం. ఈ రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయాలు సాధించడమంటే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ గెలవడం ఖాయం అని అర్థం.
ఎవరి ఈగోలు వారివి ఇది జరగాలన్న పక్షంలో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో ఒకే తాటి మీద నడవాల్సి ఉంటుంది. అనేక అంశాల మీద తాము మోదీ విధానాల కంటే విభిన్న విధానాలను అనుసరించగలమనే విషయాన్ని ఓటర్ల మనసుల్లోకి తీసుకు వెళ్లగలగాలి. ముఖ్యంగా తటస్థ ఓటర్ల మనసులను మార్చగలగాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా మోదీ వెనుక వరుస కట్టిన ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఎక్కువగా మోదీ గ్యారంటీలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలను ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు తమ అంతఃకలహాల కంటే ఎన్నికల్లో విజయం సాధించడాన్నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. అయితే, అటువంటి సూచనలు ఎక్కువగా కనిపించడం లేదు. ఇక ముందు ఈ కూటమి ఒక్కటిగా పనిచేసే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాల కంటే బీజేపీ ఒక అడుగు ముందున్న విషయాన్ని విస్మరించకూడదు. బీజేపీ తాను బలోపేతం అవుతూనే ప్రతిపక్షాలను బలహీనపరచడం జరుగుతోంది. ప్రతిపక్షాల బలహీనతలను సాధ్యమైనంతగా సద్వినియోగం చేసుకుంటోంది. మూడు ప్రధాన హిందీ రాష్ట్రాలలో అది ఘన విజయాలు సాధించడానికి అదే చాలావరకు కారణం అయింది. ఇటువంటి కీలక సమయంలో ప్రతిపక్ష కూటమి కోటకు బీటలు పడడం ఆందోళన కలిగిస్తోంది.
నిజానికి ఇటువంటి సమయంలో ప్రతిపక్ష కూటమిలో ఐక్యత దెబ్బతినడం వల్ల ప్రతిపక్ష కూటముల మీద ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా నమ్మకం కలిగే అవకాశం ఉండదు. జనతా పార్టీ కాలం నుంచి ఇటువంటి కూటములను గమనిస్తున్న ప్రజానీకానికి వీటి గురించి ఒక అవగాహన ఏర్పడింది. తాజాగా ఇండియా కూటమి మీద నమ్మకం పెరుగుతున్న దశలో ఈ కూటమి చిన్నాభిన్నం అవుతుండడం దేశ రాజకీయాలను ఎటువంటి మలుపు తిప్పుతుందో తెలియదు కానీ, లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ కూటమి పరాజయం పాలయినట్టు కనిపిస్తోంది. ఇక జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మధ్యే పోటీ ఉన్నట్టు
కనిపిస్తోంది.
– వి. సుదర్శనరావు, విశ్లేషకుడు