స్వేచ్ఛా స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హన్మకొండ జిల్లా పరకాలలో జరిగిన పోరాటం చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుంది. మరో జలియన్ వాలా బాగ్ పోరాటంగా చరిత్ర పుటల్లోనూ పరకాల పేరు తెచ్చుకుంది. అజ్ఞాతంలోకి వెళ్లిన నాయకుల పిలుపు మేరకు గ్రామాలలో నిజాం నిరంకుశ పాలన రజాకార్లు బెదిరిస్తూ ప్రజలు త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. ఆ కార్యక్రమానికి 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. పరకాలకి సుమారు ఐదు కిలోమీటర్ల పొడవు ఊరేగింపు సాగింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో కలపాలి అంటూ నినాదాలు చేశారు. వందే మాతరం అంటూ ర్యాలీ కొనసాగింది. అదే సమయములో రజాకార్లు పట్టరాని కోపమును చూపి మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన వారిని చెట్టుకు కట్టేసి దారుణంగా చంపారు. ఆ సమయములో తెలంగాణ సాయుధ పోరాట వీరులు పరకాల పక్కన ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం పక్కన ఉన్న చంద్రగిరి గుట్ట దగ్గర సాయుధ పోరాటం జరిపారు. మందుగుండు సామాగ్రి, తపంచాలతో తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా రజాకార్లు వీరిని వదిలి పెట్టలేదు. వీరి శిబిరాలపై తరచూ దాడులు చేస్తూనే ఉన్నారు. చివరగా 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభుత్వం లొంగిపోవడంతో ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఆ మట్టి.. రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం! నిరంకుశ నిజాం నుంచి సాతంత్య్రాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి సాక్ష్యం! అదే.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన! సరిగ్గా 76 ఏళ్ల క్రితం.. 1947లో ఇదే రోజున (సెప్టెంబరు2న) జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో హాజరైన ప్రజలపై రజాకార్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. నాటి ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు! 19 ఏళ్లక్రితం అమరుల స్మారకార్థం ఊచకోత జరిగిన ప్రాంతంలో అప్పటి బీజేపీ నేత, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రమంత్రి హోదాలో అమర ధామాన్ని నిర్మించారు. ఏటా సెప్టెంబరు 2న అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విలేఖరులు నాటి ఘటనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తుంటారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణములో తహసిల్ రోడ్‌లో అమరదామం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రజకార్ల చేతిలో చంపపడిన వారి శిల్పాలు వరుస క్రమంలో అమర్చినారు. చేతులు పిడికిలి ఎత్తి, ఒక చేతిలో కర్ర పట్టి పోరాటానికి పయనిస్తూ వున్నట్లు వుంటాయి. గుమ్మటంపై భాగాన చెట్టుకి కట్టి చంపిన దృశ్యాలు, వారి దేహం నుండి తూట తగిలి రక్తం కారడం, కాళ్లు తెగిపడిన ఘటన ఒళ్లు జలధరిస్తుంది. ఆ శిల్పాలు, మట్టి మనుషుల బొమ్మలు చూస్తే నరనరాన ఆవేశం పొంగిపొర్లుతుంది. యుద్ధంకి సై అన్నట్లు భావన కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధూమ్ -దాంలకు, ఆటపాటలకు వేదికగా నిలిచింది. కొన్ని విప్లవ సినిమాల, సీరియళ్ల షూటింగులకు నిలయంగా మారింది. పర్యాటకులు వందల సంఖ్యలో నిత్యం దర్శిoచుకుంటున్నారు. అమరధామం పక్కనున్న పార్క్‌లో వివిధ రకాల మొక్కలు పచ్చదనంతో నిండి స్వచ్ఛమైన గాలిని అందిస్తూ వున్నాయి. పట్టణ వాసులు ఉదయం, సాయంత్రం ఈ పార్క్‌కి వచ్చి సేదతీరుతున్నారు. పరకాల మట్టి వాసన అందరిలో వీరత్వానికి సంకేతంగా నిలుస్తుంది. పరకాల ఊచకోతలో అసువులు భాసినవారు రంగాపూర్ (మొగుళ్ల పల్లి మండలం), కానిపర్తి( రేగొండ) వారుగా చరిత్ర తెలుపుతూ వుంది. అమరవీరుల ఆశయలను కొనసాగించుదాం. వారి బాటలో పయనిద్దాం. వారి త్యాగాలను స్మరించుకుందాం. భావితరాలకు వారి పోరాట పటిమను తెలుపుదాం. అమరధామంని మరింత అభివృద్ధి చేయాలి. నేటితరం విద్యార్థులు అమరధామం గూర్చి తెలుసుకోవాలి.
కామిడి సతీష్ రెడ్డి
- 9848445134
(నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవం)