ఎప్పుడూ సంతోషంగా ఉండే తల్లిదండ్రులే ఎప్పుడూ ఆనందంగా ఉండే తరాన్ని భవిష్యత్తుకు అందించగలరు. ఒత్తిడికి లోనుకాని తల్లిదండ్రులే ఒత్తిడికి తావు లేని జీవితాలను జీవించేలా తమ పిల్లలను మలచగలరు. అంతేకాదు వీళ్లే ఏ విషయాన్నయినా తమ పిల్లలతో సులభంగా పంచుకోగలరు కూడా. ఎప్పుడూ ఒత్తిడిగా ఉండే, చిరాకును ప్రదర్శించే తల్లిదండ్రుల ముందు చిన్నారులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను అస్సలు వ్యక్తంచేయరు. వారితో మాట్లాడరు.
తల్లిదండ్రులు ఒత్తిడిగా ఉండడానికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. వారిలోని నెగిటివ్ ఆలోచనాధోరణి ఇందుకు కారణం కావొచ్చు. ఇలాంటి అమ్మానాన్నలు పిల్లల ముందు తమ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంటారు. ఇది కూడా ఒత్తిడి లోంచి పుట్టుకొచ్చిన గుణమే. పిల్లలతో మాట్లాడేటప్పుడు సైతం కొందరు పేరెంట్స్ సమాజంలోని తమ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేలా వ్యవహరిస్తుంటారు. వీరికి తమ పిల్లలతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఇలాంటి పేరెంట్స్ తమ పిల్లల్లో మంచిని పట్టుకోవడం కన్నా వారిలోని తప్పులను ఎత్తిచూపుతుంటారు. పిల్లలకు ఏ విషయాన్నయినా అర్థమయ్యేలా చెప్పడం ఒక కళ.
ఒత్తిడి కారణంగానే ఇలాంటి అలవాటు తల్లిదండ్రుల్లో కనిపించదు. అంతేకాదు తమలోని తప్పులను పిల్లల ముందు ఒప్పుకోవడానికి అంగీకరించని తల్లిదండ్రులు కూడా ఉంటారు. వీరి ధోరణి చిన్నారుల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలపై ఎక్కువ ఎక్సెపెక్టేషన్లు పెంచుకుంటారు. వాటిని చేరకపోతే వారిని విసుక్కోవడంతో పాటు తోటి పిల్లలతో పోలుస్తుంటారు. అవమానిస్తుంటారు. దీన్ని పసి పిల్లల మనసులు సహించలేవు. ఎప్పుడూ పిల్లలు గతాన్ని పట్టుకుని ఊగులాడరు. వర్తమానమే వారి ప్రపంచం. కానీ తల్లిదండ్రులు గతాన్ని తలచుకుంటూ జీవిస్తుంటారు. ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య పెద్ద అగాధాన్నే స్రుష్టిస్తుంది. అందుకే పిల్లలు ఏదైనా చెపుతున్నా కూడా ఇలాంటి తల్లిదండ్రులు అర్థంచేసుకోరు. కనీసం వారి మాటలనైనా ఓర్పుగా వినరు. పేరెంట్స్ పిల్లల కోసం వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. ‘నీకేం తెలియదు’, ‘నువ్వు దేనికీ పనికిరావు’ లాంటి మాటలను వీళ్లు పిల్లల ముందు అలవోకగా, ఆలోచనారహితంగా అనేస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పసిపిల్ల మనసులను ఈ మాటలు ఎంతో కష్టపెడతాయి. ఆ గాయం ఆ చిన్ని మనసుల నుంచి తొందరగా పోదు. అందుకే పేరెంట్స్ నెగిటివ్ ధోరణికి స్వస్తిచెప్పాలి.
ముఖ్యంగా పిల్లల ముందు పాజిటివ్ మైండ్స్ తో మాట్లాడాలి. వారి మాటలు పిల్లలను
ప్రోత్సహించేలా ఉండాలే తప్ప నిరుత్సాహపరచకూడదు. ఇంకొకటేమిటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు తమ తప్పులను ఒప్పుకోగలగడం నిజంగా ఎంతో వివేకవంతమైన లక్షణం. ఈ గుణం వల్ల పేరెంట్స్ మానసిక ఒత్తిడి నుంచి సులభంగా బయటపడతారు. అంతేకాదు ఈ ప్రవర్తన పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల ఎంతో గౌరవాన్ని పెంచుతుంది. అలా కాకుండా అమ్మానాన్నలు తమ తప్పులను ఒప్పుకోకుండా మొండిగా వ్యవహరిస్తే పిల్లలు కూడా వారిలా తయారయ్యే అవకాశం ఉంది.
అలాగే మాటి మాటికీ పిల్లల్లో తప్పులు ఎత్తిచూపుతుంటే తల్లిదండ్రుల్లోనే కాదు వారి పిల్లల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలు పెరిగే కొద్దీ ఆ ఒత్తిడి వారి వ్యక్తిత్వంపై, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లోని చెడును కన్నా వారిలోని మంచి గుణాలను హైలైట్ చేస్తే పిల్లలూ సంతోషపడతారు. తల్లిదండ్రులూ సంతోషంగా ఉంటారు. పిల్లలు పెరిగే కొద్దీ చక్కటి వ్యక్తిత్వం కలవారిగా తయారవుతారు. సమాజంలో తమ ఇమేజ్ ని తలచుకుంటూ ప్రవర్తించే పేరెంట్స్ మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లల ముందు అన్నీ మరిచిపోయి స్వచ్ఛమైన ప్రవర్తనతో పేరెంట్స్ మసలితే పిల్లలకు వాళ్లు రోల్ మోడల్స్ అవుతారు. అలాగే పిల్లలతో పేరెంట్స్ ప్రేమగా మాట్లాడాలే తప్ప ఆధిపత్య ధోరణిని వారిపై ప్రదర్శించకూడదు. ఎందుకంటే అలాంటి అమ్మానాన్నలను పిల్లలు మెచ్చరు. ఒత్తిడి కారణంగా కూడా తల్లిదండ్రులు పిల్లల పట్ల కమాండింగ్ గా వ్యవహరిస్తుంటారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారితో మాట్లాడడం తల్లిదండ్రులకు అద్భుతమైన అనుభవాలను పంచుతాయి. జీవితాంతం తీపి జ్ఘాపకాలుగా మిగులుతాయి. దీని వల్ల తమలోని ఒత్తిడిని సైతం వీళ్లు అధిగమించగలరు.
పిల్లలకు ఏదైనా చెప్పాల్సి వస్తే విసుక్కోకుండా వారి స్థాయికి దిగి వారికి అర్థమయ్యేలా పేరెంట్స్ చెప్పాలి. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడే వారి మధ్య బంధం బలపడుతుంది. ఒకరినొకరు చక్కగా అర్థంచేసుకోగలుగుతారు. ఒత్తిడిని సులభంగా పోగొట్టుకోగలుగుతారు. లేకపోతే పిల్లలు చెపుతున్న మాటలు తల్లిదండ్రులకు అర్థం కాదు. తల్లిదండ్రుల మాటలు పిల్లల బుర్రలకు ఎక్కవు. చివరకు పిల్లలు, తల్లిదండ్రులూ ఇద్దరూ ఒత్తిడి బారిన పడతారు. అందుకే ఉద్యోగాలతో తల్లిదండ్రులు బిజీగా ఉన్నా పిల్లల కోసం నిత్యం నాణ్యమైన సమయాన్ని గడపాలి. అప్పుడు వాళ్లు ఒకరికొకరు మానసికంగా దగ్గర కాగలుగుతారు. పిల్లలు తాము ఆశించినది సాధించాలన్న ధోరణిని చాలామంది పేరెంట్స్ ప్రదర్శిస్తుంటారు. అది సాధించకపోతే సూటిపోటి మాటలతో పిల్లలను బాధపెడతారు. అందుకే తల్లిదండ్రులు ఎలాంటి ఎక్సెపెక్టేషన్స్ పెట్టుకోకుండా పిల్లలతో హాయిగా మాట్లాడడం అలవరుచుకోవాలి. అప్పుడు వారిరువురి మధ్య ప్రేమ తప్ప ఎలాంటి ఎక్స్
పెక్టేషన్స్ కు తావు ఉండదు. ఒత్తిడి వారి దరిచేరదు!