Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Parliament: పార్లమెంట్‌ సమావేశాలకు ప్రతి రోజూ గ్రహణమే!

Parliament: పార్లమెంట్‌ సమావేశాలకు ప్రతి రోజూ గ్రహణమే!

పార్లమెంట్‌ ఉభయ సభలు స్తంభించపోవడమన్నది గత కొన్నేళ్లుగా దాదాపు నిత్యకృత్యమైపోయింది. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన గందరగోళాలు, ప్రతిష్టంభనలు ఎల్‌.డి.ఎ హయాంలో కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితికి పాలక, ప్రతిపక్షాలు రెండూ కారణమేననడంలో సందేహం లేదు. ఈసారి కూడా పాలక, ప్రతిపక్షాల మధ్య చోటు చేసుకున్న వాదోపవాదాల కారణంగా పార్లమెంట్‌ స్తంభించిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడవ స్తంభం లాంటి శాసన వ్యవస్థ దాదాపు కుప్పకూలిపోతోందంటే నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. చట్ట సంబంధమైన కార్యకలాపాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ప్రజా సమస్యలను చర్చించి పరిష్కారం కనుగొనాల్సిన అత్యున్నత జాతీయ వేదిక తనలక్ష్యం నుంచి దారి మళ్లింది. ప్రజాప్రతినిధులకు నిలయమైన పార్లమెంట్‌ లో పాలక, ప్రతిపక్షాలు సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేసి దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. అయితే, ఈసారి పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌తో సహా అనేక అతి ముఖ్యమైన బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. చర్చ కాదు కదా, కనీసం వాటిని ప్రవేశపెట్టడానికి, ప్రస్తావించడానికి కూడా అవకాశం లేకుండాపోయింది.
పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత 75 రోజుల్లోగా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. బడ్జెట్‌పై చర్చించి ఆమోదించడమనేది పాలక పక్షానికి ఎంత ముఖ్యమో ప్రతిపక్షాలకు కూడా అంతే ముఖ్యం. ఎటువంటి పరిస్థితుల్లోనూ బడ్డెజ్‌ లేదా ఫైనాన్స్‌ బిల్లుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, ఆమోదించాల్సి ఉంటుంది. తమకు ఈ బడ్జెట్‌తో , ఇతర ఆర్థిక సంబంధమైన బిల్లులతో సమస్యేమీ లేదని, వాటిపై చర్చించడానికి, ఆమోదింపజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే, ముందుగా అదానీ గ్రూప్‌ షేర్ల కుంభకోణాల మీదా, ప్రతిపక్షాలపై నిఘా సంస్థలను ఉసిగొల్పడం మీదా చర్చించడానికి కేంద్రం అవకాశం కల్పించాలని అవి పట్టుబడుతున్నాయి. గతంలో అనేక ప్రభుత్వాలు ఆర్థిక సంబంధమైన కుంభకోణాల మీద సభల్లో చర్చలకు అనుమతించాయని, ఉమ్మడి పార్లమెంటరీ కమిటీలతో దర్యాప్తు జరిపాయని అవి గుర్తు చేశాయి.
సమన్వయం, సామరస్యం మృగ్యం
ఈ కుంభకోణం మీదా, ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ‘దుర్వినియోగం’ చేయడం మీదా చర్చించాలని తాము నోటీసులు ఇచ్చినా వాటికి ప్రభుత్వం నుంచి స్పందన లభించడం లేదని ప్రతిపక్ష నాయకులు వాదిస్తున్నారు. ఈ ధోరణికి వ్యతిరేకంగానే తాము పార్లమెంట్‌లో ధర్నాలు, బైఠాయింపులు చేపట్టినట్టు వారు చెబుతున్నారు. తమ నోటీసులకు కేంద్ర ఆమోదం లభించనందువల్లే పార్లమెంట్‌ బయట కూడా తాము ధర్నాకు దిగినట్టు అవి తెలిపాయి. అయితే, కేంద్రం వాదన మరో విధంగా ఉంది. అదానీ గ్రూప్‌ వ్యవహారంపై చర్చించడానికి తమకేమీ అభ్యంతరం లేదనీ, అయితే, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందువల్ల దీనిపై పార్లమెంట్‌లో చర్చించడం భావ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు దీనిపై దర్యాప్తునకు ఒక ప్యానెల్‌ను నియమించిన విషయాన్ని కూడా కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌ తన నిర్ణయాన్ని తెలియజేసే వరకూ ప్రతిపక్షాలు దీనిపై చర్చను కోరడం మంచిది కాదని, కొంత కాలం నిరీక్షించాలని అది కోరింది.
కాగా, ఒక విధంగా పాలక పక్షం కూడా ప్రతిపక్షాలపై ఎదురు దాడి ప్రారంభించింది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇటీవల ఇంగ్లండ్‌ వెళ్లి, భారత్‌పై చేసిన విమర్శలను అది ప్రస్తావిస్తూ, విదేశీ గడ్డపై విమర్శలు చేసినందుకు, దేశాన్ని అవమానించినందుకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.ఆయనను సభ నుంచి బహిష్కరించాలని కోరుతూ ఆయనపైన ఒక సభాహక్కుల నోటీసును కూడా జారీ చేసింది. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను చర్చించకుండా అడ్డుకోవడానికే పాలక పక్షం రాహుల్‌ గాంధీ గురించి చర్చిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల వాదోపవాదాలు ఇలా సాగుతుండగా, ఇతర ప్రతిపక్షాలు వీధులకెక్కి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నాయి. అదానీ వ్యవహారం విషయంలో అవి కాంగ్రెస్‌కు మద్దతు తెలియజేస్తున్నాయి కానీ, ప్రతిపక్ష నాయకులపై నిఘా సంస్థలను ప్రయోగిస్తున్నారనే ఆరోపణకు అవి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
సమయం వృథా, ఖర్చు వృథా
మొత్తం మీద పాలక, ప్రతిపక్షాలలో ఏదీ ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కనీసం పార్లమెంట్‌కు సంబంధించినంత వరకూ ఈ రెండు పక్షాల మధ్య సమన్వయం గానీ, సామరస్యం గానో చోటు చేసుకునే సూచనలు కూడా కనిపించడం లేదు. ఫలితంగా ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 2024 ఎన్నికలు జరిగే వరకూ అసలు ఏ పార్లమెంట్‌ సమావేశాలూ ప్రతిష్ఠంభన లేకుండా జరిగే అవకాశాలే లేవని కూడా చెప్పవచ్చు. పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ మీద ఈసారి ఇంతవరకూ 144 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనం ఖర్చయింది. అంటే, నిమిషానికి 2.5 లక్షల రూపాయల చొప్పున ఖర్చయిందన్నమాట. పార్లమెంట్‌ సభ్యుల అరుపులు, కేకలకు, నిర్హేతుక వాదోపవాదాలకు ఇంత ప్రజా ధనం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటని మేధావులు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. అసలు పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రయోజనమేమిటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో ఈసారి ప్రజా సమస్యలను చర్చించడానికి అవకాశం కలగనందువల్ల తాను రెండు నెలల జీతాన్ని వదులుకుంటున్నట్టు, ఇతర భత్యాలకు కూడా స్వస్తి చెబుతున్నట్టు బిజూ జనతా దళ్‌కు చెందిన ఎంపీ జై పాండ్యా ప్రకటించారు.
గత పదేళ్ల కాలంలో ఇంత తక్కువగా పార్లమెంట్‌ సమావేశాల్లో కార్యకలాపాలు జరగడం చాలా అరుదైన విషయమని కొందరు వ్యాఖ్యానించారు. ఈసారి పార్లమెంట్‌ సమావేశాల కాలంలో 90 గంటలకు పైగా నష్టం జరిగిందని, విలువైన పార్లమెంట్‌ సమావేశాల కాలం ఇలా వృథా కావడం ఆందోళన కలిగిస్తోందని మేధావులు భావిస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే దేశ ప్రజలకు ఎన్నికల మీదే కాకుండా ప్రజా ప్రతినిధుల మీదా, పార్లమెంటరీ వ్యవస్థ మీదా చివరికి ప్రజాస్వామ్యం మీద కూడా నమ్మకం పోయే ప్రమాదం ఉంది.
-కె. శ్యాంసుందర్‌, సీనియర్‌ జర్నలిస్టు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News