Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Opposition leaders: ప్రతిపక్ష నాయకులు కదలరు, మెదలరు

Opposition leaders: ప్రతిపక్ష నాయకులు కదలరు, మెదలరు

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్ష నాయకులలో ఎక్కడా కదలిక కనిపించడం లేదు. ఐక్యత విషయంలో ఏమాత్రం చొరవ చూపించని ప్రతిపక్షాలు బీజేపీకి అప్పనంగా అధికారాన్ని అప్పగించే విషయంలో మాత్రం ఒక్క తాటి మీద నడుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించినప్పుడు మాత్రం ప్రతిపక్షాలలో కొద్దిగా కదలిక వ్యక్తమయింది. ఆ తర్వాత ఆ కొద్ది ప్రయత్నం కూడా ఆవిరైపోయింది. మళ్లీ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సమాన భాగస్వామ్యానికి సంబంధించి, కాంగ్రెస్‌కు, ప్రాంతీయ పార్టీలకు  మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమయ్యేలా  కనిపించడం లేదు. అసమాన భాగస్వామ్యం కారణంగా ఐక్యతా ప్రయత్నాలు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.

- Advertisement -

   యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యు.పి.ఏ)లో లేని ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ ఇప్పుడొక కుంగి కృశించిపోయిన పార్టీగా కనిపిస్తోంది. ఈ పార్టీకి ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే అర్హత లేదని ప్రాంతీయ పార్టీలు వాదిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ‘దిగ్గజాలు’ అని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ అభివర్ణించారు. అందువల్ల ఈ దిగ్గజాలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌ ఆ నిర్ణయాలను అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ప్రధాన పాత్ర, కీలక పాత్ర వంటివి పోషించకుండా, అనుబంధ పాత్రను పోషిస్తే సరిపోతుందని ఆయన సలహా ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలు శ్రీరామచంద్రుడు కాగా, కాంగ్రెస్‌ లక్ష్మణుడని కూడా ఆయన పేర్కొన్నారు. నిజానికి, ప్రాంతీయపార్టీలను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అవి క్రమంగా విస్తరిస్తున్నాయి. బలం పుంజుకుంటున్నాయి. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌ కుంచించుకుపోతోంది.

   పశ్చిమ బెంగాల్‌లో 294 మంది సభ్యుల బలం కలిగిన శాసనసభలో  కాంగ్రెస్‌కు ఒక్కడంటే ఒక్క  సభ్యుడు కూడా లేడు.  ఇక 403 మంది సభ్యుల ఉత్తర ప్రదేశ్‌ శాసనసభలో కాంగ్రెస్‌కు ఉన్న సభ్యుల సంఖ్య రెండు మాత్రమే. 2019 ఎన్నికల్లో హిందీ రాష్ట్రాలలో ప్రతి పది స్థానాలకు కాంగ్రెస్‌ తొమ్మిది స్థానాలను కోల్పోయింది. ఆ స్థానాలలో అధిక భాగం బీజేపీకి దక్కాయి. అనేక రాష్ట్రాలలో బీజేపీతో ప్రత్యక్ష పోరాటంలో కాంగ్రెస్‌ ఘోరంగా అపజయాల పాలయింది. అందుకు విరుద్ధంగా అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు  బీజేపీని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీని దెబ్బతీశాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 40లోక్‌సభ స్థానాలకు గాను 34 స్థానాలను చేజిక్కించుకుంది. ఇక 2016 శాసనసభ ఎన్నికల్లో కూడా 294 స్థానాలలో 211 స్థానాలలో ఘన విజయం సాధించింది.

ప్రాంతీయ పార్టీలకే ప్రాధాన్యం  

లోక్‌సభ ఎన్నికల్లోనూ, శాసనసభ ఎన్నికల్లోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించడాన్ని బట్టి ప్రజలంతా ఆ పార్టీవైపే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే, బీజేపీతో కాంగ్రెస్‌ ప్రత్యక్ష పోరాటానికి దిగిన రాష్ట్రాలలో మాత్రం లోక్‌సభకు ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులను, శాసనసభకు ఎక్కువ మంది కాంగ్రెస్‌ సభ్యులను ఓటర్లు గెలిపించడం జరిగింది. రాజస్థాన్‌లో 2018 శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు కొద్దిపాటి మెజారిటీతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చారు కానీ, లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాలకు గాను 24 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. విచిత్రంగా, 2021లో పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు 215 స్థానాలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గెలిపించారు కానీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం దాని సంఖ్య 34 నుంచి 22కు పడిపోయింది. మొత్తం మీద బాగా దెబ్బతిన్నది మాత్రం కాంగ్రెస్‌ పార్టీయే. ఆ కారణంగానే అఖిలేశ్‌ యాదవ్‌ ప్రాంతీయ పార్టీలు దిగ్గజ పార్టీలని వ్యాఖ్యానించడం జరిగింది.

   అయితే, ప్రాంతీయ పార్టీలకు కొన్ని పరిమితులున్నాయి. ఇవి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేవు. వాటి పట్టు, పలుకుబడి వాటి రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. తమ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు కోసమో, తమకు అన్యాయం జరిగిందనే అభిప్రాయంతోనో అవి ప్రాంతీయ స్థాయిలో బలపడ్డాయి. ఆ పార్టీల నాయకులను జాతీయ స్థాయి నాయకులుగా పరిగణించలేం. ఇక తృతీయ ఫ్రంట్‌ అనేది ఎక్కువ కాలం బతికి బట్ట కట్టిన చరిత్ర లేదు. ఈ కారణం వల్ల కాంగ్రెస్‌కు కొద్దిగా ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రతిపక్షాల ఐక్యత అంటూ చోటు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్‌ పార్టీ పేరును పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. దానికి ఇప్పటికీ ఒక జాతీయ పార్టీగానే గుర్తింపు ఉంది. ఆ పార్టీకి మాత్రమే  జాతీయ స్థాయిలో నాయకత్వం ఉంది. ఇదికాదనలేని విషయం. బీజేపీని ఎదుర్కోవాలన్న పక్షంలో ప్రాంతీయ  పార్టీలన్నీ తప్పనిసరిగా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ స్థాయిలో ఉన్నంత వరకూ బీజేపీని ఎదుర్కోవడం అసాధ్యాలోకెల్లా అసాధ్యమైన విషయం. 

ఆధిపత్య ధోరణితో అడ్డంకులు 

 ఇక, కాంగ్రెస్‌ పార్టీతో పాటు, ప్రాంతీయ  పార్టీలు కూడా తమ ఆధిపత్య ధోరణిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అన్ని పార్టీలూ సమాన భాగస్వాములేనన్న భావన కలిగితే తప్ప ఐక్యత అనేది సాధ్యపడదు. అందరూ రాముళ్లే తప్ప లక్ష్మణులెవరూ లేరనే విషయాన్ని పార్టీలన్నీ అంగీకరించాలి. ఆ భావన కలిగితేనే వారు తమ నాయకుడిని ఎంపిక చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అన్నిటికన్నా ప్రతిపక్షాల ఐక్యతే ముఖ్యం. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించాలనే దుగ్ధ తమకేమీ లేదని కాంగ్రెస్‌ ఏనాడో స్పష్టం చేసింది. “దేశానికి సరైన, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగిన పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే. అయితే, ఎన్‌.డి.ఎను ఓడించే విషయంలో మేం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం” అని ఇటీవల కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు తాము ఏ నాయకుడికి ప్రాధాన్యం ఇస్తామన్నది ప్రకటించడం అవసరం. రాహుల్‌ కానప్పుడు మమతా బెనర్జీ, స్టాలిన్‌, నితీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌లలో ఎవరు నాయకుడైనా పరవాలేదు.

   మొత్తం మీద పోటీ నుంచి కాంగ్రెస్‌ తప్పుకున్నందువల్ల ఇప్పటికైనా ప్రతిపక్షాలు ఒక్క తాటి మీదకు వచ్చే ప్రయత్నం చేయడం మంచిది. కేంద్ర దర్యాప్తు సంస్థలు  ప్రతిపక్ష నాయకులను వేటాడడం, రాహుల్‌ గాంధీని అనర్హుడిని చేయడానికి కుట్ర జరుగుతుండడం అనే రెండు కారణాలు చాలు, ప్రతిపక్షాలు ఏకం కావడానికి. అయితే, కేవలం ఈ రెండు కారణాలతో బీజేపీని ఓడించడం సాధ్యం కాకపోవచ్చు. బీజేపీ అధికారానికి వచ్చిన కారణాలను పరిశీలించాలి. హిందువులపై వేధింపులు, అవినీతి రహిత పాలన, శీఘ్ర అభివృద్ధి, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షాలు దాదాపు ఇదే మార్గంలో ప్రజల మనసులను చూరగొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ముందుగా బీజేపీకి ప్రత్యామ్నాయం చూపించగలగాలి. ప్రతిపక్షాల ర్యాలీలకు జనం రాకపోవడం ఈ కారణంగానేనన్న విషయం అర్థం చేసుకోవాలి. బీజేపీ ఎటువంటి పథకాలను, వ్యూహాలను రూపొందిస్తోందో కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక ప్రతిపక్షాలు చూపించే ప్రత్యామ్నాయ నాయకుడిమీద విజయం అనేది ఆధారపడి ఉంటుంది. నరేంద్ర మోదీకి సమ ఉజ్జీ అయిన నాయకుడిని తెర మీదకు తీసుకు రావాల్సి ఉంటుంది. ఆ నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఏర్పడాలి. అవినీతిరహితమైన పాలనను, సమర్థమైన పాలనను అందించగల నాయకుడిని ఎంపిక చేసుకుని ప్రజల ముందుకు రావాల్సి ఉంటుంది.

– వై.ఎస్‌. సుదర్శనాచారి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News