రానున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం కాగలవా? ఇది జరిగే పనేనా? 2004 నాటి పరిస్థితులు 2024లో పునరావృతం అవుతాయా? నిజాఇకి ఇవన్నీ ఆలోచింపజేసే ప్రశ్నలే. సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు చర్చకు వచ్చినప్పుడు రాజకీయ, సామాజిక, మీడియా మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. అయితే, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కారణంగా మళ్లీ ఈ అంశం చర్చనీయాంశంగా మారినప్పటికీ, ఎక్కడా, ఎవరి దగ్గర నుంచి బలమైన వాదన గానీ, అభిప్రాయం గానీ వినిపించడం లేదు. 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రతిపక్షాలు మరోసారి ఒక్కతాటి మీదకు వచ్చి, సంఘటితంగా బీజేపీపై పోరాటం జరిపే అవకాశం ఉందంటూ ఓ జాతీయ దినపత్రిక ఇటీవల ఒక విశ్లేషణను ప్రచురించింది. నిజానికి, ఏ దినపత్రికా ఈ మధ్య కాలంలో ఈ విషయంలో పెద్దగా చొరవ తీసుకోవడం లేదు. ప్రతిపక్షాలు సంఘటితం కావడమే కాకుండా, నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉందంటూ ఆ పత్రిక చీకటిలో ఒక బాణం వదిలింది.
సహజంగానే దీని మీద నితీశ్ కుమార్ వెంటనే స్పందించారు. తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లో నిలుచునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యమైతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం ఏ పార్టీ నాయకులు నడుం బిగించాలి? ఒకప్పుడు ఈ కీలక పాత్రను మార్క్సిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి హర్‌కిషన్ సింగ్ సూర్జిత్ పోషించారు. 19962004 సంవత్సరాల మధ్య లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఎవరికి వారుగా ఉన్నప్పుడు ఆయన నడుం బిగించి ప్రతిపక్షాలను ఒకే తాటి మీదకు తీసుకు వచ్చారు. నితీశ్ ఒక విధంగా చాలా దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏదో ఒక పార్టీతో చేతులు కలుపుతుంటుంది. ఆ పార్టీగ తనకు తానుగా గెలిచి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఏదో ఒక పార్టీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మిత్రపక్షాన్ని దూరంగా పెట్టడం ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది. ఇటీవల వరకు బీజేపీతో అంటకాగిన నితీశ్ కుమార్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ మీదే కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇతర పార్టీలను కలుపుకుని, గెలిచి మళ్లీ అధికారంలోకి రావడానికి నితీవ్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.
కాలం చాలా మారింది!
అందులో భాగంగానే ఆయన ప్రతిపక్షాల మధ్య ఐక్యత అంటూ మళ్లీ నినాదం చేయడం మొదలుపెట్టారు. అయితే, ఇటువంటి రాజకీయ దూరదృష్టి ఒక్కటీ సరిపోదు. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో అటువంటి ఆలోచన బెడిసికొట్టినా కొట్టవచ్చు. 1996, 2004 ఎన్నికల నాటి పరిస్థితికి భిన్నంగా ఈసారి అంటే 2024 కంటే ముందు ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమైనప్పటికీ, అవి అధికారంలోకి రావడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం అందని ద్రాక్ష పండే అవుతుంది. ఇదివరకటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని కొందరు వాదించవచ్చు. వాటినీ, వీటినీ పోల్చకూడదని కూడా అనవచ్చు. కానీ, నరేంద్ర మోదీ కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత లోక్‌సభ ఎన్నికల తీరుతెన్నులు సమూలంగా మారిపోయాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవి దాదాపు అధ్యక్ష తరహా ఎన్నికల స్థాయికి ఎదిగిపోయాయి. ప్రధానమంత్రి పదవికి ఎవరు ఎన్నికవుతారన్న దానిపై ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. అభ్యర్థులు, పార్టీలు ముఖ్యమనుకునే రోజులు పోయాయనే సంగతి అర్థం చేసుకోవాలి.
ఇక 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2018, 2020 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలను కూడా గమనించండి. 2018లో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు, 36.2 శాతం ఓట్ల వాటాతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ ఓటు వాటా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కన్నా ఒకే ఒక శాతం తక్కువ. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 51.4 శాతం ఓట్లతో విజయం సాధించింది. అదే సంవత్సరం హర్యానా ఎన్నికల్లో ఆ పార్టీ 58 శాతం ఓట్లు చేజిక్కించుకుంది. విచిత్రమేమిటంటే అదే హర్యానాలో 2019లో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఓట్ల వాటా 36.5 శాతమే నమోదు అయింది. సాధారణ మెజారిటీ కూడా సంపాదించుకోలేకపోయింది. ఢిల్లీలో ఇటువంటి పరిస్థితి రెండు సార్లు ఏర్పడింది. ఢిల్లీలో 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ఓటు వాటా 57 శాతం పైచిలుకే ఉంది. ఎనిమిది నెలల తర్వాత ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ 54 శాతం ఓట్లతో అధికారానికి వచ్చింది.
దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, రాజకీయ నాయకులకు, వారి పార్టీలకు భిన్నంగా ఓటరు ఎంతో విచక్షణతో వ్యవహరిస్తున్నాడు. శాసనసభ ఎన్నికలకు స్థానిక పార్టీలకు ఓటేస్తే, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీకి అందుకు భిన్నమైన ఓటు వేస్తున్నాడు. అందువల్ల, ప్రతిపక్షాలు ఏ చర్య తీసుకున్నా, ఏ వ్యూహాన్ని రూపొందించినా తప్పనిసరిగా ఈ సమకాలీన సమీకణాలను దృష్టిలో పెట్టుకోవాలి. 1990 నుంచి 2004 వరకూ జరిగిన ఐక్యతా ప్రయత్నాలు వేరు. 2024లో జరగబోయే ఎన్నికల తీరు వేరు. అప్పుడూ ఇప్పుడూ ఒకే పద్ధతి అనుసరిస్తామంటే భంగపడే ప్రమాదం ఉంది. నితీశ్ బీహార్‌లో ఉన్నప్పుడు, మోదీ గుజరాత్‌లో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఐక్యత కొన్ని విజయాలు సాధించి ఉండవచ్చు. నితీశ్ బీహార్‌లోనే ఉన్నారు కానీ, మోదీ కేంద్రానికి మారారన్న సంగతి కలలో కూడా విస్మరించకూడదు.