Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Parliament working hours: పార్టీలకు పట్టని పార్లమెంట్‌ సమయం

Parliament working hours: పార్టీలకు పట్టని పార్లమెంట్‌ సమయం

బహిరంగంగానే సభలో మతపరమైన వ్యాఖ్యలు చేయడమంటే పరాకాష్ట

రాజకీయ పార్టీలకు, వాటి నాయకులకు సమయం విలువ పట్టదు. వారి సమయాన్నే కాదు, ప్రజల విలువైన సమయాన్ని కూడా వృథా చేయడంలో వారికి వారే సాటి. తాము ప్రతినిధులుగా ఉన్న పార్లమెంట్‌ విలువైన సమయాన్ని ఇష్టం వచ్చినట్టు వృథా చేయడంలో, దుర్వినియోగం చేయడంలో వారు ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టిస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్‌లో చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయంటే, ఈ ప్రజా ప్రతినిధులను ఏమనాలి? కొత్త పార్లమెంట్‌ భవనంలోనైనా కొత్త చరిత్రను సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోదీ సభ్యులను అభ్యర్థించారు. ఆరోగ్యకరమైన చర్చలకు అవకాశమివ్వాలని, సమయం వృథా చేయవద్దని పదే పదే విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సభ్యులు చర్చించి, తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించి, ఆ తర్వాత దానికి ఏకగ్రీవంగా తమ ఆమోదం తెలిపిన ప్రతిపక్ష సభ్యులు కొత్త చరిత్రే సృష్టించారనిపించింది. కానీ, ఆ తర్వాత పాత చరిత్రే ఊపందుకుంది.
ప్రజాస్వామ్యానికి పునాది లాంటి పార్లమెంట్‌ పరువు ప్రతిష్టలు అధ్వాన స్థితికి దిగజారుతున్నా, తమ ప్రాతినిధ్యానికే విలువ లేకుండా పోతున్నా సభ్యులకు పట్టడం లేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సభ్యులు కులాలు, మతాలపరంగా కూడా విమర్శలు చేసుకోవడం ఎక్కువైంది. కొందరు లోక్‌ సభలో ఒక ప్రతిపక్ష మైనారిటీ సభ్యుడిపై విమర్శలు చేయగా, ప్రతిపక్ష సభ్యులు మెజారిటీ మతంపైనా, దేవుళ్లపైనా వ్యాఖ్యానాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తడం, అసలైన అంశాలపై చర్చ వెనుకపట్టు పట్టడాన్నిబట్టి సభ్యులకు ప్రజా సమస్యల మీద ఏమాత్రం గౌరవం, అక్కర ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభలో కూడా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి పాలక పక్షానికి ప్రేక్షకులు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై జేజేలు పలకడం పార్లమెంట్‌ ప్రతిష్టను మరింత దిగజార్చేదిగా ఉంది. పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య మతపరమైన విమర్శలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ సభ్యులు పార్లమెంట్‌ బయట దీని గురించే మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు సాగించడం నిజంగా దురదృష్టకరం.
అనవసర విమర్శలు చేసినందుకు, దుర్భాషలాడినందుకు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడానికి స్పీకర్‌ వెనుకాడేవారు కాదు. కానీ, ఈసారి అటువంటిదేమీ కనిపించలేదు. సభ్యులు బహిరంగంగానే లోక్‌ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేయడమన్నది పరాకాష్టగానే చెప్పుకోవాలి. రాజ్యసభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ప్రేక్షకులు జేజేలు పలకడంపై కొందరు సభ్యులు రాజ్యసభ చైర్మన్‌ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈసారి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంట్‌ హుందాతనాన్ని దిగజార్చే విధంగా ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకోవడం నిజంగా దిగ్భ్రాంతిని, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈసారి పార్లమెంట్‌ సమావేశాల్లో జరిగిన ప్రతి సంఘటన మీదా స్పీకర్‌ లేదా చైర్మన్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా సభ్యులను సస్పెండ్ చేయవలసి ఉంది.
అయిదు రోజుల ప్రత్యేక సమావేశాల కాలంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ తప్ప చెప్పుకోవాల్సిందేమీ కనిపించలేదు. ప్రధానమంత్రి ఆశించిన దానిలో ఒక్క శాతం కూడా నెరవేర లేదు. విలువైన పార్లమెంట్‌ సమావేశాల సమయాన్ని, వ్యయాన్ని సభ్యులు పనిగట్టుకుని వృథా చేసినట్టు కనిపించింది. ఇందుకు ప్రతిపక్ష సభ్యులతో పాటు పాలక పక్ష సభ్యులు కూడా పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచిత్రంగా చంద్రయాన్‌ విజయాన్ని కూడా సభ్యులు పక్షపాత ధోరణితోనే ప్రస్తావించడం జరిగింది. దేశహితానికి గానీ, ప్రజాహితానికి గానీ సభ్యులు విలువ నివ్వడమనేది చాలావరకు అంతరించిపోయినట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News