Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Pak in political crisis: వరుస సమస్యలతో పాక్ ఉక్కిరిబిక్కిరి

Pak in political crisis: వరుస సమస్యలతో పాక్ ఉక్కిరిబిక్కిరి

ఇప్పట్లో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే ఛాన్స్ లేదు

ఒకపక్క రాజకీయ సంక్షోభం, మరొక పక్క ఆర్థిక సమస్యలు. పాకిస్థాన్ పరిస్థితి ప్రస్తుతం అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఇంతవరకూ ముగింపేమిటో తెలియడం లేదు. మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ కు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా జనాదరణ పెరుగుతోందే కానీ, అది అధికారం చేపట్టడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఇమ్రాన్ ఖాన్ జైలుపాలయ్యారు. ఆయన పార్టీని నిషేధించడం జరిగింది. పార్టీ చిహ్నం లేకుండా ఆయన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడం, అందులో ఎక్కువ మంది విజయాలు సాధించడం జరిగింది. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇక మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఇమ్రాన్ పార్టీ తర్వాత రెండవ స్థానంలో ఉంది కానీ, పూర్తి మెజారిటీ రానందువల్ల అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో లేదు. దానికి సైనిక వ్యవస్థ అండదండలున్నాయి. ఇతర పార్టీలతో పొత్తు కుదర్చుకుని అధికారంలోకి రావడానికి వీలైనంతగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికలు పూర్తయి మూడు వారాలు గడిచిపోయినా అక్కడ ఇంతవరకూ ప్రభుత్వమంటూ ఏర్పాటు కాలేదు. ఈలోగా ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతోనూ, ఇతర చిన్నా చితకా పార్టీలతోనూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నవాబ్ షరీఫ్ తమ్ముడు, ప్రస్తుత ప్రధాని అయిన షెహబాజ్ షరీఫ్ అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. 2022లో ఆయన పార్టీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా గద్దె దించి అధికారంలోకి రావడం జరిగింది. నవాజ్ షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కాగా, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత, మాజీ దేశాధ్యక్షుడు అయిన ఆసిఫ్ అలీ జర్దారీ ప్రస్తుత అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ స్థానంలో మళ్లీ దేశాధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వానికి సైన్యాధికారులు పూర్తి స్థాయిలో మద్దతునివ్వడం జరుగుతుంది. అయితే, తాము ప్రతిపక్షంలోనే ఉండి, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటామని, తమపై మోపిన ఆరోపణలను న్యాయస్థానాల్లో సవాలు చేస్తూ ఉంటామని ఇమ్రాన్ పార్టీ ప్రకటించింది.

ఏ విధంగా చూసినా గత ప్రభుత్వానికి, ఇప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వానికి మధ్య తేడా ఏమీ కనిపించడం లేదు. ఒక ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ జనాకర్షణ క్రమంగా తగ్గిపోతోంది. ఆయనను ప్రధానిగా గుర్తించడానికి కూడా దేశ ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి దాదాపు అడుగుకు చేరిపోయింది. ద్రవ్యోల్బణం కనీ వినీ ఎరుగని స్థాయిలో 30 శాతానికి చేరుకుంది. గత ఏడాది చివరలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్) ఇచ్చిన 300 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం తప్ప పాకిస్థాన్ ఖజానాలో చిల్లి గవ్వ లేదు. విదేశీ మారక నిల్వలు కూడా 820 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఇవి ఎగుమతులు, దిగుమతుల చెల్లింపులకు ఏమాత్రం సరిపోవు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి మరింత ఆర్థిక సహాయం పొందడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ ఐ.ఎం.ఎఫ్ పాకిస్థాన్ కు మరోసారి ఆర్థిక సహాయం అందించినప్పటికీ, దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. ప్రస్తుతం ఇది 7,000 కోట్ల డాలర్ల రుణాన్ని తీర్చాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా, పాకిస్థాన్ కు పొరుగు దేశమైన అఫ్ఘానిస్థాన్ నుంచి అనేక విధాలుగా ప్రమాదం పొంచి ఉంది. ఏదో విధంగా యథాతథ స్థితిని కొనసాగించి ముందు ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు భావిస్తున్నాయి. సైనికాధికారులు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. అయితే, యథాతథ స్థితి కొనసాగడానికి దేశ ప్రజలు మాత్రం ఇష్టపడడం లేదు. ఇక ఇమ్రాన్ ఖాన్ ను, ఆయన పార్టీని పక్కనపెట్టడానికి సైనిక వ్యవస్థ విశ్వ ప్రయత్నం చేస్తోంది కానీ, అటువంటిది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒక పక్క రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ, మరొకపక్క సైన్యాధికారుల అడుగులకు మడుగులొత్తుతూ, ఇంకొక పక్క దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ షెహబాజ్ షరీష్ ఏ విధంగా పాలన సాగిస్తారన్నది ఆశ్చర్యకర విషయమే. ముళ్ల కిరీటంతో, ముళ్ల బాటలో నడవడం అంత తేలికేమీ కాదని ఆయనకు ఇప్పటికే తెలిసి ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News