Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Per capita income: అడకత్తెరలో తలసరి ఆదాయం

Per capita income: అడకత్తెరలో తలసరి ఆదాయం

నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో తలసరి ఆదాయం రూ. 86,647 నుంచి రూ.1.27 లక్షలకు పెరిగింది. అంటే సుమారుగా రెట్టింపయిందన్న మాట. ఇది నిజంగా శుభవార్తే.తలసరి ఆదాయమంటే ఒక వ్యక్తి తాలూకు సగటు వార్షికాదాయం. అయితే, తలసరి ఆదాయాన్ని గణించడంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోవడం జరగదు.ఏది ఏమైనా, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌.ఎస్‌.ఓ) విడుదల చేసిన ఈ వివరాలను బట్టి, దేశం గణనీయంగా ఆర్థికాభివృద్ధి సాధించిందనే అనుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుని గణించినప్సటికీ, 2014-15లో రూ.72,808 ఉన్న ఆదాయం 2022-23 నాటికి రూ.98,118కి అంటే 35 శాతం పెరిగిందంటే అది చెప్పుకోదగ్గ విశేషమే.ఎన్‌.ఎస్‌.ఓ నివేదిక ప్రకారం, కోవిడ్‌ ప్రభావం వల్ల వ్యక్తిగత ఆదాయం కొద్దిగా వెనుక పట్టు పట్టింది. ఆ కాలంలో వాస్తవ ఆదాయాలు బాగా తగ్గాయని అది తెలిపింది. అయితే, 2021 ఏప్రిల్‌ తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పట్టాలెక్కడం ప్రారంభించింది. ఆదాయాల పెరుగుదల మళ్లీ ఊపం దుకుంది.
మరో విధంగా చెప్పాలంటే, ఎన్‌.ఎస్‌.ఓ నివేదిక ప్రకారం, ప్రభుత్వ విధానాలు, వ్యక్తిగత వ్యవస్థాపకత్వం వల్ల దేశంలో వాస్తవ తలసరి ఆదాయం సాలీనా 5.6 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది.ఉచిత ఆహార హక్కు కింద నిత్యావసరాల పంపిణీ, పి.ఎం-కిసాన్‌ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా రైతులకు రూ. 6,000 వంతున నగదు పంపిణీ వంటి ఆర్థిక భాగస్వామ్య విధానాల సానుకూల ప్రభావం కూడా తలసరి ఆదాయం పెరుగుదల మీద ఉందని చెప్పవచ్చు.అయితే, ఈ గణాంకాల లోతుల్లోకి వెడితే, తలసరి ఆదాయం పెరగడమనేది దేశంలో పది శాతం సంపన్నులకు మాత్రమే వర్తిస్తోంది. ఈ పిరమిడ్‌ దిగువ ఉన్నవారికి మాత్రం ఆదాయాలు ఆయేటికాయేడు చిక్కిశల్యమవుతున్నాయి. అందువల్ల దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సంపన్నులు, పేదల మధ్య ఒక అగాధమే ఏర్పడుతోంది. ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది జనవరి 16న దావోస్‌లో ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌; ది ఇండియా స్టోరీ’ అనే నివేదిక ప్రకారం, 2012, 2021 సంవత్సరాల మధ్య భారత్‌ సృష్టించిన సంపదలో 40 శాతం సంపద కేవలం ఒకే ఒక శాతం జనాభాకు మాత్రమే దక్కింది.కేవలం మూడు శాతం మాత్రమేపేదలలో 50 శాతం మందికి అందుబాటులోకి వచ్చింది.‘ది ఇండియా స్టోరీ’ ప్రకారం, 2020లో బిలియనీర్లు లేదా అపర కుబేరులు 106 మంది ఉండేవారు.2022 నాటికి వారి సంఖ్య 336కు పెరిగింది.కాగా, 2018లో 19 కోట్లు ఉన్న నిరుపేదల సంఖ్య 2022 నాటికి 35 కోట్లకు పెరిగిపోయింది.
ఇక దేశంలో పౌష్టికాహార లోపానికి హద్దూ ఆపూ ఉండడం లేదు. ఇది రాను రానూ ఒక పెను సమస్యగా తయారవుతూ, తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా శిశు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరుగుతున్న ఫలితంగా గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు వెళ్లడం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతోంది. అసలే క్రిక్కిరిసిపోయి ఉంటున్న నగరాల పరిస్థితి క్రమంగా మరింత అధ్యానంగా తయారవుతోంది. అందువల్ల ప్రభుత్వం సంపదను పునర్పంపిణీ చేయడానికి తగిన పథకాలు, కార్యక్రమాలు రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాల్సి ఉంది. పేదరికం కారణంగా ఏ విధంగానూ అభ్యున్నతి సాధించలేకపోతున్న నిరుపేదల ఆదాయం కూడా పెరగడానికి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News