Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Parliament: ప్రజాస్వామ్య విధానాలకు గ్రహణం

Parliament: ప్రజాస్వామ్య విధానాలకు గ్రహణం

చర్చలు, వాదోపవాదాలు జరగకుండా పార్లమెంట్‌ సమావేశాలు నడవడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అవుతుంది. వివిధ పార్టీల మధ్య బయట ఉన్న విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో కూడా ప్రతి ఫలించడం వల్ల చర్చలు లేకుండా, అనేక అతి ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడానికి అవకాశం ఉంది. ఇది భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి గొడ్డలిపెట్టు అనడ డంలో సందేహం లేదు. విచిత్రమేమిటంటే, పార్లమెంట్‌లో వివిధ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును సోషల్‌ మీడియా ప్రచారాలు కూడా ఇతోధికంగా పెంచి పోషిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి అరుణ జైట్లీ ఒకసారి ఓ సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో జవాబు దారీతనం లేకపోవడం ఎంత పెద్ద నేరమో, చర్చలు లేకుండా బిల్లులను ఆమోదించడం కూడా అంతే నేరమని వ్యాఖ్యానించారు. జవాబుదారీతనం, చర్చలు కలిసి ప్రయాణిస్తున్నప్పుడే పార్లమెంట్‌ ప్రాధాన్యం పెరుగుతుంది.
విచిత్రమేమిటంటే, ఆయన మాటలను, సలహాలను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఆయన పార్టీ నాయకులు సైతం ఆ మాటలకు గౌరవం ఇవ్వలేదు. పార్లమెంట్‌కు సంబంధించిన వ్యవహారాలు నానాటికీ తీసికట్టుగా తయారవుతూ, అయేటికాయేడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిరసనలు, వాకౌట్లు, గందరగోళాలు, అర్ధంతర వాయిదాలతో ఇప్పటికే పార్లమెంట్‌ సమావేశ కాలం సగానికి సగం తగ్గిపోయింది. ప్రభుత్వం గందర గోళ దృశ్యాల మధ్య బిల్లులను ఆమోదించేస్తోంది. ప్రతిపక్షాలు కూడా కీలక బిల్లుల సమయంలో కూడా ఉభయ సభలు వాయిదా పడడానికి తమ శక్తియుక్తులన్నీ వెచ్చిస్తున్నాయి. పాలక, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదర్చడంలోనూ, ఏకాభిప్రాయాన్ని సాధించడంలోనూ, విభేదాలను తగ్గించడంలోనూ ‘బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ’ కూడా ఘోరంగా విఫలమవుతోం ది. ప్రతిపక్షాలు ఆటంకాలు, అవరోధాలు సృష్టిస్తున్నాయని, సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకుంటున్నాయని, ప్రజా ప్రాధాన్యం కలిగిన అంశాలపై కూడా చర్చ జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నాయని పాలక పక్షం ఆరోపిస్తోంది. కాగా, కీలక అంశాలపై చర్చ జరగకుండా పాలకపక్షమే అడ్డుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కూలంకషంగా చర్చలు జరపాలనే ఉద్దేశంతో తాము అనేక ప్రధానాంశాలను ప్రస్తావిస్తున్నామని, ప్రభుత్వం వాటన్నిటినీ నిర్మొహమాటంగా తిరస్కరిస్తోందని కూడా అవి విమర్శిస్తున్నాయి.
ఇటీవల అతి ముఖ్యమైన భారత-చైనా సరిహద్దు సమస్య చర్చకు వచ్చింది. పాలక, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శించుకోవడం ప్రారంభించాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం దారుణంగా నష్టపోవడం జరుగుతుంది. చర్చలు, వాదోపవాదాల వల్ల దేశ పౌరులు కూడా కీలక అంశాలను అర్థం చేసుకోగలుగుతారు. బిల్లులు, శాసనాలు, సభ్యుల అవగాహన, నాయకత్వాలకు సంబంధించి వారు కూడా క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠం అవుతుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఏడాదికి 120 రోజులకు తగ్గకుండా పార్లమెంట్‌ సమావేశాలు జరిగేవి. అవి ఇప్పుడు 64 రోజులకు పడిపోయింది. ఈ సమావేశాలు కూడా గందరగోళంగా ముగుస్తున్నాయి. అర్ధంతరంగా వాయిదా పడడం అనేది మరీ ఎక్కువైంది. ఇంతకు ముందు పార్లమెంట్‌ ఉభయ సభల్లో భిన్నాభిప్రాయాలు కనిపించేవి. ఇప్పుడు ఆ విభేదాలు పూర్తిగా వ్యక్తిగత విభేదాలుగా మారిపోయాయి.
ఇక పాలక, ప్రతిపక్షాలు మధ్య సమావేశం జరగడానికే అవకాశం లేకుండా పోతోంది. నిర్మాణాత్మక విమర్శలు విధ్వంసక, వ్యక్తిగత నిందలుగా పరిణామం చెం దాయి. విమర్శలు, ఆరోపణలలో కూడా నాణ్యత తగ్గిపోయి, జుగుప్సాకర దుర్భాషల స్థాయికి దిగజారిపోయాయి. ఈ కుళ్లును ఇప్పటికైనా తొల గించాల్సిన అగత్యం ఉంది. ఆరోగ్యకరమైన చర్చలు, వాదోపవాదాలు, వాదనలు మృగ్యమైతే, పార్లమెంటూ ఉండదు, ప్రజాస్వామ్యమూ ఉండదు. పార్లమెంట్‌ అనేది చర్చలకు, వాదనలకు నిలయమే కానీ, ఆటంకాలు, అవరోధాలు, గందరగోళాలకు నిలయం కాదు. పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించే బాధ్యత పాలక పక్షం మీదా ఉంది, ప్రతిపక్షం మీదా ఉంది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News