Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్PK new party Jan Suraj: ప్రశాంత్‌ కిశోర్‌ వేషం మార్చెన్‌!

PK new party Jan Suraj: ప్రశాంత్‌ కిశోర్‌ వేషం మార్చెన్‌!

ప్రశాంత్‌ కిశోర్‌… ఎన్నికల వ్యూహకర్తగా దేశమంతా పాపులర్‌. దశాబ్దకాలంగా రాజకీయ పార్టీలకు వ్యూహాలు, ఎత్తుగడలు ఇవ్వడంతో బిజీగా ఉన్న వ్యక్తి. తాజాగా ప్రశాంత్‌ కిశోర్‌ ఒక సం చలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు రెండో తేదీ… మహాత్మా గాంధీ జయంతి రోజున రాజకీయ వేత్తగా కొత్త అవతారం ఎత్తుతున్నారు ప్రశాంత్‌ కిశోర్‌. జన్‌ సురాజ్‌ పేరుతో స్వంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌ సురాజ్‌ పార్టీ పోటీ చేయబోతోంది. అంతిమంగా బీహార్‌ రాజకీయాల్లో నితీశ్‌ కుమార్‌ ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడమే ప్రశాంత్‌ కిశోర్‌ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రశాంత్‌ కిశోర్‌ ….పరిచయం అక్కర్లేని పేరు. ప్రశాంత్‌ కిశోర్‌ వేషం మార్చడానికి రెడీ అయ్యారు. దశాబ్ద కాలం పాటు తెరవెనుక ఉండి, రాజకీయ పార్టీలకు దిశా నిర్దేశం చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. ఇన్నేళ్లుగా తెరవెనుక ఉండి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలవడానికి చిట్కాలు చెప్పిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు జనం మధ్యకు రానున్నారు. ఎవరికో ఎత్తుగడలు, వ్యూహాలు అందించే కార్యక్రమానికి బ్రేక్‌ వేసి తానే స్వంతంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఒక రాజకీయ పార్టీ అధి నేతగా ప్రశాంత్‌ కిశోర్‌ అతి త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. జన్‌ సురాజ్‌ పేరుతో ప్రశాంత్‌ కిశోర్‌ ఓ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు. ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీన కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు ప్రశాంత్‌ కిశోర్‌. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడమే ప్రశాంత్‌ కిశోర్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీహార్‌ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వ పనితీరుపై కొంతకాలంగా వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో బీజేపీకి దూరం గా ఉన్న నితీశ్‌ కుమార్‌ కొన్ని నెలల కిందట ప్లేట్‌ ఫిరాయిం చారు. అప్పటి వరకు కొనసాగిన ఇండియా కూటమికి గుడ్‌బై కొట్టారు. రాత్రికి రాత్రి ఎన్డీయే కూటమిలో చేరిపోయారు. బీజేపీ అండతో మళ్లీ బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఇలా ఒక శిబిరం నుంచి మరో శిబిరానికి నితీశ్‌ కుమార్‌ మారడం సగటు బీహారీలకు మింగుడు పడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు బీహార్‌ లో ప్రధాన ప్రతిపక్షంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ మరికొన్ని చిన్నాచితకా పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్నాయి. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌ అటు యాదవులు, ముస్లిం మైనారిటీలను దాటుకుని ఎదగలేకపోతోంది. ఇతర సామాజికవర్గాలను ఆర్జేడీ ఆకట్టుకోలేకపోతోంది. క్షేత్ర స్థాయిలోని ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలంగా మారతాయని ప్రశాంత్‌ కిశోర్‌ భావిస్తున్నారు. జన్‌ సురాజ్‌ అంటే… సుపరిపాలన అని అర్థం. ప్రజలకు ఒక మంచి అలాగే పారదర్శకమైన పాలన అందించడమే తన ధ్యేయమంటున్నారు ప్రశాంత్‌ కిశోర్‌. కాగా స్వంత రాష్ట్రమైన బీహార్‌ నుంచే ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయ ప్రస్థానం మొదలు కాబోతోంది. ఇదిలా ఉంటే స్వంత పార్టీ ఏర్పాటుకు ముందుగానే బీహార్‌లో భావసారూప్యమున్న మిగతా పార్టీలతో ఆయన చర్చలు జరిపినట్లు రాజకీయవర్గాల సమాచారం. అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే జన్‌ సురాజ్‌ పార్టీ.. ప్రస్తుతం బీహార్‌కే పరిమితం అవుతుందని తెలుస్తోంది.
మొదటి నుంచీ నితీశ్‌ వ్యతిరేక రాజకీయాలే
ప్రశాంత్‌ కిశోర్‌ మొదటినుంచి నితీశ్‌ కుమార్‌ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. దాదాపు ఆరేళ్ల కిందట.. నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీలో ఆయన చేరారు. ప్రశాంత్‌ కిశోర్‌కు జేడీయూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చా రు. కొంతకాలం నితీశ్‌ కుమార్‌, ప్రశాంత్‌ కిశోర్‌ కలిసి పని చేశారు. అయితే ఒక దశలో నితీశ్‌ కుమార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ కు విభేదాలు తలెత్తాయి. దీంతో పట్టుమని పదహారు నెలల్లోనే జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ నుంచి ప్రశాంత్‌ కిశోర్‌ బయటకు రావలసి వచ్చింది. ప్రశాంత్‌ కిశోర్‌ స్వంత పార్టీ రాబోతున్న నేపథ్యంలో బీహార్‌ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి పరిశీలిద్దాం.

- Advertisement -

బీహార్‌లో ప్రస్తుతం బీజేపీ – జేడీయూ కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమికి దూరంగా ఉండాలని ప్రశాంత్‌ కిశోర్‌ భావిస్తున్నట్టు పాట్నా రాజకీయ వర్గాల సమాచారం. జన్‌ సురాజ్‌ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా బీహారీ యువతపై ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని ప్రశాంత్‌ కిశోర్‌ భావిస్తున్నట్లు రాజకీయవర్గాల సమాచారం. ఈ పర్యటనల్లో ఆయన ఎక్కువగా యువతతో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద యువతను కేంద్రంగా చేసుకుని బీహార్‌ రాజకీయాల్లో సత్తా చాటాలన్నది ప్రశాంత్‌ కిశోర్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బీహార్లో జన్‌ సురాజ్‌ పార్టీకి ఏ మేరకు అవకాశం ఉందన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. బీహార్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అండతో జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ సర్కార్‌ కొనసాగుతోంది. అంతేకాదు నితీశ్‌ కుమార్‌ ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఒక కీలక నేతగా మారారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి రాలేదు. బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరుకోలేకపోయింది. దీంతో అనివార్యంగా తాజా ఎన్నికల్లో పన్నెండు లోక్‌సభ సీట్లు గెలుచుకున్న జేడీయూపై భారతీయ జనతా పార్టీ ఆధారపడక తప్పడం లేదు. అంతేకాదు కొన్ని రోజుల కిందట కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లోనూ బీహార్‌కు అగ్రతాంబూలం దక్కింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను సాధించుకున్నారు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. ఈ నేపథ్యంలో అటు నరేంద్ర మోదీ ఛరిష్మా ఇటు నితీశ్‌ కుమార్‌ చాణక్యాన్ని తట్టుకుని బీహార్‌ రాజకీయాలలో ప్రశాంత్‌ కిశోర్‌ నిలబడగలరా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే బీహార్‌ రాజకీయాల్లో నితీశ్‌ కుమార్‌ ఆధిపత్యాన్ని సవాల్‌ చేయడమే ప్రశాంత్‌ కిశోర్‌ అంతిమ లక్ష్యం అంటున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు.
2021లో కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నాలు
ప్రశాంత్‌ కిశోర్‌కు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కొన్నేళ్లుగా ఉంది. 2021లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో గుప్పుమన్నాయి. దీనికి ఓ నేపథ్యం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరువాత జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. అప్పటికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఒక్కసారిగా పదవికి రాజీనామా చేశారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఓటమికి తాను నైతిక బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించి రాహుల్‌ రాత్రికి రాత్రి కాడి కింద పడేశారు. దీంతో చాలా కాలం పాటు హస్తినలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేకుండా పోయారు. రాష్ట్రాల్లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులకు సంస్థాగతంగా ఇబ్బందులు ఎదురైతే, ఢిల్లీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే పడవ అనే అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో ప్రబలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లేవారే కానీ, వచ్చేవారు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీకి మరమ్మతులు చేయడానికి ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరతారన్న వార్తలు కొన్ని రోజులపాటు ఢిల్లీ వీథుల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ సందర్బంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రశాంత్‌ కిశోర్‌ సమావేశం కూడా అయ్యారు. అంతేకాదు జూమ్‌లో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా ప్రశాంత్‌ కిశోర్‌ ఇంటరాక్ట్‌ అయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకదశలో కాంగ్రెస్‌లో కొత్తగా ఎన్నికల విభాగం పేరుతో ఒక సెల్‌ ఏర్పాటు చేస్తారనీ, సదరు ప్రత్యేక విభాగానికి ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్‌ కిశోర్‌ పనిచేస్తారన్న ఊహాగానాలు కూడా హస్తిన రాజకీయవర్గాల్లో గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడానికి ప్రశాంత్‌ కిశోర్‌ తట్టాబుట్టా సర్దుకుని చాలాకాలం పాటు వేచి చూశారు. అయితే ఎక్కడో ఏదో జరిగింది. ప్రశాంత్‌ కిశోర్‌ ఎంట్రీని కాంగ్రెస్‌ సీనియర్లు అడ్డుకున్నారా లేక తన స్థాయికి తగిన పదవి ఇవ్వడం లేదని ఆయనే సైలెంట్‌ అయ్యారో తెలియదు. అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీలోకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎంట్రీ జరగలేదు.
ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్‌!
అధికారం కోసం జరిగే యుద్దంలో ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికల్లో గెలవడమే. ఎన్నికలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తుగడలు, వ్యూహాలు.. ఇలా ఉంటాయి. ఎన్నికలంటే ఓ చదరంగం. ఏ పావును ఎక్కడ కదపాలన్న దానిపై అవగాహన అవసరం. ప్రచారంలో ఏ అంశాన్ని ఊదరగొట్టాలో, ఏ ఇష్యూను తొక్కిపట్టేయాలో క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. జనం నాడిని పసిగట్టగలిగి ఉండాలి. అవసరమైతే గాలిని తమకు అనుకూలంగా మార్చుకోగలిగి ఉండాలి. ఈ విద్యలో ఆరితేరినవారే ఎన్నికల్లో గెలుస్తారు. అధికారంలోకి వస్తారు. ఇప్పుడు సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. ఎన్నికల్లో పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. ఆధునిక భారత రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్‌ బీహారీ బాబు ప్రశాంత్‌ కిశోర్‌ ఈ కొత్త కల్చర్‌కు ఆద్యుడు. దశాబ్దం పైగా రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే కార్పొరేట్‌ ప్రొఫెషన్‌ను ఆయన ఇప్పటికీ విజయవంతంగా నడుపుతు న్నారు. కొత్త రాజకీయ పార్టీ సంగతి ఎలాగున్నా మనదేశంలో రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే నయా కార్పొరేట్‌ ప్రొఫెషన్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ ఓ బ్రాండ్‌… అంతే. మరో ముచ్చటే లేదు. తనతో ఒప్పందాలు కుదుర్చుకున్న పార్టీలను ప్రశాంత్‌ కిశోర్‌ గెలుపు తీరాలకు చేర్చారు. మొత్తానికి ప్రశాంత్‌ కిశోర్‌ అతి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు.

  • ఎస్‌. అబ్దుల్‌ ఖాలిక్‌,
    సీనియర్‌ జర్నలిస్ట్‌
    63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News