Homeఎడిటోరియల్ / బహుళపేరుకేనా ‘ప్రజా’ప్రభుత్వాలు?

పేరుకేనా ‘ప్రజా’ప్రభుత్వాలు?

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు తమవి ‘ప్రజా ప్రభుత్వాలు’ అని చెబుతున్నాయి. కానీ, ఆచరణలో ఏ మేరకు జనాన్ని పట్టించుకుంటున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, కాకతాళీయంగా ఇరు ప్రభుత్వాల అధిపతులు గురు శిష్యులు కాగా, పార్టీలు వేరైనా రాజకీయాన్ని మాత్రం అత్యంత సీరియస్గా తీసుకుంటున్న సంగతి స్పష్టమౌతోంది. తెలంగాణ సీఎం అయితే ఏకంగా తమ రాష్ట్రానికి వచ్చి తాము అమలు చేస్తున్న గ్యారంటీలను పరిశీలించాలని కేరళంలో సీఎం విజయ న్‌ను సవాల్‌ చేశారు. సీపీఎం ప్రభుత్వాన్ని పదేండ్లుగా నడిపిస్తూ విద్యకు 28 శాతం నిధులు కేటాయిం చిన సీఎంను, కేవలం 8 శాతం ఫండ్స్‍ అలాట్‌ చేసిన సీఎం సవాల్‌ చేస్తుండటం గమనిం చొచ్చు. ఇక అమరావతిని ఏపీకి శాశ్వత రాజధాని చేసినట్లు చంద్రబాబు సర్కారు ఆర్భాటపు ప్రకటనలు బోలెడన్నీ చేస్తోంది. మరి అమరావతిలో నిర్మాణాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు? విభజన చట్టం హామీల ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, దుగ్గరాజపట్నం పోర్టు, స్టీల్‌ కర్మాగారంతో పాటు ఉన్నత విద్యా సంస్థలకు ఫండ్స్‍ వంటి అంశాలపై నికరంగా ఏ మేరకు నిధులు తీసుకొచ్చారు? అనే విషయాలను మాత్రం మాట్లాడడం లేదు. ప్రత్యేక హోదా ఊసు అసలు లేకుండా చేశారు.

- Advertisement -

హామీల అమలుపై ప్రశ్నలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతీ నెలా రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, ‘కల్యాణలక్ష్మి’ కింద తులం బంగారం, పింఛన్ల పెంపు, ‘రైతు భరోసా’ పెంపుతో పాటు బోలెడన్ని హామీల గురించి కనీస పట్టింపు కనిపిస్తలేదు. రాజకీయం చేయడంలో మాత్రం సీఎంతో పాటు ఫుల్‌ కేబినెట్‌ కంప్లీట్‌ ఫోకస్ పెట్టేశారు. ప్రజలు ఐదేండ్లు సీఎంగా ఉండాలని తీర్పునిస్తే.. తాను పదేండ్ల పాటు సీఎంగా ఉంటానని, మరోసారి గెలుస్తానంటూ రేవంత్‌ అప్పుడే ధీమాతో ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఎన్నికలకు ఇంకా చాలాకాలం ఉన్నా ఎప్పుడూ ఎన్నికల సభలో మాట్లాడుతున్నట్లుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘బ్రాండ్‌ కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ.. తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అని నిరూపించుకుంటూ.. ఢిల్లీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుంటున్నట్లున్నారు.’  ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారపర్వంలో సీఎం రేవంత్‌ సహా కేబినెట్‌ మంత్రులు బిజీగా ఉన్నారు. ఢిల్లీ అధిష్టానం వద్దకు వారానికోసారి అయినా వెళ్లొస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ పరిస్థితిపై ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి? ఏయే హామీలు అమలు చేయగలం? ఏవి చేయలేం? ఎందుకు చేయలేకపోతున్నాం? అసలు ఏయే విషయాలపై ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు చేస్తున్నాం? అనేది సీఎంకే కాదు కేబినెట్‌లోని మంత్రులకే స్పష్టంగా తెలియనట్లు కనిపిస్తోంది.
___________________________________________________
READ ALSO:

సాంస్కృతిక రంగంలో శాస్త్రీయ భావాలతో ముందుకెళ్లాలి

కులం కావాలా? సమానత్వం కావాలా?

చర్చ పెట్టండి.. నిర్ణయాలు తీసుకోండి

___________________________________________________
ప్రజా ప్రభుత్వంలో ‘జనం పలవరింత’ అత్యంత కీలకం అనే విషయం అయితే మరిచినట్లుగానే కనిపిస్తోంది. విభజిత ఏపీలోనూ దాదాపుగా సేమ్‌ సీన్‌ బట్‌ డిఫరెంట్‌ షేడ్స్‍లో కనిపిస్తోంది. దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్‌, సీఎం చంద్రబాబు సమయం, సందర్భం దొరికిన ప్రతీసారి పీఎం నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఎన్డీయే కూటమిలో భాగస్వాములు అయినందున ఇరువురూ ప్రధానిని పొగిడే విషయంలో పోటీ పడుతున్నట్లు వాతావర ణం క్లియర్‌గా కనిపిస్తోంది. కానీ, నికరంగా విభజిత ఏపీకి సంబంధించిన ఎన్నికల హామీలు ‘సూపర్‌ సిక్స్‍’ గ్యారంటీల అమలు, కేంద్ర సాయంతో రాజధాని నిర్మాణం, విభజన చట్టం హామీలు అన్నింటిపై స్పష్టంగా నోరు తెరిచి సాయం అడిగేందుకు ఎందుకో వెనకడగు వేస్తున్నారు. ‘అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు’ అనే సంగతి బాబు, పవన్‌ మరిచారో ఏమో.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు, రాష్ట్ర హక్కుల సాధన విషయంలో సుతిమెత్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పేరుకే ‘ప్రజా ప్రభుత్వాలా?’ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

– అంబీర్‌ శ్రీకాంత్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News