ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించాలంటే తన కాళ్ళనే నమ్ముకున్న మనిషి, చక్రం ఆవిష్కరణతో సులువుగా, వేగంగా, సుఖవంతంగా తన గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యక్తిగత ప్రయాణం కోసం బస్సులు,కార్లు,ఆటోలు, మోటారు సైకిళ్లు , సరుకు రవాణా కోసం లారీలు, లగేజీ వ్యాన్లు ,మొదలైన వాటిని ఉపయోగించే స్థితికి చేరుకోడానికి ఎన్నో యేళ్లు పట్టింది. దీనికిగాను ఇరుకు రహదారుల నుండి విశాలమైన రహదారులను నిర్మాణం చేసుకొన్నాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు అందరూ వివిధ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి.
మన దేశంలో రోడ్డు ప్రమాదాలు :
మన దేశంలో ప్రతీరోజు ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందులో స్వల్పమైన గాయాలతో గట్టెక్కిన వారు కొందరు, తీవ్ర గాయాలతో శరీరంలోని కొన్ని భాగాలను కోల్పోయిన వారు మరి కొందరు కాగా చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి 2022-23 సంవత్సరం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు, టాక్సీలు, బస్సులు, సరుకు రవాణా చేసే లారీలు, టిప్పర్లుమొదలైనవి మరియు ఇతర వాహనాలుతో మొత్తం కలిపి 2003 వ సంవత్సరంలో 67,007 ఉండగా 2020 వ సంవత్సరానికి 3,26,299 వాహనాలు రిజిస్టర్ కాబడి ఉన్నాయి.
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు , జిల్లా మరియు ఇతర రహదారులతో కలిపి సుమారు 63.32 లక్షల కిలో మీటర్ల పొడవు కలిగి ప్రపంచం లోనే రెండవ అతిపెద్ద రోడ్లు కలిగివున్నది మన భారత దేశం.
2005 సంవత్సరంలో జరిగిన 4,39,255 రోడ్డు ప్రమాదాలలో 4,65,282 మంది గాయపడగా, 94,968 మంది మరణించారు. అదే 2021 సంవత్సరం వచ్చేసరికి మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలలో 3,84,448 మంది గాయపడగా 1,53,972 మంది చనిపోయారని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో
1, 28,825 (31.2%) ప్రమాదాలు జాతీయ రహదారులలో, 96,382 (23.4%) ప్రమాదాలు రాష్ట్ర రహదారుల్లో, 1,87,225 (45.4%) ప్రమాదాలు మిగిలిన రహదారుల్లో జరుగుతున్నాయి.ఇక మరణాల విషయం చూస్తే 35.8% జాతీయ రహదారులపై, 24.6%, రాష్ట్ర రహదారులపై మరియు 39.6% ఇతర రోడ్లపై జరుగుతున్నాయి.
ఏయే రాష్ట్రాలలో అధికం:
తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు,6 అని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక బట్టి తెలుస్తుంది. దురదృష్టకరం ఏమిటంటే మొత్తం మరణాల్లో 67 శాతం మంది 15 సం. నుండి 45 సం. మధ్య వయస్సు కలిగిన వారే ఉన్నారు. 2020 సం .లో 36 శాతంగా ఉన్న మరణాలు 2021 సం లో 37.3 శాతంగా పెరగడం ఆందోళన కలుగచేస్తుంది. తే.13.12.2022 దిన విడుదల చేసిన నివేదిక ముందు మాటలో తెలిపిన సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణించిన ప్రతీ పది మందిలో ఒక్కరు భారతీయుడే ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన, అవయవాలను కోల్పోయిన , మరణించిన వారి కుటుంబాలకు నష్టం వాటిల్లడమే కాకుండా , దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడడం వలన అభివృద్ధి కొంత మేర క్షీణించే ప్రమాదం ఉంది.
ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు:
ప్రధానమైన కారణం వాహనాలు అతి వేగంగా నడపడం. కార్లలో సీటు బెల్టు పెట్టుకోపోవడం,
ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం , మద్యం త్రాగి వాహనాలు నడపడం, లారీలును క్లీనర్లు డ్రైవ్ చెయ్యడం, సెల్ ఫోన్లలో మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఇయర్ ఫోన్లు లేదా బ్లూటూత్ లు ధరించి వాహనాలు డ్రైవ్ చెయ్యడం, కాలం చెల్లిన , భద్రతా ప్రమాణాలు లేని వాహనాలలో ప్రయాణం చెయ్యడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, కండిషన్ లేని వాహనాల్లో ప్రయాణం, అర్ధ రాత్రి దాటిన తరువాత కూడా నడపడం, డ్రైవర్లు పూర్తి స్థాయిలో నిద్ర పోవకపోవడం, ట్రాఫిక్ చిహ్నాలపై అవగాహన లేక పోవడం, రోడ్లపై నో పార్కింగ్ జోన్ లో వాహనాలు నిలపడం, జంక్షన్లలో సిగ్నల్స్ని పాటించకపోవడం, డ్రగ్స్ తీసుకొని వాహనాలు నడపడం, కార్, బైక్ లతో రేసింగ్ లలో పాల్గోవడం , వయసు మళ్ళిన వారు డ్రైవ్ చెయ్యడం మొదలైన కారణాలు వలన ప్రమాదాలు జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు:
కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా మోటార్ వెహికల్ చట్టం (సవరణ ) 2019 చట్టాన్ని తీసుకు వచ్చింది. అలాగే జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా ఏ ప్రదేశం ( బ్లాక్ స్పాట్ ) లలో జరుగుతున్నాయో గుర్తించి ,
ఐఆర్.ఎ.డి , ఇ డి.ఎ.ఆర్ ల సహాయంతో అంతర్జాతీయ స్థాయి పద్దతులతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలు: పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడుపరాదు. మద్యం త్రాగి డ్రైవింగ్ చేయరాదు. ఎప్పటికప్పుడు వాహనాల ఇంజిన్లను తనిఖీలు చేయించుకోవాలి. కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అర్థరాత్రి తరువాత వాహనాలు నడుపరాదు. ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలి. రాంగ్రూట్ లో వెళ్ళరాదు. మలుపుల దగ్గర నిదానంగా వెళ్ళాలి. ఎప్పటికప్పుడు కళ్ళను పరీక్షించుకోవాలి. రాత్రి పూట పార్కింగ్ దగ్గర మాత్రమే వాహనాలను ఆపాలి. వాహనాలను ఓవర్టేక్ చెయ్యవలసి వస్తే జాగ్రత్తగా నడపాలి. జీబ్రా క్రాసింగ్ ల దగ్గర, పాఠశాలల దగ్గర , జనసమూహం ఎక్కువగా ఉన్న దగ్గర నెమ్మదిగా వెళ్లవలెను. మైనర్లు డ్రైవింగ్ చెయ్యగూడదు. యువకులు రేస్ల జోలికి పోగూడదు. ట్రాఫిక్ చిహ్నాలపై అవగాహన పెంచుకోవాలి. లారీలను లైసెన్స్ లేని వారు నడుపగూడదు. ద్విచ్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చెయ్యగూడదు. వీటిని అతిక్రమించిన వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి కారణమయ్యే వారిపై కేసులు పెట్టి వారి లైసెన్సులు రద్దు చెయ్యాలి. పాదచారులు కూడా రోడ్డు పై నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.స్వచ్ఛంద సంస్థలు కళాశాలల్లో చదువుతున్నవారికి , ఆటో , కార్, బస్, లారీ చోధకులకి అవగాహన కలిగించాలి.
డి జె మోహన రావు
టీచర్
ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా
9440485824