ఉన్నది ఒకటే జిందగీ… అంటారు. కానీ, మరణించిన తర్వాత కూడా మరో ఎనిమిది మందిలో జీవించగలమన్న సంగతి ఎంతమందికి తెలుసు? మనందరికీ జీవితం సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. అంటే మరణించినవారు మళ్లీ బతికొస్తారని కాదు.. వారి శరీరంలో ఉన్న అత్యంత కీలకమైన 8 అవయవాలు ప్రాణాపాయంలో ఉన్న వేరేవారికి ఉపయోగపడి, వారిని బతికిస్తాయి. అలా వారి శరీరంలో మన అవయవాల ద్వారా మళ్లీ మరో జిందగీని చూస్తామన్న మాట. ఎవరైనా మరణిస్తే.. వాళ్ల గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముక మజ్జ, మూలకణాలను దానం చేయడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చర్మం కూడా దానం చేయవచ్చు. మరణించిన 6 గంటల్లోగా కళ్లను కూడా దానం చేయగలం. 18 ఏళ్లు నిండినవారు ఎవరైనా అవయవదానానికి ప్రతిజ్ఞ తీసుకోవచ్చు. నిజానికి ఇలాంటి అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల… వారి అవయవాలు విఫలమై అనేకమంది ప్రతియేటా ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రపంచంలోని 195 దేశాల్లో సుమారు 4.5 కోట్లమంది అంధులే. మన దేశంలోనే ప్రతి ఏడాదికి మూడు లక్షల మంది నేత్ర దాతల అవసరం ఉంది. కానీ అత్యంత కష్టమ్మీద కేవలం 50వేల మంది మాత్రమే కళ్లు దానం చేస్తున్నారు. మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటున్నా, నేత్రదానాలు మాత్రం అంతగా ఉండట్లేదు. మృతదేహాన్ని యథాతథంగా దహనం లేదా ఖననం చేయాలన్న మతాచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండటం వల్ల పవిత్రమైన అవయవదాన ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
అవయవదానాలు ప్రధానంగా రెండు రకాలు. అవి లైవ్, కెడావర్. లైవ్ అంటే మనిషి జీవించి ఉండగానే కొన్ని అవయవాలు దానం చేయొచ్చు. కెడావర్ అంటే మరణించిన తర్వాత. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి నిర్ధారిత సమయంలో అవయవాలు తీసుకుంటారు. మనిషి జీవించి ఉండగా వాళ్ల నుంచి ఎముక మజ్జ, కాలేయంలో కొంత భాగం, ఒక మూత్రపిండం ఇవ్వచ్చు. అవి ఇచ్చినా మనిషి ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండదు. గుండె, ఊపిరితిత్తులు, కళ్లు, ఇతరత్రా అవయవాలను మాత్రం మరణించిన తర్వాతే తీసుకుంటారు. సాధారణంగా మన మెదడు శరీరం అంతటికీ నియంత్రణ కేంద్రం. అది పనిచేయకపోతే శరీరం అంతా చచ్చుబడిపోతుంది. బ్రెయిన్ డెత్‌ను కొన్ని పరీక్షల ద్వారా ఖరారు చేయొచ్చు. అలా చట్టబద్ధంగా ప్రకటిస్తే, వెంటనే సమీప బంధువుల సమ్మతి తీసుకుని అవయవ మార్పిడి ప్రక్రియను ప్రారంభిస్తారు.
అవయవ దానంలో స్పెయిన్, అమెరికా లాంటి అనేక దేశాలు చాలా ముందున్నాయి. మన దేశంలో ఇటీవల కొంతకాలం నుంచే అవగాహన పెరుగుతోంది. కానీ, ఇప్పటికీ అవయవాల డిమాండ్ కు, వాటి సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. మన దేశం ఈ విషయంలో మూడోస్థానంలో నిలిచింది. కానీ ఇప్పటికీ ఎక్కువగా అవయవదానం అనేది కుటుంబసభ్యుల మధ్య మాత్రమే జరుగుతోంది. అందరికీ లబ్ధి కలిగేలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ మరణానంతరం అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు తీసుకోవడానికి సమయం తక్కువగా ఉంటుంది. 12 గంటల్లో అవయవాలను సేకరించి తక్కువ సమయంలోనే మార్పిడి చేయాల్సి ఉంటుంది.
అవయవదానం విషయంలో ఇంకా చాలామందికి చాలా అవగాహన రావాలి. కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436 కెడావర్ డొనేషన్లు 2,942చొప్పున ఉన్నాయి. లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం అంటే దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. పది సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణం. తెలంగాణలో జీవన్‌దాన్ సమన్వయకర్తగా డాక్టర్ స్వర్ణలత లాంటివాళ్లు ఎంతో కృషి చేస్తున్నారు. దానివల్లే మన దేశంలో తెలంగాణ రాష్ట్రం అవవయదానంలో ముందంజలో ఉంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రెండో ఉత్తమ అవార్డును దక్కించుకున్నాయి. మణిపూర్ కు బెస్ట్ ఎమర్జింగ్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ అవార్డు లభించింది. అవయవ దానంలో ఎమర్జింగ్ స్టేట్స్ అవార్డు పొందిన రాష్ట్రాలు: 1) ఆంధ్రప్రదేశ్ 2) మధ్యప్రదేశ్, 3) జమ్ముకశ్మీర్. ఉత్తమ నాన్ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గాన్ రిట్రీ వల్ సెంటర్స్ (ఎన్ టీ ఓ ఆర్ సీ) అవార్డును అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ అందుకుంది. ఎమర్జింగ్ ఎన్ టీ ఓ ఆర్ సీ అవార్డులు: 1. కమాండ్ హాస్పిటల్, చాందమందిర్, 2. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హిమాచల్ ప్రదేశ్ కు లభించాయి. ఉత్తమ అవగాహన/ఐ ఇ సి యాక్టివిటీస్ ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ కు అవార్డు లభించింది. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి అత్యున్నత విరాళం పురస్కారం లభించింది. ఉత్తమ బ్రెయిన్ స్టెమ్ డెత్ సర్టిఫికేషన్ టీమ్ గుర్తింపు పొందిన వాటిలో (ప్రాంతాల వారీగా) : 1. వెస్ట్ – న్యూ సివిల్ హాస్పిటల్, సూరత్; 2. నార్త్ – ఆల్ఎంఎస్, ఢిల్లీ; 3. సౌత్ – కిమ్స్, సికింద్రాబాద్; 4. ఈస్ట్ – ఐపీజీఎంఈఆర్, కోల్‌కతా ఉన్నాయి.
అవయవదానానికి ప్రోత్సాహం అంతగా లేకపోవడం, దీనిపై ప్రచారం కూడా ఉధృతంగా సాగకపోవడం వంటి కారణాల వల్ల ఇంకా ఈ విషయంలో ప్రజలు అంతగా ముందుకు రావడం లేదు. మన దేశంలో వివిధ మతాచారాలను ఎక్కువగా పాటించడం, వాటి ప్రకారం మృతదేహాన్ని యథాతథంగా ఖననం లేదా దహనం చేయాలన్న ప్రవచనాల వల్ల కూడా అవయవదానానికి ముందుకు రావట్లేదు. నిజానికి మానవసేవే మాధవ సేవ అంటారు. హిందూ పురాణాల ప్రకారం చూసినా ధధీచి తన శరీరాన్నే దానం చేసిన ఘటనలు ఉంటాయి. పార్సీలు అసలు మృతదేహాలను ఖననం లేదా దహనం చేయకుండా రాబందుల కోసం గుట్టల మీద వదిలేస్తారు. ఇలా ఇతరుల ఉపయోగం కోసం శరీరాలను ఇవ్వడం అనేది మన దేశంలో పలు మతాల్లో ఉంది. ఇలాంటి ఉదాహరణలను గుర్తుచేసుకుని ఇకనైనా యువత అవయవదాన ప్రతిజ్ఞలకు ముందుకు రావాలి. తమ తల్లిదండ్రులకు కూడా ఈ దిశగా స్ఫూర్తి కలిగించాలి.