జీవితంలో ఎప్పుడో గానీ ఇటువంటి అరుదైన నవల తటస్థపడదు. సాహితీ గ్రంథాల పట్ల, ముఖ్యంగా గ్రంథ పఠనం పట్ల ఆసక్తి ఉన్నవారిలో ఎక్కువ మంది సాధారణంగా ఇటువంటి గ్రంథం కోసమే ఎదు రు చూస్తుంటారనడంలో సందేహం లేదు. రావూరి భరద్వాజ రాసిన ‘పాకుడు రాళ్లు’ అనే నవల పాఠకుల్ని కనీసం మూడుసార్లు చదివిస్తుంది. నిజానికి అది తక్కువేనని చెప్పవచ్చు. ఈ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నా, జ్ఞానపీఠ్ అవార్డు లభించిందన్నా అందులో ఆశ్చర్యమేమీ లేదు. చలన చిత్ర మాయా ప్రపంచంలోని పాత్రల గురించి, పాత్రధారుల గురించి పాకుడు రాళ్లు నవలలో రచయిత చెప్పినంత పసందుగా, కళ్లకు కట్టించినట్టుగా మరెవరూ చెప్పలేరు. సుమారు పాతికే ళ్ల క్రితం రావూరి భరద్వాజ కలం నుంచి జాలువారిని ఈ అపురూప, అద్భుత నవలా రాజానికి మొద ట్లో భరద్వాజ పెట్టిన పేరు ’మాయా జలతారు. అయితే, శీలా వీర్రాజు ఈ పుస్తకానికి ’పాకుడు రాళ్లు’ అనే పేరైతే బాగా నప్పుతుందని భావించి, పేరును మార్పించారు. పుస్తకాన్ని ఆసాంతం చదివినవాళ్లకు కూడా శీలా వీర్రాజు పెట్టిన పేరే ఈ నవలకు సరిపోతుందనే అభిప్రాయం కలగక మానదు.
ఈ నవలలోని కొన్ని భాగాలు అప్పుడప్పుడూ ’కృష్ణాపత్రిక’లో కనిపించేవి. వాటిని చదివినవారంతా ఈ నవల సమగ్రంగా రూపు దిద్దుకుని తమ ముందుకు రావడం కోసం ఎదురు చూశారు. సమగ్రంగా చదివినప్పుడు ఆ ఆనందమే వేరు. ఒక చేయి తిరిగిన రచయితగా, సాహితీవేత్తగా తెలుగు చలన చిత్ర రంగంతో పరిచయమున్న రావూరి భరద్వాజ తెర ముందు ఆనందాన్ని పంచే, వినోదంలో ముంచె త్తే వెండి తెర గురించే కాక, తెరవెనుక విషాదాన్ని నింపే కథలు, గాథలు, సన్నివేశాలు, పాత్రలు, పాత్ర ధారుల గురించి కూడా ఇందులో కళ్లకు కట్టించారు. ఒక సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకు లు చూసి ఆనందించడం సహజమే. అయితే, ఆ సినిమాను నిర్మించడం వెనుక ఉన్న కష్టాన్ని, శ్రమను ఎవరూ పట్టించుకోరు. సినిమా వెనుక ఉన్న చరిత్రను యథాతథంగానే అయినా, అపురూపంగా, అద్భు తంగా మలిచారు రావూరి భరద్వాజ. సినిమా తెర వెనుక గురించి ఏ సన్నివేశం రాసినా, ఏ సందర్భాన్ని ఉటంకించినా రచయిత తన బాధను కూడా బయటపెడుతుంటారు. ఇది ఈ విధంగా జరగకపోయి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం అంతర్లీనంగా కనిపిస్తుంటుంది.
మొత్తానికి సినిమా రంగమనేది మనం బయట నుంచి అనుకున్నంత రోజాపూల పాన్పు కాదని, దీని వెనుక కఠినమైన ముళ్లు, విషపు ముళ్లు ఎన్నో ఉన్నాయని ఈ నవల ద్వారా అర్థమవుతుంది. దాదాపు తొంభై శాతం అవాంఛనీయ శక్తులే సినిమా రంగంలో అడుగడుగున్నా తారసపడుతుంటాయని ఆయ న అందరికీ కనువిప్పు కలిగించారు. దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్లు వంటి కీలక వ్యక్తులు మిన హా, కింది స్థాయి నటులు, ఆ తర్వాత సహనటులు, ఎక్స్ట్రాలు పడే పాట్లు చూస్తే ఈ సినిమా ప్రపంచ ౦ నిజంగానే మాయా జలతారు అనీ, పాకుడు రాళ్ల కంటే హీనమనీ తోచక మానదు. తెర వెనుక కారు చీకటిలో మగ్గిపోతున్న ఎక్స్ట్రాల వాస్తవిక సంఘటనలను పరిశీలించి, సేకరించి, గుదిగుచ్చి పాఠకుల ముందుంచారు రచయిత. నిజానికి, చలన చిత్ర రంగంలో రచయితలకు కొదవుండదు. తెర వెనుక జరుగుతున్న అవాంఛనీయ, నిర్దాక్షిణ్య సంఘటనలు, సన్నివేశాలు అక్కడి రచయితలకు తెలియనివి కావు. అయితే, ఈ రంగంలోని వారే అయినందువల్ల, ఈ రంగంతో వారి జీవితాలు ముడిపడి ఉన్నా యి కనుక, వారు ఈ సంఘటనలను బయటపెట్టే ధైర్యం చేయరు. వారు సినిమా రంగ గ్లామరే కాక, తమ గ్లామర్ను కూడా కాపాడుకోవడానికి తంటాలు పడుతుంటారు.
అయితే, రావూరి భరద్వాజకు ఈ పైపై మెరుపులు అవసరం లేదు. గ్లామర్తో పనిలేదు. ధైర్యానికి లోటు లేదు. అన్నిటికీ మించి, సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు దానిని పదిమంది దృష్టికీ తీ సుకు రాకుండా, వేలెత్తి చూపించకుండా, తనకెందుకు లెమ్మని ఊరుకునే మనస్తత్వం కాదు ఆయనది. సామాజి స్పృహ కలిగిన భరద్వాజ, సమాజం పట్ల బాధ్యతతో సినీ జగత్తు బండారాన్ని బద్దలు చేశారు. గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి వారు సమాజంలోని కుళ్లును చూసీ చూడకుండా వదిలేశారా? సమాజం నుంచి ఎటువంటి స్పందన వస్తుందోనని భయపడ్డా రా? వారు ఈ విషయంలో జంకి ఉంటే తెలుగు సమాజం అధోగతిలోనే ఉండేది. రావూరి భరద్వాజ కూడా అంతే. తాను పనిచేస్తున్న సినీ రంగంలోని అసలు విషయాలను తాను బయటపెడితే తన జీవన మే దుంపనాశనమైపోతుందని ఆయన అనుకోలేదు. అందుకు ఏమాత్రం భయపడలేదు. నిజానికి, సిని మా రంగ తెరవెనుక విశేషాల గురించి, చీకటి వ్యవహారాల గురించి విడి విడిగా ఎన్నో కథలు వచ్చి ఉం టాయి కానీ, అవన్నీ ఒక సమగ్ర నవలా రూపాన్ని సంతరించుకోవడం మాత్రం ’పాకుడు రాళ్లు’ ద్వారా నే జరిగింది. సినిమా రంగాన్ని ఒక అద్భుత జగత్తుగానూ, ఒక స్వర్గం గానూ, అందులోని నటులను ఇ లవేల్పులుగానూ ఊహించుకుని ఆనందపడిపోతున్న సినిమా ప్రేక్షకులు, అభిమానులు తప్పకుండా ఈ గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదవాల్సి ఉంది.
– జి. రాజశుక