Saturday, July 6, 2024
Homeఓపన్ పేజ్Opposition Unity: ప్రతిపక్షాల ఐక్యతకు మరో ప్రయత్నం

Opposition Unity: ప్రతిపక్షాల ఐక్యతకు మరో ప్రయత్నం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయంటే పాలక పక్షంలో కన్నా ప్రతి పక్షాల్లోనే ఒక విధమైన సందడి పెరుగుతుంది. చివరి క్షణంలో ప్రారంభ మవుతున్న ఐక్యతా ప్రయత్నాల వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని, పాలక బీజేపీని ఎదుర్కోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత తేలికైన విషయమేమీ కాదని 2014లోనే ప్రతిపక్షాలకు అనుభవపూర్వకంగా అర్థమై ఉండాలి. ఆ తర్వాత 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడైనా అర్థమై ఉండాలి. అయితే, ప్రతిపక్షాలు గత పదేళ్ల కాలంలో ఒక్క పాఠం కూడా నేర్చుకున్న దాఖలాలు లేవు.

- Advertisement -

ఆత్మవిమర్శ చేసుకోవడమనేది ప్రతిపక్షాల నిఘంటువులోనే లేనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలో పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించే వరకూ ప్రతిపక్షాలలో చలనమే కనిపించలేదు. మరో ఏడాది కాలంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది కూడా అనేక రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ శాసనసభలకు తీవ్రస్థాయిలో రిహార్సల్‌ వేసు కుంటే తప్ప ప్రతిపక్షాలు 2024 సార్వ త్రిక ఎన్నికల నాటికి సంఘటితం అయ్యే అవకాశం లేదు.

ఈ శాసనసభల ఎన్నికల్లో అవి సంఘటితంగా తమ సత్తా చూపించగలిగితే, సార్వత్రిక ఎన్నికల నాటికి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లడానికి, పాలక పక్షాన్ని గట్టిగా ఢీకొనడానికి అవకాశం ఉంటుంది. ఓటరు శాసనసభ ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను విభిన్నంగా పరిగణిస్తున్న సమయంలో ప్రతిపక్షాలు శాస నసభ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు విభిన్న వ్యూహాలనే అనుసరించాల్సి ఉంటుంది. అందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిం చాలి. 2014, 2019 సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఒకే తాటి మీద నిలబడి పోటీ చేసి, సత్ఫలితాలను పొందాయి. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఘన విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గాను ఆర్‌ఎల్‌.డి, బి.ఎస్‌.పి, ఎస్‌.పిలు కలిసి కేవలం 15 స్థానాలు మాత్రమే చేజిక్కించుకోగా, బీహార్‌లో 40 స్థానాలకు గాను ఆర్‌.జె.డి, జె.డి.యు, కాంగ్రెసులో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగాయి. సార్వత్రిక ఎన్నికలనే సరికి, ప్రతిపక్షాలు, వ్యూహాలు, అంచనాలు, ఆలోచనలు పూర్తిగా తలకిందులవుతున్నాయి. ఇతర ప్రతిపక్ష నాయకులకు ఈ సంగతి అర్థమైందో లేదో తెలియదు కానీ, రాహుల్‌ గాంధీకి మాత్రం ఈ సత్యం పూర్తిగా అర్థమైనట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఈ సారైనా ప్రజల దగ్గరికి ఒక విజన్‌తో వెళ్లాలి. ఈ విజన్‌ బీజేపీ విజనికి ప్రత్యామ్నాయంగా ఉండాలి. ఏ విజనూ లేకుండా ప్రజల దగ్గరకు వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు.
విచిత్రమేమిటంటే, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్వాదీ పార్టీ, డి.ఎం.కె, వామ పక్షాలు బీజేపీకి బద్ధ శత్రువులే అయినప్పటికీ, 2014 నుంచి ప్రతిపక్షాల ఐక్యతకు దూరంగానే ఉంటూ వస్తున్నాయి. రాహుల్‌ గాంధీ చెప్పినట్టు, ప్రతిపక్షాల ఐక్యత అనే ది సీట్ల పంపకం స్థాయి నుంచి దాటి ముందుకు పోవాల్సి ఉంది. ఇది చెప్పడం తేలికే కానీ, ఆచరణలో సాధ్యం కాదు. ప్రతిపక్షాల ఐక్యత అనే సరికి, ప్రధాని అశ్యర్థి ఎవర నేది ముందుగా తేలాల్సి ఉంటుంది. బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రధాన సారథి ఎవరు అనే విషయంలోనే ముందు స్పర్థలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఇంతవరకూ ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు ప్రారంభం కాలేదు కానీ, ఐక్యతా ప్రయత్నాలు మొదలవుతే మాత్రం మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్‌తో సహా పలువురు నాయకులు ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి పోటీలోకి దిగుతారు.
మరో విశేషమేమిటంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా, నానాటికీ తీసికట్టుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ ఈ పోటీలో ముందు స్థానంలో ఉంటుంది. ఈ పార్టీ దేశంలో మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అక్కడ కూడా సార్వత్రిక ఎన్నికల్లో విజయాలు సాధిస్తుందన్న నమ్మకం లేదు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్‌ నాయకత్వం మీద ఏమాత్రం న మ్మకం లేదు. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అవి అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించడమంటే ఆలోచించాల్సిన విషయమే. తాను చెబుతున్న విజనికి రాహుల్‌ తానే అంగీకరిస్తారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఏది ఏమైనా, కొద్దిగా ఆలస్యం గానైనా ఆయన ప్రతిపక్షాల ఐక్యత గురించి మొదటిసారిగా ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనకు ప్రతిప క్షాల నుంచి స్పందన ఏవిధంగా ఉండబోతోందో చూడాలి.
సంస్థాగతంగానే ఒక విజన్‌ అంటూ లేక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇక ప్రజల నాడిని పట్టుకోవడమన్నది ప్రతిపక్షాలకు ఇంతవరకూ అంతుబట్టని విషయంగానే ఉంటూవస్తోంది. ప్రతిపక్షాల మధ్య ఉన్న రాజకీయ వైవిధ్యాలను చక్కదిద్ది, వాటిని ఒకే తాటి మీదకు తీసుకురావడానికి కాంగ్రెస్‌కు లేదా రాహుల్‌ గాంధీకి ఉన్న అర్హతలేమిటన్న ప్రశ్న ఇప్పటికే ప్రారంభం అవుతోంది. సొంత ఇంటినే చక్కదిద్దుకోలేని పార్టీ పది పన్నెండు ప్రతిపక్షాలను ఎలా ఒకే తాటికి తెస్తాయన్నది వేచి చూడాల్సిన విషయమే.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News