ఒక భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఆందోళనకర స్థాయిలో పెరిగి పోతున్నట్టు ‘ఆక్స్ ఫామ్’ అనే అంతర్జాతీయ స్థాయి సామాజిక సేవా సంస్థ ఇటీవల తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇది ఎంతగా విస్తరిస్తోందో వివరించడమే కాకుండా, నిత్య జీవితాలపై ఎటువంటి ప్రభావం కనబరుస్తోందో కూడా ఇది తెలియజేసింది. ఈ అసమానతలు అనేక సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నప్పటికీ, కోవిడ్ కాలంలో ఇది మరింత విజృంభించినట్టు ఇది గణాంక వివరాలతో సహా సాకల్యంగా తెలియజేసింది. ప్రపంచంలోని అయిదు మంది అపర కుబేరుల సంపద 2020 తర్వాత రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది కానీ, ప్రపంచంలో అత్యంత నిరుపేదలుగా ఉన్న 60 శాతం మంది, అంటే సుమారు 500 కోట్ల మంది ప్రజలు మాత్రం మరింత అధ్వాన స్థితికి దిగజారి పోయారు.
మరో దశాబ్ద కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనైర్ అవతరించే అవకాశం ఉంది. కానీ, 229 ఏళ్లు గడిచినా ప్రపంచంలో పేదరికం, అసమానతలు తొలిగే అవకాశం మాత్రం లేదు. కోవిడ్ తర్వాత పేద ప్రజల స్థితిగతులను గణాంకాలతో సహా చూసినప్పుడు 99 శాతం మంది ప్రజలు నిరుపేదలుగా మారిపోయారనే వాస్తవం వెల్లడైంది. మరింత దిగ్భ్రాంతికర విషయమేమిటంటే, కేవలం అసమానతల కారణంగా నాలుగు సెకండ్లకు ఒకసారి ఓ పేదవాడు ప్రాణాలు కోల్పోతున్నాడు. ఆర్థిక, లైంగిక, జాతి సంబంధమైన అసమానతలు, వివక్షలతో పాటు వివిధ దేశాల మధ్య కూడా ఈ అసమానతలు పెరిగిపోతూ, అనేక దుష్ఫలితాలను సృష్టిస్తున్నాయి. అసమానత అనేది జీవితంలో అత్యంత సహజమైన విషయంగా జనం పరిగణిస్తున్నారు కానీ, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రాథమికంగా చూస్తే ఈ అసమానతల కారణంగా ఆకలి, లేమి పెరిగి అర్ధాయుష్కులుగా చనిపోవడం జరుగుతుంది. ఇవి కాకుండా లైంగిక వివక్షకు సంబంధించిన సమస్యలు అనేకం ఉత్పన్నం కావడంతో పాటు, ఆరోగ్య సంరక్షణ, విద్య అనే సామాజిక కీలకాంశాలు అందనంత ఎత్తుకు వెళ్లిపోతాయి.
పచ్చదనం లోపించడం కారణంగా విష వాయువులు ఎక్కువై, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయనే విషయం అందరికీ తెలుసు. ఈ వాతావరణ మార్పుల ప్రభావం సంపన్నుల మీద చాలా తక్కువగా ఉంటుంది. కానీ, పేదల మీద మాత్రం ప్రాణాంతకంగా కనిపిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే కష్టనష్టాలన్నీ పేదలకే పరిమితం అవుతాయి. నిజానికి, అసమానతలనేవి అన్ని రంగాల్లోనూ విచ్చలవిడిగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ రంగం ఆ రంగం అనే తేడా ఏమీ లేదు. ఈ అసమానతలను తగ్గిస్తామని చెబుతారే కానీ, తగ్గించిన దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించవు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, వివిధ రంగాలకు సంబంధించిన విధానాలు, కార్యక్రమాలను రూపొందించేది సంపన్నులే. పేదరికాన్ని, అసమానతలను తగ్గించడానికి విధానాలు, పద్ధతులు రూపొందించేది కూడా సంపన్నులే. వారు సాధారణంగా తమ సంపన్నతను, సౌభాగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇవే విధానాలను ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానతల వల్ల దెబ్బతినేది బలహీనులు, పేదలు మాత్రమే.
భారతదేశంలో మొదటి నుంచి అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అసమానతల కారణంగా సామాజిక విభజనలు కూడా చోటు చేసుకున్నాయి. కోవిడ్ కాలంలో ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న కేటాయింపులు పది శాతం తగ్గిపోయాయి. విద్యారంగం కేటాయింపులు కూడా ఆరు శాతం తగ్గిపోవడం జరిగింది. పేదరికం, నిరుద్యోగం కూడా ప్రబలిపోయాయి. అయితే, సంపన్నులు మాత్రం మరింత సంపన్నులయ్యారు. ప్రపంచంలోని పేదల జనాభాను గమనిస్తే, ఇందులో సగం భారతదేశంలోనే ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. అయితే, ప్రపంచంలోని అపర కుబేరుల్లో మూడవ వంతు మంది మాత్రం భారతదేశంలోనే ఉన్నారు. దేశం రాష్ట్రాల సమాఖ్యే అయినప్పటికీ రెవెన్యూ వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ కాలంలో ధనికులు సంపాదించిన సొమ్ముపై పన్నులు విధించాలని, ఆ డబ్బును పేదరికం నిర్మూలనపై, అసమానతల తగ్గింపుపై ఖర్చు చేయాలని అది సూచిందింది. మహిళల పట్ల వివక్ష చూపించే చట్టాలను తొలగించాలని, పేదరిక నిర్మూలన పథకాలకు భారీగా నిథులు కేటాయించాలని కూడా అది సిఫారసు చేసింది. ఇందులో అనేక సూచనలు పాతవే కానీ, వాటిని ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూండాల్సిన అవసరం ఉంది.
Oxfarm report: ప్రపంచ పేదల సంఖ్యకు రెక్కలు
కోవిడ్ తరువాత మరింత పెరిగిన ఆర్థిక అసమానతలు