Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Parties strategy: అంపశయ్యపై రాజకీయ పార్టీలు

Parties strategy: అంపశయ్యపై రాజకీయ పార్టీలు

పార్టీలన్నిటిదీ ఒకే పరిస్థితి

రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు అంపశయ్యపై ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మినహా రాష్ట్రంలో అధికార పార్టీ అయిన వైసిపి, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంతో పాటు వామపక్ష పార్టీలు కూడా రానున్న 2024 ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాకపోతే ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో కొనసాగలేమని తుది నిర్ణయానికి వచ్చాయి. భవిష్యత్తు ఎన్నికల్లో మరోమారు అధికారం చేపట్టని పక్షంలో పార్టీ తీవ్ర సంక్షోభంలో పడిపోతుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీని పునాదులు లేకుండా తుదముట్టించడానికి టీడీపీ పెద్దలు అన్నిరకాల శక్తులను ప్రయోగించడం ఖాయం. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని కొంత ఇబ్బందికర పరిస్థితులను కల్పిస్తుంది. నియోజకవర్గాల్లో కొంత మంది నేతలను పోలీసుల సహాయంతో కేసుల్లో ఇరికించడం, తమ ప్రభుత్వంలో వారి పనులు కాకుండా అధికారులకు సూచనలు ఇవ్వటం వంటివి ఇప్పటిదాకా జరిగాయి. 2014 నుంచి 2019 వరకు తమను ఇబ్బందులకు గురి చేశారన్న కారణంగా వైసీపీ గత 2019 ఎన్నికలలో అధికారం చేపట్టాక నేరుగా వైసీపీ అధినాయకత్వమే రంగంలోకి దిగింది. ఒక బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలను భయపెట్టే తరహాలో వైసీపీ పెద్దలు పథక రచన చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కాకుండా వామపక్షాలు, జనసేన పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అంతెందుకు సొంత పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలను కూడా లెక్కపెట్ట లేదు. తమకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిస్తే అందరినీ ఇబ్బందులకు గురిచేశారు. ఒక్క రాజకీయ పక్షాలనే కాకుండా ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులను, పలు ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులను కూడా వదిలి పెట్టలేదు. తమకు వ్యతిరేకంగా ఉందన్న విషయం వైసీపీ పెద్దల దృష్టికి వస్తే చాలు వారిని లక్ష్యం చేసుకొని భయపెట్టేందుకు అనేక రకాల వ్యూహాలు రచించారు. వీరి చర్యలకు అతికొద్ది మంది మినహా పెద్ద సంఖ్యలో నాయకులు, అధికారులు మౌనం వహించారు. చివరకు సామాన్యుడు కూడా నోరు తెరిచేందుకు సాహసించడం లేదు. అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. పలు కోర్టు కేసుల్లో న్యాయమూర్తులు తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని సామాజిక మాధ్యమాల్లో వారిని కించపరిచే విధంగా కొందరు వైసీపీ అభిమానులు తూలనాడారు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బిజెపి నాయకులపై వైసిపి పెద్దలు దృష్టి సారించలేకపోయారు. లేని పక్షంలో వారిని కూడా వదిలేవారు కాదేమో. బిజెపితో సఖ్యత ఉన్నప్పటికీ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా వైసీపీ పెద్దలు పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా ఆయనను విమర్శించటమే కాకుండా ఆయన సినిమాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికారాన్ని ఉపయోగించుకొని సఫలీకృతులయ్యారు. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీస్తే నష్టం వస్తుందన్న అభిప్రాయాన్ని సినీ నిర్మాతల్లో కల్పించాలని ప్రయత్నించారు. వామపక్ష పార్టీల విషయంలో కూడా కఠినంగానే ప్రభుత్వం వ్యవహరించింది. ప్రజా సంఘాలు ఏ చిన్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా తక్షణం వారిని హౌస్‌ అరెస్టు పేరుతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో సరిపెట్టలేదు. వారిపై ఉన్న పాత కేసులను గుర్తు చేసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహించకుండా అడ్డుకోగలిగారు. ఇలా అనేక విధాలుగా అధికారాన్ని ఉపయోగించుకున్న వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడితే ఇప్పటి కంటే మూడింతల ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొనక తప్పదు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు అనేక మార్లు హెచ్చరించారు. తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు, అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌ లో రాస్తున్నామని పాదయాత్రలో లోకేష్‌ కూడా పేర్కొంటున్నారు. ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు టిడిపి పెట్టే ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొని పార్టీలో కొనసాగడం ఎంత కష్టమో తమకు తెలుసని ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తున్న దానికంటే రెట్టింపు ఇబ్బందులకు గురిచేయటం ఖాయం. ఆ ప్రభుత్వానికి కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎవరు అధికారంలోకి వచ్చి నా సహకరిస్తారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇబ్బందులు పడిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, పోలీసులు సంపూర్ణంగా సహకరిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉండి వైసీపీ చేసిన తప్పులు, పొరపాట్లు వంటి వాటికి సంబంధించిన అధికారిక సాక్ష్యాలు చేతిలో పెట్టుకొని అటు కోర్టుల్లో కేసులు దాఖలు చేయడం ఇటు సిఐడి, సిబిఐ వంటి సంస్థల విచారణల పేరుతో అవసరం ఉన్నా లేకపోయినా అరెస్టులు చేసి ఇరకాటంలో పెట్టడం తధ్యం. ప్రభుత్వ పెద్దలే కాకుండా నియోజకవర్గం, మండల స్థాయిలో కూడా అధికార పార్టీ నాయకులు గల్లీ లీడర్లను కూడా లక్ష్యంగా చేసుకొని ముందుకు పోవడం రానున్న రోజుల్లో చూడాల్సి వస్తుంది.
అన్ని అనుకూలించి వైసిపి మరో మారు అధికారంలోకి వస్తే టిడిపిలో ఒక్క నాయకుడు కూడా ఉండడు. ప్రస్తుతం కొన్ని విషయాల్లో వెనుకడుగు వేసినా మళ్లీ అధికారంలోకి వస్తే ఆలోచించే అవసరం ఉండదు. తమకు ఎదురు లేకుండా మార్గం సుగమం చేసుకోవడమే ఆ పార్టీ లక్ష్యం. అన్ని ఇబ్బందులను ఎదుర్కొనడం కన్నా రాజకీయాలకు దూరం కావటం లేదా వైసీపీలో చేరటం వంటి మార్గాలను ఎంచుకుంటారే కానీ టిడిపి కోసం మరో 5 ఏళ్ళు పనిచేసి నరకాన్ని చూడలేరు. జనసేన నేతలు సైతం మరో ఐదేళ్లు పోరాడి వైసీపీని ఎదుర్కొని తిరిగి అధికారంలోకి వస్తాం అన్న ఆశలు కోల్పోయి మౌనం వహిస్తారు. ఒకవేళ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాట పటిమను ప్రదర్శించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మూలాలు కోల్పోక తప్పదు. కేవలం పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే మాట్లాడి జనసేన ఆ తర్వాత కాలంలో అధికారం దక్కించుకోవడం సాధ్యం కాని పని. ఇక వామపక్షాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. టిడిపి అధికారంలోకి వస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం వామపక్ష నాయకులు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. ఆ పార్టీల పిలుపు మేరకు కడిలెందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉంటారన్న నమ్మకం లేదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అనవసరంగా వామపక్షాల ఇబ్బంది పెట్టకపోయినా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే మాత్రం ఇబ్బందులు సృష్టిస్తారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయి నాయకులు సైతం మౌనం వహించటం తప్పదు.
ఇలా వైసిపి అధికారంలోకి వస్తే ఇతర ప్రతిపక్ష పార్టీలు టిడిపి అధికారంలోకి వస్తే వైసిపి భవిష్యత్తును కోల్పోవడం ఖాయం. ఈ పరిస్థితులు లేని ఏకైక పార్టీ ప్రస్తుతం బిజెపి ఒక్కటే. రాష్ట్ర విభజన అనంతరం ప్రభావాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ సహా ఇతర అన్ని రాజకీయ పక్షాలు మూలన పడి 2029లో బిజెపి అధికారం చేపట్టేందుకు మార్గం ఏర్పడుతుంది. ఆ మేరకు బీజేపీ తగిన వ్యూహాలను రచిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం బిజెపిని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవటం సాధ్యం కాని విషయం. ఇదే ఆ పార్టీకి బలమైన అంశం. 2024 లో వైసిపి లేదా టిడిపి ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన 2029 నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బిజెపి పావులను కదుపుతుంది. ఒకవేళ 2024 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోతే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 2024 లో జరిగే ఎన్నికలు ఒక బిజెపికి తప్ప అన్ని రాజకీయ పక్షాలకు అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోతే వైసీపీ, మరోమారు ఓడితే టిడిపిలు కనుమరుగు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. జనసేన, వామపక్ష పార్టీలు సైతం జనంలో ప్రభావాన్ని కోల్పోతాయి. కేంద్రంలో మరోమారు అధికరంలోకి వస్తే ఒక్క బిజెపి మాత్రం రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అంపశయ్యపై అంతిమ ఘడియలు లెక్కిస్తున్న రాజకీయ పార్టీల్లో ఏ పార్టీకి జనం ఊపిరి పోస్తారు అన్నది తెలియాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

  • వై వి కృష్ణారెడ్డి
    సీనియర్‌ జర్నలిస్ట్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News