Thursday, July 4, 2024
Homeఓపన్ పేజ్Pakistan: అంతూ పొంతూ లేని పాకిస్థాన్‌ అకృత్యాలు

Pakistan: అంతూ పొంతూ లేని పాకిస్థాన్‌ అకృత్యాలు

మతపరంగా మైనారిటీలపై దాడులు చేస్తున్న దాయాది దేశం

అల్ప సంఖ్యాక వర్గాల పట్ల పాకిస్థాన్‌ మొదటి నుంచీ దుర్మార్గంగానే వ్యవహరిస్తూ వస్తోంది. తాజాగా, ఫైజలాబాద్‌లో ఇది చర్చిల మీదా, క్రైస్తవుల మీదా ఇటీవల దాడులకు పాల్పడడం జరిగింది. ఎవరో క్రైస్తవుడు జరాన్వాలాలో ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను దగ్ధం చేశాడనే ఆరోపణపై ఇక్కడ ఫైజలాబాద్‌లో చర్చిల మీద దాడులు జరిపారు.మతపరమైన వ్యవహారాల విషయంలో పాకిస్థాన్‌ ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నదీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు బలూచిస్థాన్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒక క్రైస్తవుడు దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణపై అతన్ని కాల్చి చంపడం జరిగింది. పంజాబ్‌లో ఒక వ్యక్తి ఖురాన్‌ను చించినందుకు గత ఫిబ్రవరిలో అతన్ని రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. దైవ దూషణకు పాల్పడినవారిని శిక్షించే బాధ్యతను జనం తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు అధికారులు, పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. జరాన్వాలా సంఘటన జరిగినప్పుడు కూడా పోలీసులు నెమ్మదిగా రంగ ప్రవేశం చేయడాన్ని బట్టి, ఇందులో పోలీసులకు కూడా హస్తం ఉందని, ప్రభుత్వం ఇటువంటివాటికి పరోక్షంగా సహకరిస్తోందని అర్థం అవుతోంది.
వ దూషణ పేరుతో అల్ప సంఖ్యాక వర్గాలను జనం శిక్షిస్తున్నప్పుడు అధికారులు మౌనం వహించడం అనేదిఇప్పుడు పాకిస్థాన్‌లో ఒక విధానంగా మారిపోయింది. ఒక్క దైవ దూషణ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా అల్పసంఖ్యాక వర్గాలపై జనం దాడులు చేస్తున్నప్పుడు అధికారుల్లో ఉలుకూ పలుకూ ఉండడం లేదు. నిజానికి, పాకిస్థాన్‌లో దైవ దూషణ అనేది మరణశిక్షకు అర్హమైన నేరం. అయితే, ఇంతవరకూ ఇక్కడ దైవదూషణకు ఎవరికీ మరణ శిక్ష విధించడం జరగలేదు. కానీ, దైవ దూషణ అనే ఆరోపణను లేదా నేరాన్ని అడ్డం పెట్టుకుని అల్ప సంఖ్యాక వర్గాలపై దాడులు చేయడం పాకిస్థాన్‌లో క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇందులో ఉగ్రవాద సంస్థల ప్రమేయం కూడా ఉంటోంది.
ఇస్లామాబాద్‌లోని రెలిజియస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ అందజేసిన వివరాల ప్రకారం, హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన 89 మందిని ఈ మధ్య కాలంలో ముస్లిం తీవ్రవాదులు దారుణంగా చంపేయడం జరిగింది.ఇందులో 18 మంది మహిళలు కూడా ఉన్నారు.1947 నుంచి ఇప్పటి వరకూ సుమారు 1,500 దైవ దూషణ కేసులు నమోదయ్యాయి.గత దశాబ్ద కాలం నుంచి ఈ దైవ దూషణ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో దైవ దూషణ చట్టాలను తీవ్ర స్థాయిలో దుర్వినియోగం చేస్తుండడం పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, న్యాయవ్యవస్థలు, పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దైవ దూషణకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసినవారికి కఠిన శిక్షలు విధించే విధంగా పాకిస్థాన్‌ పార్లమెంట్‌ చట్టాలను రూపొందించాలని ఇటీవల ఇస్లామాబాద్‌ హైకోర్టు కూడా సూచించింది. దేశంలో ఈ దైవ దూషణ పేరుతో ఆగడాలు, అకృత్యాలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి ఇంతవరకూ స్పందన కనిపించలేదు.
పైగా, మహమ్మద్‌ ప్రవక్తను గానీ, ఆయనకుటుంబ సభ్యులను గానీ, నలుగురు ఖలీఫాలను గానీ, వారికి సన్నిహితులను గానీ ఎవరైనా దూషించినా, కించపరిచే విధంగా మాట్లాడినా వారికి మరింతగా కఠిన శిక్షలు విధించే విధంగా గత ఆగస్టులో పార్లమెంట్‌లో ఒకబిల్లు ఆమోదం పొందింది. ఇస్లామాబాద్‌ హైకోర్టు సూచనలను పాకిస్థాన్‌ పార్లమెంట్‌ ఏ మాత్రం ఖాతరు చేయలేదు సరికదా, ఈ చట్టాలను మరింతగా కఠినం చేయడం పౌర హక్కుల సంఘాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా, ఈ చట్టాలు అల్లరి మూకలకు, సంఘ వ్యతిరేక శక్తులకు, ఉగ్రవాదులకు మరింత ధైర్యాన్నిచ్చాయి. ఆ కారణంగానే ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని అల్పసంఖ్యాక వర్గాల మీద మరింతగా దాడులకు తెగబడడం జరుగుతోంది. నిజానికి, ఆధునిక దేశంలో ఇటువంటి వలసవాద చట్టాలకు స్థానం ఉండకూడదు. మతాన్ని అడ్డుపెట్టుకుని, తమ ప్రయోజనాలను పెంచుకోవడానికి అలవాటుపడ్డ వర్గాలున్న పాకిస్థాన్‌లో అసలు సమస్యను పరిష్కరించే అవకాశమే లేదు. దైవ దూషణ పేరుతో ఇతర మతస్థులపై దాడులు జరపడాన్ని అధికారులు నిరోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ధోరణి దీర్ఘకాలంలో పాకిస్థాన్‌కు తీరని నష్టాన్ని కలగజేస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News