Thursday, June 27, 2024
Homeఓపన్ పేజ్Orissa politics: ఒడిశాలో కొత్త రాజకీయ శకం

Orissa politics: ఒడిశాలో కొత్త రాజకీయ శకం

ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్‌ చరణ్‌ మాఝీ ఆ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త రికార్డు నెలకొల్పారు. అనేక సంవత్సరాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో పాటు, నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడం దేశ చరిత్రలోనే ఒక గొప్ప విశేషం. ఆయనకన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్న బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌ 24 ఏళ్ల 99 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు. దేశంలో అంత సుదీర్ఘ కాలం పాలన చేసినవారిలో ఆయన రెండవవారు. సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ మరో 66 రోజులు ఎక్కువగా పాలన చేయడం జరిగింది. మాఝీ సంతాలీ ఆదివాసీ వర్గానికి చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. అటువంటి ఆదివాసీ వ్యక్తిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయడం బీజేపీ అటు మధ్య భారతంలోనూ, ఇటు తూర్పు భారతంలోనూ ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దేశ రాష్ట్రపతిగా ఒరిస్సాలోని ఆదివాసీ కుటుంబానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన బీజేపీ మరో ముఖ్యమైన పదవిని ఆదివాసీలకే అప్పగించడం దేశ చరిత్రలో ఒక పెద్ద రికార్డనే చెప్పాలి.
ఒక శాసనసభ్యుడిగానే కాకుండా, ఒక రాజకీయ నిర్వహణకర్తగా ఒడిశాలో మంచి పేరున్న మాఝీకి సమర్థుడైన వ్యవహార దక్షుడుగా కూడా పేరుంది. 1990లలో ఆయన ఓ గ్రామ సర్పంచుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన అధికారంలోకి రావడం బీజేపీ భవిష్య త్తును ఒడిశాకు సంబంధించినంత వరకూ ఒక మలుపు తిప్పింది. నవీన్‌ పట్నాయక్‌ లేకుండా బిజూ జనతా దళ్‌ దిక్సూచి లేని పడవేనని, ఆయన ఎక్కువగా అధికారుల మీద ఆధారపడి ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకుండా చేశారని ప్రచారం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. నిజానికి ఇది బిజూ జనతాదళ్‌కు ప్రతికూలమైన అంశమే. నవీన్‌ పట్నాయక్‌ చాలా కాలంగా అధికారుల మీద ఆధారపడుతూ, పార్టీకి చాలావరకు దూరమయ్యారు. ముఖ్యమంత్రి విధానా లను అమలు చేయడం, పాలనా వ్యవహారాలను చక్కబెట్టడం వంటి కీలకమైన అంశాలను ఆయన పూర్తిగా అధికారులకే వదిలేయడం జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ రాష్ట్రంలో క్రమంగా ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగింది. పైగా అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారు కావడం బీజేపీకి మరింతగా కలిసి వచ్చింది.
విచిత్రమేమిటంటే, కొద్ది కాలం పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్న బీజేడీ, బీజేపీలు మాఝీ ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పుడు మళ్లీ సన్నిహితం అవుతున్నాయి. నవీన్‌ పట్నాయక్‌ కు అత్యంత సన్నిహితుడైన బ్యురాక్రాట్‌ పాండ్యన్‌ ఒక తమిళుడు కావడం, అంటే రాష్ట్రేతర వ్యక్తి కావడం, పట్నాయక్‌కు మైనస్‌ పాయింటయిపోయింది. జి.డి.పి వృద్ధికి తోడ్పడిన పట్నాయక్‌ విధానాలను కొన్నిటిని బీజేపీ ప్రభుత్వం యథాతథంగా కొనసాగించే ఉద్దేశంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి కొన్ని విధానాలను బీజేపీ తూచా తప్పకుండా అనుసరించే అవకాశం ఉంది. నిజానికి, గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు, పేదల అభ్యున్నతికి ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఒడిశా రాష్ట్రం పేదరికం విషయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నిటికి కంటే అధ్వాన స్థితిలో ఉంది. రాష్ట్రంలో 11.7 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారు.
మాఝీకి, ఆయన మంత్రివర్గ సహచరులకు తమ లక్ష్యాలేమిటో పూర్తిగా అర్థమయ్యే ఉంటాయి. కేవలం పాలనా వ్యవహారాల్లోనే కాదు, ఒక ప్రశాంత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో కూడా పట్నాయక్‌ కృతకృత్యులయ్యారు. మొదట్లో ఆ రాష్ట్రంలో మత కలహాలు కూడా చోటు చేసుకు న్నాయి. ఆదివాసీలు జీవితాలు ఎంతో అధ్వానంగా ఉండేవి. బీజేపీతో పొత్తు కుదర్చుకున్న తర్వాత నుంచి మత కలహాలు తగ్గుముఖం పట్టాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. దాంతో బీజేపీ, బీజేడీలు వేటికవే పోటీ చేయడం జరిగింది. బీజేపీ ఇక్కడ విజయం సాధించినంత మాత్రాన తమ హిందుత్వ సిద్ధాంతాలకు రాష్ట్ర ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టుగా భావించనక్కర లేదు. రాష్ట్ర అభివృద్ధి మీద, పేదరిక నిర్మూలన మీద ఈ ప్రభుత్వం ఎంతగా దృష్టి పెడితే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News