ఒక చేత హలము బట్టి ప్రకృతి సేద్యమును, మరోచేత కలము బట్టి సాహితీ సేద్యము చేస్తున్న సహజ కవి ఊర ఈశ్వర్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా, కోవెల దిన్నెకు చెందిన ఈశ్వర రెడ్డి ప్రాచీన పద్య ప్రక్రియలో తన రచనా నైపుణ్యమును కొనసాగిస్తున్నారు. వెంకటేశ్వర ద్విశతి, చెన్నకేశవ శతకము, కవితా లహరి, సమస్యాపూరణము, ముక్తి పథము మొదలగు పుస్తకాలు ఇదివరకే ముద్రించారు. అత్యాధునిక తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి పొందిన కవితా ప్రక్రియ మణిపూసలు. వడిచర్ల సత్యం మానసపుత్రిక అయిన ఈ ప్రక్రియలో కూడా ఊర ఈశ్వర రెడ్డి ‘అక్షర మణులు’ అనే పుస్తకమును వెలువరిచడం విశేషం.
పండిత పామరులను అలరించేలా ఈయన రచనలు సరళ సుందరంగా, భావ గంభీరంగా సాగుతాయి. సందేశాత్మకంగా ఉంటాయి. మొత్తం 116 మణిపూసలతో ఉన్న అక్షర మణులు సంపుటిలో ఒక్కొక్క మణిపూస ఒక్కొక్క అణిముత్యమని చెప్పవచ్చు. నిత్యం సమాజంలో జరిగే అనేక సంఘటనలను ఆకళింపు చేసుకొని, తన భావాలను చెరిగిపోని అక్షర మణిపూసలుగా తీర్చిదిద్దారు. చక్కని హితబోధతో చేశారు. పదాడంబారాల జోలికి వెళ్లకుండా సూటిగా స్పష్టంగా పాఠకుల హృదయాలను తాకేలా అందంగా ఈ మణిపూసల పుస్తకాన్ని రాసారు. ఒకటి చదివితే మల్లొకటి చదువాలనే కుతూహలాన్ని పాఠకులకు ఈ మణిపూసలు కలిగిస్తాయి. రచనా తీరు ఆకర్షణీయంగా సాగింది. మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం.
‘గాలికి లేదు యే కులము
నీటికి లేదు యే కులము
మధ్యలోన నీకేల
వచ్చింది యీ వ్యాకులము?!‘
అంటూ కులంతో అలజడిని సృష్టించే వారిని ప్రశ్నిస్తున్నాడు. గాలికి, నీటికి లేని కుల పట్టింపు మానవులకు మాత్రము ఎందుకుండాలి ? అని నిగ్గదీసి అడిగాడు. ఆనాటి నుంచి ఈనాటి దాకా కులము పేరుతో సమాజంలో జరుగుతున్న గొడవలను ఈ చిన్న మణిపూస ద్వారా ఖండించారు.
‘ధర్మాన్నెప్పుడు వీడకు
రక్షించుము చివరి వరకు
నక్క వినయము నటించే
నయవంచకులను నమ్మకు!’
ధర్మమార్గాన్ని విడిచి పెట్టకుండా చివరి వరకు రక్షించమంటారు. అలాంటి ధర్మమే సదా మనల్ని కాపాడుతుందని, నక్క వినయం నటించి, తీయని మాటలతో మోసగించే వారిని ఎప్పుడూ నమ్మవద్దని కోరుతున్నారు. ఇటువంటి వారు లోకంలో మనకు నిత్యం కనబడుతూనే ఉంటారు. కాబట్టి వారితో జాగ్రత్తగా మెలగాలని చెప్పారు. ఈ మణిపూసలతో సమాజాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేశారు. ఈ వయ్యిలో వున్న అన్నీ మణిపూసల కవితలు నిత్యనూతనమై సామాజిక మార్పు కోసం దోహదపడతాయని చెప్పవచ్చు.
‘భరతమాత ఆక్రమణకు
పొంచివున్న ఘాతకులకు
బుద్ధి చెప్ప కదలాలి
కుత్తుకల తెగ కోయుటకు!’
మన దేశమును ఆక్రమించాలని చూసే ద్రోహులకు, దుర్మార్గులకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని, అవసరమైతే మట్టు బెట్టాలను పిలుపు నివ్వడం గమనార్హం. ఈ ఒక్క మణిపూస చాలు. దేశం పట్ల, జాతి పట్ల తనకున్న అచంచల దేశ భక్తిని, జాతీయతను తెలుసు కోవడానికి.
‘అబల కాదు సబల యామె
కనిపించెడు దైవ మామె
కామాంధుడవైన నిన్ను
కడతేర్చెడి శక్తి యామె!‘
స్త్రీలని బలహీనులని భావించి కొంత మంది కామాంధులు అత్యాచారం చేస్తున్నారు. కానీ అలాంటి వారిపట్ల ఆ అబలలే ఆది శక్తిగా మారుతారని హెచ్చరించారు. స్త్రీల గొప్పతనము తెలుపుతూ పలు మణిపూసలు ఉన్నాయి.
‘వట్టిమాట లెన్నైనా
పలకవచ్చు ధరలోనా
ప్రజలు మెచ్చు పనియొక్కటి
చేసి చూపు మికనైనా!’
వేయి మాటలు చెప్పడం కంటే ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పనినైనా చేసి చూపాలని చక్కగా, ముక్కుచూటిగా చెప్పారు. మాటల కంటే చేతలే ముఖ్యమనే భావన ఇక్కడ ధ్వనిస్తుంది.
బహు ప్రశంసనీయమైన ఈ మణిపూసలన్నీ ఆణిముత్యాలే, హితమును చేకూర్చేవే. ప్రధానంగా దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి, నైతిక విలువలతో కూడిన అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఊర ఈశ్వర రెడ్డి కలం నుండి ఇటువంటి మరెన్నో మంచి రచనలు రావాలని ఆశిస్తూ అభినందనలు!
‘అక్షర మణులు’ పుస్తకం వెల. 50 రూ.
ప్రతులకు: ఊర ఈశ్వర రెడ్డి,
7981497017.
సమీక్షకులు.
కందుకూరి భాస్కర్,
9703487088.